Adani Stocks -NSE: ఇండియన్‌ స్టాక్ మార్కెట్‌లో రెండు వారాలుగా భారీగా పతనమవుతూ, మొత్తం మార్కెట్‌ను కూడా ఒత్తిడిలోకి నెట్టాయి అదానీ గ్రూప్‌ స్టాక్స్‌. ఈ రెండు వారాలుగా, అదానీ గ్రూప్‌ కంపెనీల గురించి రోజుకు తక్కువలో తక్కువగా రెండు కొత్త వార్తలైనా బయటకు వస్తున్నాయి. తాజాగా.. అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్‌ మీద మరో న్యూస్‌ బయటకు వచ్చింది, ఇవి రెండూ మార్కెట్‌ ఫోకస్‌లోకి వచ్చాయి.


అదానీ గ్రూప్‌లోని అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్‌ స్టాక్స్‌ మీద నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ NSE నిన్న (సోమవారం, 07 ఫిబ్రవరి 2023) ఒక అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ రెండు స్టాక్స్‌ సర్క్యూట్ పరిమితిని 5 శాతానికి సవరించింది.
అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్‌ స్టాక్స్‌ పెట్టుబడిదార్లను NSE నిర్ణయం నేరుగా ప్రభావితం చేస్తుంది.


గత వారమే సర్క్యూట్‌ బ్యాండ్‌లో మార్పు 
అమెరికన్‌ షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌ సహా ఆ తర్వాత చోటు చేసుకున్న వరుస పరిణామాల నేపథ్యంలో అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు విపరీతంగా పతనం అయ్యాయి, ఇన్వెస్టర్లు రోడ్డున పడ్డారు. కనీసం తదుపరి నష్టాలనైనా గణనీయంగా తగ్గించడానికి.. అదానీ గ్రీన్ ఎనర్జీ & అదానీ ట్రాన్స్‌మిషన్ షేర్ల అప్‌ & డౌన్‌ సర్క్యూట్‌లను అంతకుముందు ఉన్న 20 శాతం నుంచి 10 శాతానికి నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సవరించింది, గత వారంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఆ 10 శాతాన్ని 5 శాతానికి మార్చింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్ షేర్లకు సంబంధించి ఎలాంటి పెద్ద కదలిక వచ్చినా, దాని ప్రభావాన్ని బాగా తగ్గించడానికి, తద్వారా పెట్టుబడిదారులకు భారీ నష్టాలు వచ్చే అవకాశాన్ని నివారించడానికి NSE ఈ మార్పు చేసింది.


అదానీ గ్రూపు విలువ 49% డౌన్‌
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత, గత 9 ట్రేడింగ్ రోజుల్లో, అదానీ గ్రూప్‌లోని 10 లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్ విలువ రూ. 9.5 లక్షల కోట్లు, అంటే దాదాపు 49 శాతం పడిపోయింది. ఈ వారం తొలి రోజైన సోమవారం నాడు, ట్రేడింగ్ ముగిసే సమయానికి అదానీ గ్రూప్‌లోని 10 కంపెనీల్లో ఆరు షేర్లు నష్టాల్లో ముగిశాయి. అదానీ ట్రాన్స్‌మిషన్ షేరు 10 శాతం పతనమవగా, అదానీ టోటల్ గ్యాస్, అదానీ పవర్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ విల్మార్ షేర్లు ఐదు శాతం పతనంతో లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.


అదానీ ట్రాన్స్‌మిషన్ త్రైమాసిక ఫలితాలు
అదానీ ట్రాన్స్‌మిషన్, 2022 డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాలను సోమవారం ప్రకటించింది, అద్భుతమైన గణాంకాలను నివేదించింది. ఆ త్రైమాసికంలో, కంపెనీ లాభం గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 73 శాతం పెరిగింది, రూ. 478.15 కోట్లకు చేరింది. 2021 డిసెంబర్‌ త్రైమాసికంలో ఇది రూ. 283.75 కోట్లుగా ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.