NRI Deposit Schemes: ప్రవాస భారతీయులు గత కొంతకాలంగా డాలర్లను వెదజల్లుతున్నారు. పెద్ద మొత్తంలో డబ్బును స్వదేశానికి (భారతదేశానికి) పంపుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో, ఎన్నారైలు లేదా ఓవర్సీస్‌ ఇండియన్స్‌ (Overseas Indians) వివిధ ఎన్నారై డిపాజిట్ పథకాల్లో ఒక బిలియన్ డాలర్లకు పైగా డిపాజిట్ చేశారు. 


ఇటీవల, రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన డేటా ప్రకారం... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో (ఏప్రిల్ 2024), ప్రవాస భారతీయులు వివిధ NRI డిపాజిట్ స్కీముల్లో 1.08 బిలియన్‌ డాలర్లను డిపాజిట్ చేశారు. దీనిని రూపాయల్లో చెప్పుకుంటే, 9,000 కోట్ల రూపాయల పైమాటే. 


సరిగ్గా ఏడాది క్రితం, 2023 ఏప్రిల్‌ నెలలో 150 మిలియన్‌ డాలర్లను NRI డిపాజిట్ స్కీముల నుంచి ప్రవాస భారతీయులు విత్‌డ్రా చేశారు. ఏడాదిలో పరిస్థితి రివర్స్‌ అయింది, భారీగా పెట్టుబడులు తిరిగి వచ్చాయి. 2024 ఏప్రిల్‌లో వచ్చిన డబ్బుతో కలిపి, ప్రవాస భారతీయుల మొత్తం డిపాజిట్ల విలువ 153 బిలియన్ డాలర్లకు చేరుకుంది.


రెండు పథకాల్లోకి గరిష్ట డిపాజిట్లు
భారత ప్రభుత్వం, ప్రవాస భారతీయుల కోసం చాలా డిపాజిట్ పథకాలను అమలు చేస్తోంది. వాటిలో, FCNR (ఫారిన్‌ కరెన్సీ నాన్ రెసిడెంట్) ఖాతా ఎక్కువ మందిని ఆకర్షించింది. ఏప్రిల్ నెలలో డిపాజిట్లు పెరిగిన పథకాల్లో రెండు రకాల FCNR ఖాతాలు ప్రముఖ పాత్ర పోషించాయి. అవి... 
1. ఫారిన్‌ కరెన్సీ నాన్ రెసిడెంట్ (బ్యాంక్స్‌) లేదా FCNR (B)               
2. నాన్ రెసిడెంట్ ఎక్స్‌టర్నల్ రూపీ అకౌంట్‌ లేదా NRE (RA)                     


రిజర్వ్‌ బ్యాంక్‌ డేటా ప్రకారం, ఈ ఏడాది ఏప్రిల్ నెలలో, 583 మిలియన్‌ డాలర్ల విలువైన డిపాజిట్లు NRE (RA) కిందకు వచ్చాయి. 483 మిలియన్‌ డాలర్ల విలువైన డిపాజిట్లను FCNR (B)లో డిపాజిట్ చేశారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడుతున్నప్పుడు FCNR (B) ఖాతా లాభదాయకంగా మారుతుంది. దీనికి కారణం, అటువంటి ఖాతాల్లో విదేశీ మారకానికి సంబంధించిన రిస్క్‌ను డిపాజిట్‌ తీసుకునే బ్యాంకులే భరిస్తాయి. అంటే, డాలర్‌తో రూపాయి విలువ బలహీనపడితే ఆ నష్టాన్ని బ్యాంకులే భరిస్తాయి. NRE (RA)లో దీనికి రివర్స్‌లో జరుగుతుంది, రిస్క్ డిపాజిటర్ వద్దనే ఉంటుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలపడుతున్న సమయంలో ఇది లాభదాయకమైన ఒప్పందంగా మారుతుంది.


డిపాజిట్ల పెరుగుదల వల్ల ఆర్థిక ప్రయోజనాలు
FCNR ఖాతాలోని డిపాజిట్లపై వచ్చే రాబడులు పెరిగితే, విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు ఆ ఖాతాలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇటీవలి నెలల్లో ఈ అకౌంట్స్‌పై వచ్చే రిటర్న్స్‌ పెరిగాయి. అందువల్లే నాన్‌ రెసిడెంట్‌ ఇండియన్స్‌ ఆ ఖాతాల్లోకి భారీ మొత్తంలో డాలర్లను కుమ్మరిస్తున్నారు. NRI డిపాజిట్ల ద్వారా భారతదేశంలోకి విలువైన విదేశీ మారక ద్రవ్యం వచ్చి చేరుతుంది. ఆర్థిక వ్యవస్థకు ఇది బలం చేకూరుస్తుంది.


మరో ఆసక్తికర కథనం: పసిడి కోసం ఎగబడుతున్న కేంద్ర బ్యాంక్‌లు - బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం!