NSE Reduces Index Lot Size: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), తన బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ నిఫ్టీ50 సహా వివిధ డెరివేటివ్స్ కాంట్రాక్ట్‌ల లాట్ సైజ్‌ల్లో మార్పులు చేసింది. మంగళవారం NSE జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం... నిఫ్టీ50, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ మిడ్‌ క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్‌ల డెరివేటివ్ కాంట్రాక్ట్‌ల లాట్ సైజ్ మారింది. ఈ మూడు డెరివేటివ్ కాంట్రాక్టుల లాట్ సైజులు ఇకపై తగ్గుతాయి. 


పెట్టుబడిదార్లకు ఇష్టమైన నిఫ్టీ బ్యాంక్ (Nifty Bank) డెరివేటివ్ కాంట్రాక్ట్ పరిమాణంలో ఎలాంటి మార్పు లేదు.


బాగా తగ్గిన లాట్ సైజ్‌లు


ఇకపై, నిఫ్టీ50 డెరివేటివ్ కాంట్రాక్టుల్లో లాట్ సైజ్‌ 25గా (Nifty50 New Lot Size) ఉంటుందని NSE ప్రకటించింది. ఇప్పటి వరకు ఉన్న లాట్ సైజ్‌ 50. 


నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్‌ లాట్ సైజ్‌ 40కి బదులుగా 25కు ‍‌(Nifty Financial Services New Lot Size) మారుతుంది.


నిఫ్టీ మిడ్‌ క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ లాట్ సైజ్ ఇప్పుడు 75 నుంచి 50కి (Nifty Mid Cap Select Index New Lot Size) పరిమితం అవుతుంది.


నిఫ్టీ బ్యాంక్ లాట్ పరిమాణం మునుపటి లాగే 15గా (Nifty Bank Lot Size) ఉంటుంది.


కొత్త రూల్స్‌ ఎప్పటి నుంచి అమలు?
మార్కెట్‌ రెగ్యులేటర్‌ SEBI సెట్ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా లాట్‌ సైజ్‌లు సవరించినట్లు ఆ సర్క్యులర్‌లో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ వెల్లడించింది. సర్క్యులర్ ప్రకారం, ఈ సూచీల పరిమాణంలో మార్పులు ఈ నెల 26 నుంచి అమల్లోకి వస్తాయి. అంటే, 26 ఏప్రిల్‌ 2024 నుంచి.. నిఫ్టీ 50, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ మిడ్‌ క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్‌లు చిన్నవిగా మారతాయి.


నిఫ్టీ 50 ఇండెక్స్‌కు సంబంధించి.. అన్ని వారపు, నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక కాంట్రాక్టులు ఏప్రిల్ 26 నుంచి కొత్త లాట్ సైజ్‌లోకి మారతాయి. ఏప్రిల్ సిరీస్‌కు ఈ మార్పులు వర్తించవు. సవరించిన లాట్ సైజ్‌లో మొదటి వీక్లీ ఎక్స్‌పైరీ మే 02న ఉంటుంది, మొదటి మంత్లీ ఎక్స్‌పైరీ మే 30న ఉంటుంది. 


నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ మిడ్‌ క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్‌ల విషయంలో... ఏప్రిల్, మే, జూన్ సిరీస్‌ల ప్రస్తుత వారపు, నెలవారీ గడువులు ముగిసే వరకు ఈ మార్పులు వర్తించవు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: కేవలం రెండేళ్లలో భారీ ఆదాయం, ఎస్‌బీఐ ప్రత్యేక పథకం