HDFC Bank Offline Digital Payments: దేశంలోని అతి పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) ఆఫ్‌లైన్ డిజిటల్ చెల్లింపుల సౌకర్యాన్ని ప్రారంభించింది. తొలుత, పైలట్ ప్రాజెక్ట్‌ ఈ ఫెసిలటీని ప్రారంభించింది.       


క్రంచ్‌ఫిష్‌ (Crunchfish) కంపెనీతో కలిసి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఈ ప్రయోగం చేస్తోంది. ఆఫ్‌లైన్ డిజిటల్ పేమెంట్స్‌ సొల్యూషన్స్‌లో భాగంగా వ్యాపారులు & వినియోగదార్ల కోసం ఈ సౌకర్యాన్ని తీసుకు వచ్చింది. ఆర్‌బీఐ రెగ్యులేటరీ శాండ్‌బాక్స్ ప్రోగ్రాం (RBI Regulatory Sandbox Program) కింద ఈ ఆఫ్‌లైన్ పే ప్రారంభమైంది.


మొబైల్‌లో నెట్‌వర్క్ లేకపోయినా ఇబ్బంది ఉండదు              
మొబైల్‌ నెట్‌వర్క్‌ లేకపోయినా, HDFC బ్యాంక్ ఆఫ్‌లైన్ పే కింద అటు కస్టమర్‌లు & ఇటు వ్యాపారులు చెల్లింపులు చేయగలరు & చెల్లింపులను స్వీకరించగలరు. 


మన దేశంలో ఆఫ్‌లైన్ మోడ్‌లో డిజిటల్ చెల్లింపుల పరిష్కారాన్ని ప్రారంభించిన మొదటి బ్యాంక్‌గా HDFC బ్యాంక్ ఇప్పుడు అవతరించింది. మొబైల్ నెట్‌వర్క్ తక్కువగా ఉన్నప్పటికీ HDFC బ్యాంక్ ఆఫ్‌లైన్ పే సౌకర్యంతో ఇబ్బంది ఉండదు. మొబైల్‌ నెట్‌వర్క్‌ బలహీనంగా ఉండే చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లోనూ ఈ విధానం ద్వారా సులభంగా డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు.


నెట్‌వర్క్ బ్లైండ్ స్పాట్‌లలో పనికొస్తుంది                        
మొబైల్ నెట్‌వర్క్‌ రద్దీ ఎక్కువగా ఉండే నగర ప్రాంతాల్లోనూ ఇది ఉపయోగపడుతుంది. భారీ పబ్లిక్ ఈవెంట్‌లు, ట్రేడ్ ఫెయిర్స్‌, ఎగ్జిబిషన్లలోనూ నగదు రహిత చెల్లింపులను ఆఫ్‌లైన్‌ పే కింద సులభంగా చేయవచ్చు. అదే విధంగా, సిగ్నల్స్‌ వీక్‌గా ఉండే భూగర్భ మెట్రో స్టేషన్లు, పార్కింగ్ స్థలాలు, నెట్‌వర్క్ బ్లైండ్ స్పాట్‌లు అయిన రిటైల్ స్టోర్లలో లావాదేవీలు సులభంగా చేయవచ్చు. విమానాలు, రైళ్లు లేదా నౌకల్లో కూడా నెట్‌వర్క్ లేకుండా చెల్లింపు చేయవచ్చు. ఈ రకమైన చెల్లింపుల విధానంలో, RBI రెగ్యులేటరీ శాండ్‌బాక్స్ ప్రోగ్రాం కింద పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభమైన మొదటి డిజిటల్ పేమెంట్స్‌ సొల్యూషన్‌ ఇది.               


RBI శాండ్‌బాక్స్ ప్రోగ్రాం కింద, బ్యాంక్‌ రెగ్యులేటర్‌తో కలిసి ఈ ప్రాజెక్ట్‌ మీద HDFC బ్యాంక్ గట్టిగా పని చేస్తోంది. RBI ద్వారా, Crunchfish భాగస్వామ్యంతో 2022 సెప్టెంబర్ నెలలో HDFC బ్యాంక్‌కు చెందిన ఈ ఆఫ్‌లైన్‌ పేమెంట్‌ అప్లికేషన్‌ను డెవలప్‌ చేశారు. RBI నుంచి ఇది గ్రీన్ సిగ్నల్ పొందింది, తద్వారా దీనిని రెగ్యులేటరీ శాండ్‌బాక్స్ నుంచి యాక్సెస్ చేయవచ్చు. క్రంచ్ ఫిష్ డిజిటల్ క్యాష్ AB అనేది నాస్‌డాక్‌లో లిస్టయిన క్రంచ్ ఫిష్ ABకి చెందిన అనుబంధ సంస్థ.               


HDFC బ్యాంక్ ప్రారంభించిన పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే, దేశంలో ఆఫ్‌లైన్ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది.