Nazara Technologies - Delta Corp Shares: గుర్రపు పందాలు, క్యాసినోలు, ఆన్‌లైన్‌ గేమింగ్స్‌ మీద 28% GST విధించడానికి జీఎస్‌టీ కౌన్సిల్ ఓకే చెప్పడంతో, ఆన్‌లైన్‌ గేమింగ్‌ కంపెనీల స్టాక్స్‌ బాగా నష్టపోయాయి. ఇవాళ్టి (బుధవారం, 12 జులై 2023) ట్రేడింగ్‌లో... డిజిటల్ గేమింగ్ & ఎస్పోర్ట్స్ కంపెనీ నజారా టెక్నాలజీస్ (Nazara Tech) 14% పైగా పతనం కాగా, డెల్టా కార్ప్ (Delta Corp) 25% లోయర్ సర్క్యూట్‌ను తాకింది. 


జీఎస్‌టీ కౌన్సిల్ నిర్ణయం దేశంలోని ఆన్‌లైన్ గేమింగ్ ఇండస్ట్రీకి పెద్ద ఎదురుదెబ్బ.  నైపుణ్యం/అదృష్టం అనే వర్గీకరణ లేకుండా, అన్ని రకాల ఆన్‌లైన్ గేమింగ్స్‌లో పూర్తి పందెం విలువపై 28% GST వర్తిస్తుంది.


డెల్టా కార్ప్‌ ఢమాల్‌ - పుంజుకున్న నజారా టెక్నాలజీస్‌
ఉదయం 11.10 గంటల సమయానికి, డెల్టా కార్ప్‌ షేర్లు 25% పతనమై రూ. 185.10 వద్దకు చేరకున్నాయి. అదే సమయానికి, నజారా టెక్నాలజీస్ షేర్లు 14% పతనం నుంచి బౌన్స్‌ బ్యాక్‌ అయ్యాయి, 3.34% తగ్గి రూ. 682.90 వద్ద ట్రేడవుతున్నాయి. 


28% GST ప్రభావం తమ వ్యాపారంపై చాలా తక్కువగా ఉంటుందని ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో నజారా టెక్నాలజీస్‌ తెలిపింది. ఆన్‌లైన్ గేమింగ్‌పై 28% GST నిర్ణయం, తన వ్యాపారంలోని స్కిల్‌-బేస్‌డ్‌ రియల్ మనీ గేమింగ్ సెగ్మెంట్‌కు మాత్రమే వర్తిస్తుందని, FY23లో ఈ సెగ్మెంట్‌ నుంచి కంపెనీకి వచ్చిన ఆదాయం 5.2% మాత్రమేనని పేర్కొంది. కాబట్టి, కంపెనీ ఆదాయంపై తక్కువ ఎఫెక్ట్స్‌ను ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నట్లు వెల్లడించింది.


ఆన్ లైన్ గేమింగ్, కాసినోలపై 28 శాతం జీఎస్టీ విధిస్తూ తీసుకున్న నిర్ణయం ఏ ఒక్క పరిశ్రమనో టార్గెట్‌ చేసినట్లు కాదని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌లు, కేసినోల ఇండస్ట్రీని దెబ్బ తీయాలన్నది తమ ఉద్దేశం కాదన్నారు. జీఎస్టీ కౌన్సిల్‌లోని  సభ్యులందరి అంగీకారం ప్రకారమే ఈ నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. క్యాసినో అనుమతులు ఉన్న గోవా, సిక్కిం రాష్ట్రాల ప్రతినిధుల నుంచి కూడా అభిప్రాయం తీసుకున్నామని వివరించారు. దేశంలోని యువత ఆన్‌లైన్‌ గేమింగ్‌కు బానిసలు కాకుండా చూసేందుకే గరిష్ట పన్ను విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.


ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ, EY ఉమ్మడి రిపోర్ట్‌ ప్రకారం... ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు 2022లో రూ. 13,500 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి. 2023లో రూ. 16,700 కోట్లు, 2025లో రూ. 23,100 కోట్ల రెవెన్యూ సాధించగలవని ఆ రిపోర్ట్‌ అంచనా వేసింది.


మరో ఆసక్తికర కథనం: ఇప్పటివరకు ఐటీఆర్‌ సమర్పించిన వాళ్లు 2 కోట్ల మంది, మీరెప్పుడు ఫైల్‌ చేస్తారు?


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial