Paytm:
డిజిటల్ చెల్లింపుల కంపెనీ పేటీఎం మరో బిజినెస్ అప్‌డేట్ ఇచ్చింది. 2023, ఆగస్టుతో ముగిసిన రెండు నెలల ఆపరేటింగ్ పెర్ఫామెన్స్ గురించి వివరించింది. పేటీఎం యాప్‌లో కన్జూమర్ ఎంగేజ్‌మెంట్ పెరిగిందని వెల్లడించింది. చివరి రెండు నెలల్లో నెలవారీ లావాదేవీలు చేస్తున్న యూజర్ల (MTU) సంఖ్య సగటున 9.4 కోట్లుగా ఉందని తెలిపింది. వార్షిక ప్రాతిపదికన 20 శాతం వృద్ధి నమోదైందని వివరించింది.
పేమెంట్ మానిటైజేషన్‌లో తమ నాయకత్వాన్ని పటిష్ఠం చేసుకుంటున్నామని పేటీఎం తెలిపింది. ఆగస్టు నాటికి 87 లక్షల పేమెంట్ డివైజులను మోహరించామని పేర్కొంది. వార్షిక ప్రాతిపదికన 42 లక్షల డివైజులు పెరిగాయని వెల్లడించింది. ప్రతి నెల 5 లక్షల డివైజుల పెరుగుదల నమోదైంది.
'వ్యాపారస్థులు మా డివైజ్‌లను ఎక్కువగా వాడుతుండటంతో సబ్‌స్క్రిప్షన్ రెవెన్యూ, చెల్లింపుల లావాదేవీలు పెరుగుతున్నాయి. వీటితో పాటు మా మర్చంట్ రుణాల విడుదల పెరిగింది' అని పేటీఎం స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో ఫైల్ చేసింది.
పేటీఎం ఈ మధ్యే పేటీఎం కార్డు సౌండ్‌బాక్స్ (Paytm card sound box), పేటీఎం పాకెట్ సౌండ్‌బాక్స్, పేటీఎం మ్యూజిక్ సౌండ్ బాక్స్‌లను (Paytm music sound box) మార్కెట్లో విడుదల చేసింది. ఇన్-స్టోర్ పేమెంట్స్‌లో మార్కెట్ లీడర్‌షిప్ పెంచుకుంటోంది. మొబైల్ పేమెంట్స్, వీసా, మాస్టర్‌కార్డు, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, రూపే వంటి క్రెడిట్ డెబిట్ కార్డుల పేమెంట్లను పేటీఎం కార్డ్ సౌండ్‌బాక్స్ అనుమతిస్తోంది. వ్యాపారస్థులు బ్లూటూత్ ద్వారా పేటీఎం మ్యూజిక్ బాక్స్‌కు కనెక్ట్ అవ్వొచ్చు. సంగీతం, మ్యాచ్ కామెంటరీని ఆస్వాదించొచ్చు.
మర్చంట్ పేమెంట్స్ వాల్యూమ్‌లోనూ (MPV) వృద్ధి కనిపించింది. జులై, ఆగస్టులో ప్రాసెస్ చేసిన మొత్తం మర్చంట్ జీఎంవీ విలువ రూ.3 లక్షల కోట్లుగా ఉంది. అంటే వార్షిక ప్రాతిపదికన 43 శాతం వృద్ధి సాధించింది.
'ఈఎంఐ, కార్డుల వంటి యూపీఏ యేతర జీఎంవీ పెరగడాన్ని మేం గమనించాం. చెల్లింపుల లావాదేవీ వృద్ధితో మా లాభదాయకత పెరుగుతోంది. నెట్ పేమెంట్స్ మార్జిన్, నేరుగా అమ్మకాల ద్వారానూ లాభాలు వస్తున్నాయి' అని పేటీఎం తెలిపింది.
పేటీఎం రుణాల వ్యాపారమూ పెరిగింది. వివిధ కంపెనీలతో కలిసి రుణాలు కస్టమర్లకు ఇస్తున్న రుణాల సంఖ్య పెరిగింది. జులై, ఆగస్టులో వార్షిక ప్రాతిపదికన రుణాల్లో వృద్ధి 137 శాతంగా నమోదైంది. రూ.10,710 కోట్లకు చేరుకుంది. ఈ క్వార్టర్లో పేటీఎం యాప్ ద్వారా ఇప్పటి వరకు విడుదల చేసిన రుణాలు విలువ రూ.88 లక్షలుగా ఉంది. అంటే 47 శాతం పెరిగింది. పేటీఎం పోస్టు పెయిడ్ క్రెడిట్ క్వాలిటీ సైతం పెరిగింది. కాగా 2024 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ ఆపరేషన్స్ రెవెన్యూ 39 శాతం పెరిగి రూ.2,342 కోట్లకు పెరిగింది.
పేటీఎం షేర్లు బుధవారం మధ్యాహ్నం రూ.17.25 పెరిగి రూ.898 వద్ద కొనసాగుతున్నాయి.
Also Read: సూపర్ డూపర్ అప్‌డేట్ - షేర్లు అమ్మినా, కొన్నా తక్షణమే సెటిల్‌మెంట్
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.