Google Penaly Case Update: ప్రపంచంలోనే అతి పెద్ద టెక్ దిగ్గజం గూగుల్‌కు (Google) ఇండియా టైమ్ కలిసి రావడం లేదు. భారతదేశంలో దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. సుప్రీంకోర్టులోనూ ఈ టెక్ జెయింట్‌కు చుక్కెదురైంది.
గూగుల్ మీద కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) విధించిన జరిమానాకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై మధ్యంతర ఉపశమనం ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశంపై తదుపరి విచారణను బుధవారానికి (జనవరి 18, 2023) వాయిదా వేసింది.
గూగుల్‌కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూ. 1,338 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. మొబైల్ యాప్స్ వ్యవస్థలో తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసినందుకు Google ఈ జరిమానాను ఎదుర్కొంటోంది. గూగుల్ సుప్రీంకోర్టుకు వెళ్లడానికి ముందు నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్‌లోనూ (NCLAT) అప్పీల్ చేసింది. అక్కడ కూడా ఊరట దొరకలేదు. సీసీఐ విధించిన జరిమానా మీద మధ్యంతర ఉపశమనం ఇవ్వడానికి NCLAT కూడా నిరాకరించింది.
సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి D.Y. చంద్రచూడ్ (Chief Justice DY Chandrachud) నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం గూగుల్ పిటిషన్ మీద విచారణ జరిపింది. ఆ కంపెనీకి మధ్యంతర ఉపశమనం ఇవ్వడానికి సున్నితంగా తిరస్కరించింది. యూరప్ ప్రమాణాలను భారతదేశంలో అమలు చేయవచ్చా, లేదా అని గూగుల్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది A.M. సింఘ్వీని ధర్మాసనం ప్రశ్నించింది. అంతకు ముందు, గూగుల్ న్యాయవాది సింఘ్వీ ఈ పిటిషన్‌ను అత్యవసర కేసుగా పేర్కొంటూ తక్షణ విచారణకు విజ్ఞప్తి చేశారు.
NCLAT నుంచీ ఉపశమనం లభించలేదు
సుప్రీంకోర్టుకు వెళ్లడానికి ముందు నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను (NCLAT) ఆశ్రయించిన గూగుల్, అక్కడ కూడా ఊరట పొందలేకపోయింది. CCI ఇచ్చిన పెనాల్టీ ఆర్డర్ మీద స్టే ఇవ్వడానికి 2023 జనవరి 4న జరిగిన విచారణలో ట్రైబ్యునల్ నిరాకరించింది. ఆర్డర్ వచ్చిన రెండు నెలల తర్వాత, 2022 డిసెంబర్ 20న ఈ అప్పీల్ చేశారని, అంతకాలం ఎందుకు ఆగాల్సి వచ్చిందని ప్రశ్నించింది. CCI ఆర్డర్ జనవరి 19, 2023 నుంచి అమల్లోకి వస్తుందని, దానికి ఒక నెల ముందు NCLATలో అప్పీల్ చేసినట్లు గూగుల్ తన పిటిషన్‌లో పేర్కొంది. జరిమానా మొత్తంలో (రూ. 936.44 కోట్లు) 10 శాతం సొమ్మును (రూ. 93.64 కోట్లు) మరో నాలుగు వారాల్లో తమ రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేయాలని కూడా ఆదేశించింది.
కేసు పూర్వాపరాలు
మొబైల్ ఆండ్రాయిడ్ యాప్స్ విషయంలో పోటీ చట్టం నిబంధనలను దెబ్బ తీసేలా గూగుల్ వ్యవహరిస్తోదంటూ, అక్టోబర్‌లో 2022లో రెండు విడదలుగా ( 1,337.76 కోట్లు + 936.44 కోట్లు) దాదాపు రూ. 2,274 కోట్ల జరిమానాను ఆ కంపెనీ మీద CCI విధించింది. 97 శాతం మొబైల్ ఫోన్లలో వినియోగించే ఆండ్రాయిడ్ సిస్టంలో ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసినందుకు రూ. 1,337.76 కోట్ల జరిమానా విధించింది. ప్లే స్టోర్‌కు సంబంధించిన పాలసీలకు సంబంధించి రూ. 936.44 కోట్ల జరిమానా విధించింది.