పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ మాన్ రెండోసారి తెలంగాణ పర్యటనకు వచ్చారు. సిద్దిపేట జిల్లాలో ఆయన పర్యటించారు. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ను పరిశీలించారు. ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను తెలంగాణ నీటిపారుదలశాఖ అధికారులు పంజాబ్ సీఎంకు వివరించారు. కాళేశ్వరం నుంచి 618 మీటర్ల ఎత్తులో కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ఉన్నదని, 15 టీఎంసీల సామర్థ్యంతో ఈ రిజర్వాయర్‌ను ప్రభుత్వం నిర్మించిందని నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. ఇది 2,85,280 ఎకరాలకు సాగు నీరు అందిస్తుందని వివరించారు. అనంతరం కొండపోచమ్మ సాగర్ పంపు హౌస్‌ను, తొగుటలోని మల్లన్న సాగర్ ప్రాజెక్టును సీఎం భగవంత్ సింగ్ మాన్ సందర్శించనున్నారు.
పంజాబ్ లో భూగర్భ జలాలను పెంపొందించే లక్ష్యంతో ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ సింగ్ తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఇక్కడ భూగర్భ జలాల పెరుగుదలకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మోడల్‌ను స్వయంగా పరిశీలించనున్నారు. అందుకోసం ఆయన పంజాబ్ నీటిపారుదల అధికారులతో పాటు తెలంగాణ పర్యటనకు వచ్చారు. తెలంగాణలో గ్రామాల్లో తెలంగాణ ప్రభుత్వం కట్టించిన చిన్న చిన్న డ్యామ్‌ల వల్ల భూగర్భ జలాలు 2 మీటర్ల వరకూ పెరిగాయి.
ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి గజ్వేల్ కి పంజాబ్ సీఎం బయలుదేరి వెళ్లారు. కొండపోచమ్మ రిజర్వాయర్, మల్లన్నసాగర్, మర్ముక్ పంప్ హౌస్, పాండవుల చెరువును ఆయన పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, దాని అనుబంధ ప్రాజెక్టుల వల్ల భూగర్భజలాల పెరుగుదల, మిషన్ కాకతీయ గురించి పంజాబ్ సీఎం బృందానికి నీటిపారుదల అధికారులు తెలియజేశారు. భూగర్భ జలాలను పరిరక్షించేందుకు కొన్నేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పనులను భగవంత్ మాన్ బృందం పరిశీలించింది. మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ, చెక్ డ్యామ్ ల నిర్మాణం తదితర పనులను అధ్యయనం చేశారు. భూగర్భ జలాల పరిరక్షణ కోసం తీసుకున్న చర్యలను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు తిరిగివెళ్లారు.
‘‘పంజాబ్‌లోని నీటిని కాపాడేందుకు పని చేస్తున్నాం. కొత్త సాంకేతిక పరిజ్ఞానం గురించి సమాచారం తెలుసుకునేందుకు నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి తెలంగాణ డ్యామ్‌ను పరిశీలించేందుకు వచ్చాం. భూగర్భ జలాలను ఆదా చేసే సాంకేతికత గురించి సమాచారాన్ని తెలుసుకుంటాం. తెలంగాణ ప్రభుత్వం భూగర్భ జలాలను కాపాడేందుకు గ్రామాల్లో చిన్న డ్యామ్‌లు నిర్మించింది. వాటి వల్ల ఇక్కడ భూగర్భ జలాలు 2 మీటర్ల వరకు పెరిగాయి’’ అని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ ట్వీట్ చేశారు. ఇదే రోజు సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరి వెళ్తారు.