ITC Q3 Results: 2022 డిసెంబర్ త్రైమాసికంలో ఫలితాల్లో, టొబాకో కింగ్ ITC అంచనాలకు తగ్గట్లుగా రాణించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఈ సిగరెట్ కంపెనీ నికర లాభం సంవత్సరానికి (YoY) 21% పెరిగి రూ. 5,031 కోట్లకు చేరింది. మార్కెట్ అంచనా వేసిన రూ. 4,605 కోట్ల కంటే ఎక్కువే సంపాదించింది.
కార్యకలాపాల ఆదాయం (Operating Revenue) సంవత్సరానికి 2.3% పెరిగి రూ. 16,226 కోట్లకు చేరుకుంది, మార్కెట్ అంచనా వేసిన రూ. 16,810 కోట్ల కంటే కొంచం వెనుకబడింది.
ITC ఆపరేటింగ్ ప్రాఫిట్ లేదా ఎబిటా (EBITDA) సంవత్సరానికి 25% పెరిగి రూ. 5,183.5 కోట్లకు చేరుకుంది. ఎబిటా మార్జిన్ 574 బేసిస్ పాయింట్లు లేదా 5.74% వృద్ధితో 31.95%కి చేరుకుంది. ఇదొక మంచి నంబర్.
సమీక్ష కాల త్రైమాసికంలో ముడిసరుకుల వ్యయాలు 21% పెరిగి రూ. 4,986.8 కోట్లకు చేరుకున్నాయి. అయినా నిర్వహణ లాభం పెరిగిదంటే దానికి కారణాలు - ఉత్పత్తుల రేట్లను కంపెనీ పెంచడం, మెరుగైన ఉత్పత్తి మిశ్రమం.
డిసెంబర్ త్రైమాసికంలో సిగరెట్ అమ్మకాలు దాదాపు 17% పెరిగి రూ. 7,288.22 కోట్లకు చేరుకున్నాయి. విశ్లేషకులు అంచనా వేసిన 9-11% వృద్ధి కంటే ఇది చాలా చాలా మెరుగ్గా ఉంది.
నాన్-సిగరెట్ విభాగాల్లోనూ బలమైన వృద్ధి
సిగరెట్‌యేతర FMCG వ్యాపారంలో వచ్చిన ఆదాయం 18.4% YoY వృద్ధితో రూ. 4,841.40 కోట్లకు చేరింది.
దేశంలో ప్రయాణ డిమాండ్ బలంగా పుంజుకోవడం వల్ల హోటల్స్ వ్యాపారం కూడా బలపడింది. ఈ విభాగం ఆదాయం ఏకంగా సగానికి సగం (50.5%) YoY వృద్ధితో రూ. 712.4 కోట్లకు చేరుకుంది.
పేపర్ & పేపర్ బోర్డ్ విభాగం ఆదాయం దాదాపు 13% YoY వృద్ధితో రూ. 2,305.54 కోట్లకు చేరుకుంది.
2022 డిసెంబర్ త్రైమాసికంలో వెనుకబడిన ఏకైక విభాగం వ్యవసాయ వ్యాపారం. ఈ సెగ్మెంట్‌లో అమ్మకాలు గత ఏడాది కంటే (YoY) 37% తగ్గి రూ. 3,124 కోట్లకు చేరుకున్నాయి.
సిగరెట్ వ్యాపారంలో పన్నుకు ముందు లాభం (Profit Before Tax - PBT) సంవత్సరానికి దాదాపు 17% వృద్ధితో రూ. 4619.71 కోట్లకు చేరుకోగా, హోటళ్ల వ్యాపారం PBT దాదాపు 3 రెట్లు పెరిగి రూ. 146.15 కోట్లకు చేరుకుంది.
రూ.6 డివిడెండ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022-23), ఒక్కో షేర్ మీద రూ. 6 మధ్యంతర డివిడెండ్‌ను ఈ కంపెనీ ప్రకటించింది. దీనికి సంబంధించిన రికార్డ్ డేట్, చెల్లింపుల తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు.
శుక్రవారం (03 ఫిబ్రవరి 2023) NSEలో ITC షేర్లు 0.5% లాభంతో రూ. 380.65 వద్ద ముగిశాయి.
ALSO READ: రికార్డ్ సృష్టించిన స్టేట్ బ్యాంక్, గతం ఎన్నడూ ఇన్ని లాభాలు కళ్లజూడలేదు
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.