Paytm Rupay Credit Card: యూపీఐ యూజర్లు, పేటీఎం ఖాదాదార్లకు గుడ్‌న్యూస్‌. చెల్లింపులను మరింత సులభం, విస్తృతం చేసేలా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (Paytm Payments Bank Ltd - PPBL) ఒక సౌకర్యాన్ని తీసుకొచ్చింది.


'యూపీఐతో రూపే క్రెడిట్ కార్డ్'ను (‘RuPay credit card on లింక్‌ చేసుకునే వెసులుబాటును పేటీఎం ప్రవేశపెట్టింది. అంటే, వినియోగదార్లు తమ రూపే క్రెడిట్ కార్డ్‌లను యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు జత చేసుకోవచ్చు. 


ఇంకా సులభంగా చెప్పాలంటే.. మీ డెబిట్‌ కార్డ్‌ లేదా బ్యాంక్ అకౌంట్లను యూపీఐతో లింక్‌ చేసుకున్నట్లే మీ దగ్గరున్న రుపే క్రెడిట్‌ కార్డ్‌లను కూడా యూపీఐకి లింక్‌ చేసుకోవచ్చు.


తద్వారా, RuPay క్రెడిట్ కార్డ్ హోల్డర్లు UPI సర్వీస్‌ ద్వారా ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్‌లోనూ వ్యాపారులకు చెల్లింపులు చేయవచ్చని పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ వెల్లడించింది.


యూపీఐతో క్రెడిట్‌ కార్డ్‌ లింక్‌ చేయడం వల్ల ఏంటి ప్రయోజనం?
యూపీఐతో రూపే క్రెడిట్‌ కార్డ్‌ను లింక్‌ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు డెబిట్‌ కార్డ్‌ లేకుండానే వ్యాపారుల ఫోన్‌ నంబర్‌కు గానీ, క్యూఆర్‌ కోడ్‌ (QR Code) స్కాన్ చేసి గానీ డబ్బులు పంపుతున్నారు కదా. మీ రుపే క్రెడిట్‌ కార్డ్‌ను యూపీఐకి లింక్‌ చేయడం వల్ల, పేటీఎం ద్వారా ఇవే ప్రయోజనాలను పొందవచ్చు. అంటే, మీరు మీ క్రెడిట్‌ కార్డ్‌ను వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం లేకుండానే, క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి డబ్బులు చెల్లించవచ్చు. మీరు క్రెడిట్‌ కార్డ్‌ను మరిచిపోయి బయటకు వెళ్లినా, చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే సులభంగా షాపింగ్‌ చేయవచ్చు.  తద్వారా, క్రెడిట్‌ కార్డ్‌ను పోగొట్టుకోవడం, బయటి వ్యక్తుల వల్ల కార్డ్‌‌ దుర్వినియోగం వంటి నష్టాలను అరికట్టవచ్చు. 


ప్రస్తుతానికి రుపే క్రెడిట్‌ కార్డ్‌లకు మాత్రమే ఈ వెసులుబాటు అందుబాటులో ఉంది. యూపీఐతో అనుసంధానమయ్యే సౌకర్యం మాస్టర్‌ (Master Credit Card), వీసా క్రెడిట్‌ కార్డ్‌లకు (Visa Credit Card) ఇంకా లేదు.


PPBL చెబుతున్న ప్రకారం... ఈ లింకేజ్‌ వల్ల, తమ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడానికి రూపే కస్టమర్లకు కొత్త మార్గాలు అందుబాటులోకి వస్తాయి, వినియోగం పెరుగుతుంది. తద్వారా, వీధి వ్యాపారుల నుంచి పెద్ద కంపెనీల వరకు ఈ క్రెడిట్ వ్యవస్థ నుంచి ప్రయోజనం పొందవచ్చు.


పెద్ద బ్యాంకులతో చర్చలు
ICICI బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్‌ సతో సహా భారతదేశంలోని పెద్ద బ్యాంకులతో NPCI చర్చలు జరుపుతోంది. ఆయా బ్యాంకులు జారీ చేసే క్రెడిట్‌ కార్డులను UPIతో లింక్‌ చేసే ఆఫర్‌ ప్రకటించడంపై ఈ చర్చలు జరుగుతున్నాయి. 


క్రెడిట్ కార్డ్‌లను UPIతో లింక్ చేయడానికి అనుమతి ఇస్తామని, ఈ సర్వీస్ RuPay క్రెడిట్ కార్డ్‌లతో ప్రారంభం అవుతుందని 2022 జూన్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు.


ఆ తర్వాత, 2022 అక్టోబర్ నెలలో, రూపే క్రెడిట్ కార్డ్ - UPI లింక్ కోసం ఆపరేటింగ్ సర్క్యులర్‌ను NPCI విడుదల చేసింది.


దేశంలోని మొత్తం UPI లావాదేవీలు 2023 జనవరి నెలలో 8 బిలియన్లకు చేరుకున్నాయి. వీటి ద్వారా దాదాపు రూ. 12.98 లక్షల కోట్ల విలువైన చెల్లింపులు జరిగాయి. ఇవన్నీ యూపీఐ - డెబిట్‌ కార్డ్‌ లెక్కలు. ఇప్పుడు, క్రెడిట్‌ కార్డ్‌ కూడా జత కలిస్తే లావాదేవీల సంఖ్య అతి భారీగా పెరుగుతుంది. స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అయింది కాబట్టి, ఇది పేటీఎం స్టాక్‌కు ప్రయోజనం చేకూరుస్తుంది. ఫోన్‌పే (PhonePe) కూడా స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అయ్యే అలోచనల్లో ఉంది.