నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బెదిరింపు కాల్స్ మొదలయ్యాయి. వైసీపీ నాయకులు, జగన్ అభిమానులుగా చెప్పుకుంటున్న వ్యక్తులు ఆయన్ను బెదిరించేలా ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా జగన్ కాళ్లపై పడి క్షమాపణ అడగాలంటున్నారు. కడపకు చెందిన బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి కోటంరెడ్డితో జరిపిన ఫోన్ సంభాషణ ఇప్పుడు వైరల్ గా మారుతోంది. బూతులు తిడుతూ, ఎమ్మెల్యేని బండికి కట్టి ఈడ్చుకెళ్తామంటూ ఆ కాల్ లో బోరుగడ్డ అనిల్ కోటంరెడ్డిని హెచ్చరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చేది లేదని అంటున్నారాయన. అయితే ఈ ఫోన్ కాల్ లో ఎక్కడా కోటంరెడ్డి రెట్టించలేదు, ఓపికగా సమాధానం చెప్పారు.


బూతులే బూతులు..


అధికార పార్టీకి సంబంధం లేని నేతలంటే ఏపీలో అందరికీ ఎంత చులకన భావనో ఈ ఫోన్ కాల్ తో అర్థమైపోతుంది. అధికార పార్టీని వీడిన తర్వాత ఎమ్మెల్యే కోటంరెడ్డిని ఏ స్థాయిలో బూతులు తిట్టారంటే వారి ధైర్యం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ ఫోన్ కాల్ మార్ఫింగ్ అనొచ్చు, అందులో తమ గొంతు లేదు అని ఎవరైనా బుకాయించొచ్చు కానీ, ఇలాంటి ఉదాహరణలు చాలామందికే జరిగి ఉంటాయి. అధికారంలో లేని నేతలు ఫిర్యాదు చేస్తే పోలీసులు కూడా పట్టించుకుంటారో లేదో తెలియని పరిస్థితి. అయితే ఈ విషయాలన్నీ ముందుగా బేరీజు వేసుకునే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి బయటకొస్తున్నారనేది మాత్రం స్పష్టమవుతోంది.


ముప్పేట దాడి..


వాస్తవానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎవరిపైనా నిందలు వేయలేదు, ఏ ఒక్కరినీ కించపరిచేలా ప్రెస్ మీట్లలో మాట్లాడలేదు. తనకు అవమానం జరిగింది, తాను పార్టీలో ఉండలేను అన్నారు. అయితే ఆయన టీడీపీలో ఎవరిని కలిశారు, అంతకు ముందు తన సన్నిహితులతో ఫోన్ కాల్స్ లో ఏం మాట్లాడారు, ఎవరిని కించపరిచేలా మాట్లాడారు అనేది మాత్రం తేలడంలేదు. ఆ ఫోన్ కాల్ లో ఆయన అధిష్టానాన్ని తీవ్ర పదజాలంతో మాట్లాడినట్టు మాత్రమే తెలుస్తోంది. అయితే ఆ రికార్డులను అటు అధిష్టానం కానీ, ఇటు కోటంరెడ్డి కానీ బయటపెట్టడంలేదు. ప్రస్తుతానికి కోటంరెడ్డి తాను టీడీపీలోకి వెళ్తాను 2024లో నెల్లూరు రూరల్ కి టీడీపీ టికెట్ పైనే పోటీ చేస్తాననే విషయం మాత్రమే స్పష్టం చేసిన ఆడియో బయటకొచ్చింది. దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు రాజకీయమంతా జరుగుతోంది.


ఓపు నేతలు కోటంరెడ్డిపై దాడి చేస్తున్నారు. అధిష్టానం ఆదేశించిందో లేక స్వతహాగా పార్టీ మెప్పుకోసం ప్రయత్నిస్తున్నారో కానీ, గతంలో ఆయన గురించి తప్పుగా మాట్లాడని వారు కూడా ఇప్పుడు విరుచుకుపడుతున్నారు. ఎమ్మెల్యే అనిల్ కూడా గతంలో ఎప్పుడూ కోటంరెడ్డి గురించి బహిరంగంగా విమర్శలు చేస్తూ వ్యాఖ్యలు చేయలేదు. ఆయన మహానటుడు, సావిత్రిని మించినోడు అంటున్నారు అనిల్. ఇప్పుడు కోటంరెడ్డి పార్టీ మారిన తర్వాత ఆయనపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. మంత్రి కాకాణి కూడా కోటంరెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. అటు పార్టీలోని మిగతా ఎమ్మెల్యేలు మాత్రం ఈ వ్యవహారంతో సంబంధం లేనట్టుగా సైలెంట్ గా ఉన్నారు. కోటంరెడ్డి గురించి జిల్లాలోని మిగతా నాయకులెవరూ స్పందించలేదు. రూరల్ ఇన్ చార్జ్ గా ఆదాల ప్రజల్లోకి వచ్చిన తర్వాత కోటంరెడ్డి గురించి విమర్శలు మొదలవుతాయేమో చూడాలి. ఇటు సామాన్యులు కూడా కోటంరెడ్డికి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. తాజాగా విడుదలైన బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి ఫోన్ కాల్ ఆడియో ఇప్పుడు ఏపీలో వైరల్ గా మారింది.