Forbes Report On World's Strongest Currency: ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీ ఏది అని అడిగితే చాలా మంది ఠక్కున చెప్పే సమాధానం అమెరికన్ డాలర్. ప్రపంచ దేశాలను డాలర్ శాసిస్తుంది. అంతర్జాతీయంగా వ్యాపారాలు ఎక్కువ శాతం డాలర్లలోనే జరుగుతాయి. డాలర్లకు అంత విలువ ఉంటుంది మరి. అయితే ప్రపంచలో విలువైన కరెన్సీ మాత్రం డాలర్ కాదు. అవును మీరు చదువుతున్నది నిజమే. అమెరికన్ డాలర్‌ను మించి విలువ ఉన్న కరెన్సీలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి.
ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీ ఏదైనా ఉందంటే అది కువైట్ దినార్ మాత్రమే. అమెరికన్ డాలర్ ఆధిపత్యం ఉన్నప్పటికి, కువైట్ దినార్ ప్రపంచంలోనే బలమైన కరెన్సీగా ప్రకటించబడింది. బహ్రెయిన్ దినార్ రెండో స్థానంలో, ఒమాన్ రియాల్ మూడో స్థానంలో ఉంది. అందరు అనుకునే అమెరికన్ డాలర్ జాబితాలో 10వ స్థానంలో ఉంది. ఐక్యరాజ్యసమితి ప్రస్తుతం 180 కరెన్సీలను చట్టబద్ధమైనవిగా గుర్తిస్తుంది. అయితే ప్రజాదరణ, వినియోగం కరెన్సీ విలువకు సమానం కాదని ఫోర్బ్స్ నివేదిక తెలిపింది.
ఇటీవల ప్రపంచ దేశాల కరెన్సీలపై ఫోర్బ్స్ నివేదిక ఇచ్చింది. విదేశీ కరెన్సీతో పోలిస్తే స్వదేశీ కరెన్సీతో కొనుగోలు చేయగల వస్తువులు, సేవల సంఖ్యను మూల్యాంకనం చేయడం ద్వారా కరెన్సీ విలువ నిర్ణయించబడుతుందని నివేదిక పేర్కొంది.
ఫోర్బ్స్ జాబితా ప్రకారం ప్రపంచంలో టాప్ 10 కరెన్సీలు
ఫోర్బ్స్ ప్రకారం ప్రపంచంలో శక్తిమంతమైన కరెన్సీ
1. కువైట్ దినార్ (రూ. 270.23)
2. బహ్రెయినీ దినార్ (రూ. 220.44)
3. ఒమనీ రియాల్ (రూ. 215.84)
4. జోర్దడానియన్ దినార్ (రూ.117.1)
5. జిబ్రాల్టర్ పౌండ్ (రూ.105.54)
6. బ్రిటిష్ పౌండ్ (రూ.105.54)
7. కేమన్ ఐల్యాండ్ డాలర్ (రూ.99.76)
8. స్విస్ ఫ్రాంక్ (రూ.97.54)
9. యూరో (రూ.90.89)
10. డాలర్ (రూ.83.1)
15వ స్థానంలో ఇండియన్ రూపాయి ఉంది
కువైట్ తన కరెన్సీ దినార్‌ను 1960లో ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీగా కొనసాగుతోంది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, చమురు నిల్వలు, పన్ను రహిత వ్యవస్థ కారణంగా కువైట్ ఆర్థిక స్థిరత్వం సాధించింది. ఫలితంగా ఆ దేశ కరెన్సీకి అధిక డిమాండ్ ఏర్పడింది. ఈ రోజు ఒక కువైట్ దినార్ ఇండియన్ కరెన్సీలో రూ.270.10లకు సమానం
ప్రపంచ వ్యాప్తంగా వర్తక వ్యాపారం చేస్తున్న అమెరికన్ డాలర్ జాబితాలో పదవ స్థానంలో ఉంది. యూరోపియన్ యూనియన్‌లోని 19 సభ్య దేశాలను కలిగి ఉన్న యూరోజోన్ అధికారిక కరెన్సీ అయిన యూరో తొమ్మిదో స్థానంలో ఉంది. అమెరికన్ డాలర్ల తరువాత ప్రపంచంలో ఎక్కువగా యూరోనే ఉపయోగిస్తారు.
రూపాయి వర్సెస్ డాలర్
అంతకు ముందు రోజు అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి 3 పైసలు క్షీణించి 83.15 వద్దకు చేరుకుంది. ఇంటర్ బ్యాంక్ విదేశీ మారకం వద్ద, దేశీయ కరెన్సీ 83.13 వద్ద ప్రారంభమైంది. డాలర్‌తో పోలిస్తే 83.15కి పడిపోయింది.