Stock Market Holiday on Bakrid: స్టాక్‌ మార్కెట్లు నిన్న (బుధవారం, 28 జూన్‌ 2023) సరికొత్త లైఫ్‌ టైమ్‌ హై చేరుకున్నాయి. నిఫ్టీ50 19,000 పీక్‌ను, సెన్సెక్స్‌30 64,000 మార్క్‌ను దాటడంతో దలాల్‌ స్ట్రీట్‌లో క్రాకర్స్‌ పేలాయి. ఇన్వెస్టర్ల ముఖాలు మతాబుల్లా వెలిగాయి.


'లైఫ్‌ టైమ్‌ హై'స్‌లో హెడ్‌లైన్‌ ఇండెక్స్‌లు


NSE నిఫ్టీ 18,908 వద్ద ఓపెన్‌ అయింది. 18,861 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని, 19,011 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఇది నిఫ్టీ50 లైఫ్‌ టైమ్‌ పీక్‌ లెవెల్‌. మొత్తంగా 154 పాయింట్ల లాభంతో 18,972 వద్ద క్లోజైంది. 


BSE సెన్సెక్స్‌ 63,701 వద్ద ప్రారంభమైంది. 63,554 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 64,050 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఇది సెన్సెక్స్‌ జీవన కాల గరిష్టం. చివరికి 499 పాయింట్ల లాభంతో 63,915 వద్ద ముగిసింది.


డాలర్‌తో పోలిస్తే రూపాయి 82.05 వద్ద స్థిరపడింది.


ఇవాళ స్టాక్‌ మార్కెట్లకు బక్రీద్‌ సెలవు


ఇవాళ (గురువారం, 29 జూన్ 2023) దేశవ్యాప్తంగా ఈద్-ఉల్-అజా (బక్రీద్) జరుపుకుంటున్నారు. కాబట్టి, దేశంలోని ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజీలు బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు (NSE) సెలవు ప్రకటించారు. గతంలో విడుదల చేసిన హాలిడేస్‌ లిస్ట్‌లో, స్టాక్‌ మార్కెట్‌కు జూన్ 28న (బుధవారం) బక్రీద్‌ సెలవు ప్రకటించారు. అయితే, మహారాష్ట్ర ప్రభుత్వం జూన్ 29న బక్రీద్‌ పబ్లిక్‌ హాలిడే ప్రకటించింది. దానికి అనుగుణంగా, రెండు ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజీలు సెలవు రోజును బుధవారం నుంచి గురువారానికి మార్చాయి.


ఒకరోజు ముందే ముగిసిన ఐడియాఫోర్జ్‌ IPO సబ్‌స్క్రిప్షన్
స్టాక్ మార్కెట్‌ సెలవు రోజులో మార్పు కారణంగా, ఐడియాఫోర్జ్‌ టెక్నాలజీ టెక్నాలజీ లిమిటెడ్‌ IPO (ideaForge Technology Limited IPO) సబ్‌స్క్రిప్షన్ తేదీ కూడా మారింది. ఇంతకుముందు షెడ్యూల్‌ ప్రకారం, ఈ IPO జూన్ 29, 2023 వరకు ఓపెన్‌లో ఉంటుంది. గురువారం సెలవు రావడంతో బుధవారంతో సబ్‌స్క్రిప్షన్ అవకాశం ముగిసింది.


జూన్ నెలలో స్టాక్ మార్కెట్‌కు వచ్చిన ఏకైక సెలవు రోజు బక్రీద్‌. ఈ ఏడాది స్టాక్ మార్కెట్‌కు మొత్తం 15 సెలవులు (శని, ఆదివారాలు కాకుండా) ప్రకటించారు. బక్రీద్ తర్వాత, ఆగస్ట్ 15న, భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్టాక్ మార్కెట్ సెలవు ఉంటుంది.


2023లో మిగిలివున్న స్టాక్ మార్కెట్‌ సెలవులు:


ఆగస్ట్ 15, 2023 - స్వాతంత్ర్య దినోత్సవం కారణంగా సెలవు
సెప్టెంబర్ 19, 2023 - గణేష్ చతుర్థి కారణంగా సెలవు
అక్టోబర్ 2, 2023 - గాంధీ జయంతి కారణంగా సెలవు
అక్టోబర్ 24, 2023 - దసరా కారణంగా సెలవు
నవంబర్ 14, 2023 - దీపావళి కారణంగా సెలవు
నవంబర్ 27, 2023 - గురునానక్ జయంతి కారణంగా సెలవు
డిసెంబర్ 25, 2023 - క్రిస్మస్ కారణంగా సెలవు


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: హైదరాబాద్‌లో ఇల్లు కొనగలమా?, ముంబయిలోనూ ఆ రేంజ్‌లో రేట్లు పెరగలేదు!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial