నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాజకీయ నాయకుడిగా కన్నా నటుడిగా తన సత్తా చూపించగలరని వ్యంగ్యాస్త్రాలు విసిరారు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్. ఆయన ముందు ఎస్వీ రంగారావు, కోట శ్రీనివాసరావు బలాదూర్ అన్నారు. పొరపాటున ఆయన రాజకీయాల్లోకి వచ్చారని, లేకపోతే సినీరంగంలో ఆయన్ను కొట్టేవారు లేరన్నారు. మహానటి సావిత్రి రెండు చుక్కలు కన్నీరు కార్చమంటే, అన్ని చుక్కలే కార్చేవారని, కోటంరెడ్డి ఒక్క చుక్క కన్నీరు కార్చమన్నా అక్కడితోనే సరిపెట్టగల మహా సమర్థుడని అన్నారు. ఆనాడు ఆనం వివేకాకు తానేమీ ద్రోహం చేయలేదని, కాంగ్రెస్ పార్టీ ఆనం వివేకాది కాదని చెప్పారు. కాంగ్రెస్ ను వీడి తనతోపాటు కోటంరెడ్డి కూడా బయటకొచ్చారు కదా అని ప్రశ్నించారు. ఆడియో క్లిప్ పూర్తిగా బయటపెట్టాలన్న తన సవాల్ కి కోటంరెడ్డి సమాధానం ఏంటని అడిగారు. రాజీనామా సవాల్ పై కూడా ఆయన స్పందించలేదని చెప్పారు.
"ఆనం వివేకానందరెడ్డికి పార్టీ లేదు. మనం అందరం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆ పార్టీని వీడారు. అంతకు ముందు 50 శాతం ఓటింగ్ ఉన్న కాంగ్రెస్ ను రెండు శాతానికి పడిపోయింది. కోటి మందికి పైగా కాంగ్రెస్ ను వీడారు. వాళ్లలో నేను ఒక్కడిని. నాతో పాటు నువ్వు కూడా ఉన్నావ్. శ్రీధర్ రెడ్డి పొరపాటున రాజకీయాల్లో వచ్చారు. ఆయన మహానటుడు. జగన్ పై నిందలు సరికాదు. నేను చేసిన సవాల్ కు ఎందుకు స్పందించలేదు"- ఎమ్మెల్యే అనిల్ కుమార్
అనిల్ పై కోటంరెడ్డి ఫైర్
రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాజీ మంత్రి అనిల్ ని టార్గెట్ చేశారు. తమ్ముడు అనిల్, గతం మరచిపోవద్దు అంటూ చురకలంటించారు. కోటంరెడ్డిపై అనిల్ నిన్న ప్రెస్ మీట్లో కాస్త ఘాటుగా మాట్లాడారు. తామిద్దరం జగన్ కి రుణపడి ఉండాలని, అలాంటిది కోటంరెడ్డి, జగన్ ని వ్యతిరేకించి బయటకు వెళ్తున్నారని, అది సరికాదని చెప్పారు. దీనికి కోటంరెడ్డి కౌంటర్ ఇచ్చారు. అనిల్ గతంలో ఎవరెవరికి ఎన్నిసార్లు నమ్మక ద్రోహం చేశారో వివరించారు.
ఆనం వివేకాకు ద్రోహం చేయలేదా?
2009 ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ కి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందని, ఆనం వివేకానే ఆయనకు టికెట్ ఇప్పించారని, ఆ ఎన్నికల్లో ఓడిపోయిన అనిల్, ఆ తర్వాత వివేకాకే ఎదురు తిరిగారని, ఆయన ఇంటిపైకి వెళ్లారని, ఆయన ఇంటిని ధ్వంసం చేస్తామని హెచ్చరించారని గుర్తు చేశారు. టికెట్ ఇచ్చిన ఆనం వివేకాపైకి వెళ్లడం ఆనాడు అనిల్ చేసిన నమ్మక ద్రోహం కాదా అని ప్రశ్నించారు. అనిల్ కుమార్ యాదవ్ జిందాబాద్ అంటూ తాను నినాదాలు చేసిన సందర్భాలున్నాయని, కానీ అనిల్ తనపై అసందర్భంగా మాట్లాడారని మండిపడ్డారు శ్రీధర్ రెడ్డి. అనిల్ కి మంత్రి పదవి వచ్చిన తర్వాత ఆయనకు స్వాగతం పలికింది, నగరంలో ర్యాలీలు చేసింది తానేనని చెప్పారు. అనిల్ ని తన భుజాల మీద మోశానని గుర్తు చేశారు. అలాంటి తమ్ముడు తనపై నిందలు వేయడం సరికాదన్నారు.