Paytm Q3 Result: చెల్లింపులు & ఆర్థిక సేవల కంపెనీ పేటీఎం, 2022 డిసెంబర్‌ త్రైమాసికానికి స్టెల్లార్‌ నంబర్లను పోస్ట్‌ చేసింది. Q3లో ఆ కంపెనీ బాగా పుంజుకుంది. 


ఆదాయంలో బలమైన పెరుగుదల
కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం ఏడాది ప్రాతిపదికన (YoY) 42 శాతం పెరిగి రూ. 2062 కోట్లకు (ఈ సంవత్సరం ఇందులో UPI ప్రోత్సాహకాలు నమోదు కాలేదు) చేరుకుంది, గత సంవత్సరం ఇదే కాలంలో ఈ మొత్తం రూ. 1,456 కోట్లుగా ఉంది. త్రైమాసిక ప్రాతిపదికన (QoQ) కూడా తన ఆదాయాన్ని 8 శాతం పెంచుకుంది. 


సగానికి తగ్గిన నష్టం
ఏకీకృత ప్రాతిపదికన, డిసెంబరు త్రైమాసికంలో రూ. 392 కోట్ల నష్టాన్ని పేటీఎం ప్రకటించింది. 2021-22 ఇదే కాలంలోని రూ. 778.4 కోట్ల నష్టంతో పోలిస్తే ఈసారి సగానికి తగ్గింది. నష్టాలు భారీగా తగ్గించుకున్నా, ఈ కంపెనీ ఇప్పటికీ లాస్‌లో కొనసాగుతోందన్న విషయాన్ని ఇన్వెస్టర్లు గుర్తు పెట్టుకోవడం ముఖ్యం.


ఈ త్రైమాసికంలో, Paytm సహకార లాభం (contribution profit) రూ. 1,048 కోట్లు. చెల్లింపుల వ్యాపారం లాభదాయకతలో మెరుగుదల & రుణ పంపిణీ వంటి హై-మార్జిన్ వ్యాపారాల్లో వృద్ధి కారణంగా, కంపెనీ సహకారం లాభం Q3FY23లోని 31%, Q2FY23లోని 44% నుంచి Q3FY23లో 51%కి మెరుగుపడింది. 


Paytm ప్లాట్‌ఫామ్ నుంచి రుణాలు తీసుకునే వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగింది. 2022 డిసెంబర్‌ త్రైమాసికంలో, Paytm ద్వారా తీసుకున్న రుణాల సంఖ్య 137% పెరిగి 10.5 మిలియన్లకు చేరుకుంది. ఈ కాలంలో మొత్తం రూ. 9,958 కోట్ల రుణాలు జారీ అయ్యాయి. కంపెనీ పరోక్ష ఖర్చులు కూడా 2021 డిసెంబర్‌లోని 58 శాతం నుంచి 2022 డిసెంబర్‌లో 49 శాతానికి తగ్గాయి.


పేటీఎంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక సేవల వ్యాపారం [బయ్‌ నౌ పే లేటర్‌ (BNPL), వ్యక్తిగత, వ్యాపార రుణాలు] మొత్తం ఆదాయంలో 21.6% వాటాను కలిగి ఉంది, అంతకు ముందు సంవత్సరం కంటే మూడు రెట్లు పెరిగి రూ. 446 కోట్లకు చేరుకుంది.


కంపెనీ నెట్‌ పేమెంట్స్‌ మార్జిన్ లేదా చెల్లింపుల ఆదాయం ‍(ప్రాసెసింగ్ ఖర్చులను మినహాయించి) అంతకు ముందు సంవత్సరం కంటే రెండింతలు పెరిగి రూ. 459 కోట్లకు చేరుకుంది. నిర్వహణ లాభాల మార్జిన్ అంతకు ముందు సంవత్సరంలోని మైనస్‌ 27% నుంచి మెరుగుపడి ఇప్పుడు ప్లస్‌ 1.5%కి పెరిగింది.


షేర్‌హోల్డర్లకు విజయ్ శేఖర్ శర్మ లేఖ
Paytm వ్యవస్థాపకుడు, CEO అయిన విజయ్ శేఖర్ శర్మ వాటాదారులకు లేఖ రాశారు. "మా బృందం నిబద్ధత, స్థిరమైన పనితీరు కారణంగా ఇది సాధ్యమైంది. వృద్ధి అవకాశాలను కోల్పోకుండా దీనిని సాధించాం. వ్యాపారంలో బలమైన ఆదాయ ఉత్సాహం కొనసాగిందని, ఇకపైనా కొనసాగుతుంది. తర్వాతి దశలో, ఫ్రీ క్యాష్‌ ఫ్లోను ఉత్పత్తి చేసే సంస్థగా పేటీఎం మారుతుందని నేను విశ్వసిస్తున్నాను" అని ఆ లేఖలో పేర్కొన్నారు. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.