Paytm Chooses SBI For Its UPI Business: సంక్షోభంలో ఉన్న ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం ఎట్టకేలకు తన పార్ట్‌నర్ బ్యాంకును ఎంపిక చేసుకుంది. రిజర్వ్ బ్యాంక్ (RBI) విధించిన తుది గడువైన మార్చి 15 కంటే ముందే, కొత్త భాగస్వామిని వెదుక్కుంది.
పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్, దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో (SBI) చేతులు కలిపింది. ఇప్పటి వరకు, Paytmకు సంబంధించిన UPI వ్యాపారం దాని అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై (Paytm Payments Bank - PPBL) ఆధారపడి ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), పీపీబీఎల్ లావాదేవీల మీద ఆంక్షలు విధించడంతో, పేటీఎం కొత్త భాగస్వామి బ్యాంకు కోసం ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు, SBI సహకారంతో థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్‌గా (TPAP) మారేందుకు మార్గం సుగమం అయింది.
యాక్సిస్ బ్యాంక్‌కు నోడల్ ఖాతా అప్పగింత
TPAP భాగస్వామ్యం కోసం యాక్సిస్ బ్యాంక్, యెస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో పేటీఎం చర్చలు జరిపింది. ఇప్పుడు, ఆ 3 బ్యాంక్‌లు వెనుకబడ్డాయి, స్టేట్ బ్యాంక్ తెర పైకి వచ్చింది. గత నెలలో, వన్ 97 కమ్యూనికేషన్స్ (One97 Communications) తన నోడల్ అకౌంట్ లేదా ఎస్క్రో ఖాతాను యాక్సిస్ బ్యాంక్‌కు అప్పగించింది. ఈ సమాచారాన్ని BSEకి కూడా అందజేసింది. దానివల్ల, పేటీఎం ద్వారా డిజిటల్ చెల్లింపులను స్వీకరించే వ్యాపారులు మార్చి 15 తర్వాత కూడా ఇబ్బంది లేకుండా వ్యాపారం చేసుకోగలరు.
మార్చి 15 నాటికి TPAP లైసెన్స్
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కూడా, ఆర్‌బీఐ విధించిన తుది గడువైన మార్చి 15 నాటికి, పేటీఎంకు TPAP లైసెన్స్ మంజూరు చేస్తుందని భావిస్తున్నారు. ఈ లైసెన్స్ పొందిన తర్వాత, వినియోగదారులు పేటీఎం UPIని సులభంగా ఉపయోగించవచ్చు. మార్చి 15 తర్వాత, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తన కార్యకలాపాలను క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఈ గడువు ముగిసే లోపు, పేటీఎం చేతిలో TPAP లైసెన్స్ ఉంటుందని సమాచారం. అయితే, భాగస్వామి బ్యాంక్‌కు ఖాతాల అప్పగింతకు ఒక నెల కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది.
22 కంపెనీలకు TPAP లైసెన్స్
TPAP లైసెన్స్ ఉన్న సంస్థలు NPCIతో పాటు భాగస్వామి బ్యాంకుల మార్గదర్శకాలను అనుసరించాలి. UPI లావాదేవీలకు సంబంధించి సమాచారం మొత్తాన్ని RBI, NPCIతో పంచుకోవాలి. ప్రస్తుతం.. అమెజాన్ పే (Amazon Pay), గూగుల్ పే (Google Pay), మొబిక్విక్ (MobiKwik), వాట్సాప్ (WhatsApp) సహా 22 కంపెనీలకు మన దేశంలో TPAP లైసెన్స్ ఉంది. వీటిలో ఎక్కువ సంస్థలకు యాక్సిస్ బ్యాంక్ భాగస్వామి బ్యాంక్‌గా ఉంది.
పేటీఎం, మన దేశంలో మూడో అతి పెద్ద UPI చెల్లింపుల యాప్. 2024 ఫిబ్రవరిలో, ఈ కంపెనీ సుమారు రూ. 1.65 లక్షల కోట్ల విలువైన 1.41 బిలియన్ లావాదేవీలను ప్రాసెస్ చేసింది. ఫోన్ పే, గూగుల్ పే కూడా పేమెంట్స్ సెగ్మెంట్‌లో ఉన్న అతి పెద్ద ప్లేయర్లు.
మరో ఆసక్తికర కథనం: గోల్డ్ కాదు, సిల్వర్ ఇస్తోంది షాక్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే