Indian Stock Market: స్టాక్ మార్కెట్‌లో షేర్లు కొని, అమ్మేవాళ్లకు (ట్రేడర్లు, ఇన్వెస్టర్లు) శుభవార్త. ఇకపై షేర్లు కొన్నా, అమ్మినా ఇన్‌స్టాంట్‌ సెటిల్‌మెంట్‌ జరుగుతుంది. అంటే, తక్షణమే డబ్బు, షేర్లు అకౌంట్స్‌లో క్రెడిట్‌ అవుతాయి. దీనిని వచ్చే సంవత్సరంలో అమల్లోకి తేవడానికి స్టాక్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (Securities and Exchange Board of India - SEBI) సిద్ధమవుతోందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. 


ఇన్‌స్టాంట్‌ సెటిల్‌మెంట్‌ కంటే ముందే, ఒక గంటలో సెటిల్‌మెంట్‌ సైకిల్‌కు (one hour settlement cycle) కూడా సెబీ సిద్ధంగా ఉందని సమాచారం. వీటికోసం రోడ్‌మ్యాప్స్‌ కూడా సిద్ధం చేసిందని తెలుస్తోంది.


ప్రస్తుతం T+1 సెటిల్‌మెంట్‌ సైకిల్‌
ప్రస్తుతం, ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లలో ఒక రోజులో సెటిల్‌మెంట్‌ (T+1 లేదా one day settlement ) సైకిల్‌ నడుస్తోంది. దీని ప్రకారం, ఇన్వెస్టర్లు షేర్లను కొనుగోలు చేసేటప్పుడు వారి డీమ్యాట్ ఖాతాలోకి ఆ షేర్లు జమ కావడానికి, లేదా షేర్లను విక్రయించినప్పుడు ఖాతాలో డబ్బు జమ కావడానికి ఒక రోజు పైగా పడుతోంది. గతంలో ఇది "T+2"గా (ట్రేడింగ్‌ డే + 2 డేస్‌) ఉండేది. సెబీ దానిని "T+1"కు తగ్గించింది. T+1 సెటిల్‌మెంట్ సైకిల్‌ను పాటిస్తున్న దేశాలు చాలా తక్కువగా ఉన్నాయి, వాటిలో భారతదేశం ఒకటి.


ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి (2024 మార్చి నాటికి) వన్‌ అవర్‌ సెటిల్‌మెంట్‌ సైకిల్‌ను అమలు చేయాలని సెబీ నిర్ణయించినట్లు సమాచారం. దీనికి సెబీ టెక్నికల్‌గా సిద్ధంగా ఉందని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమలవుతుందన్న ఆత్మవిశ్వాసంతో ఉందని సెబీ అధికారులు చెబుతున్నారు.


ట్రేడర్లు, ఇన్వెస్టర్ల సమస్య తీరుతుంది
ప్రస్తుతం అమలవుతున్న T+1 సెటిల్‌మెంట్ వల్ల, ఇన్వెస్టర్ కొనుగోలు చేసిన షేర్లు ఆ తర్వాతి రోజున డీమ్యాట్ ఖాతాలో క్రెడిట్ అవుతున్నాయి. ఈలోగా ఆ షేర్‌ ధర కుప్పకూలితే, తక్షణం ఆ షేర్లను వదిలించుకునే వీలు లేక ఇన్వెస్టర్‌ నష్టపోవాల్సి వస్తోంది. మరోవైపు... షేర్లను అమ్మితే, అతనికి 24 నుంచి 36 గంటల తర్వాత దాని తాలూకు డబ్బు అకౌంట్‌లోకి వస్తోంది. షేర్లను అమ్మిన వెంటనే డబ్బు చేతికి రాకపోవడంతో, వెంటనే వేరే ట్రేడ్‌ తీసుకోవడానికి వీల్లేకుండా పోతోంది. అంటే... అటు షేర్లు, ఇటు డబ్బు రెండూ 24 గంటలు పైగా బ్లాక్‌ అవుతున్నాయి. దీనివల్ల.. మార్కెట్‌లో వచ్చే మార్పులకు తగ్గట్లుగా వెంటనే అడ్జస్ట్‌మెంట్లు చేసుకోవడం కుదరడం లేదు. ప్రయోజనాలను అందుకోలేకపోగా, నష్టపోవాల్సి వస్తోంది. వన్‌ అవర్‌ సెటిల్‌మెంట్‌, తక్షణ సెటిల్‌మెంట్ సైకిల్స్‌ అమలులోకి వస్తే ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. 


సెటిల్‌మెంట్‌ సైకిల్స్‌ తగ్గించడంపై, ముఖ్యంగా తక్షణ సెటిల్‌మెంట్‌ అమలుపై కొంతమంది ఫారిన్‌ ఇన్వెస్టర్లు ఆందోళనలు వ్యక్తం చేశారు. ఫారెక్స్‌లో (forex) ఎప్పటికప్పుడు వచ్చే మార్పుల నేపథ్యంలో వాళ్లు కొన్ని అభ్యంతరాలు లేవనెత్తారు. ఇన్‌స్టాంట్‌ సెటిల్‌మెంట్లు ఆప్షనల్‌ అని, వద్దనుకున్నప్పుడు ఆ సైకిల్‌ నుంచి బయటకు రావొచ్చని సెబీ అధికారులు చెబుతున్నారు.


మరో ఆసక్తికర కథనం: కరుణ చూపిన పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial