No Income Tax: భారతదేశంలో, భారత పౌరుడు సంపాదించే ఆదాయం మీద ఆదాయ పన్ను చెల్లించాలి. నిర్దిష్ట పరిమితి కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఆదాయం ఉన్నా, ఆ వ్యక్తి ఆదాయపు పన్ను పత్రాలు (ITR) సమర్పించాలి, (Income Tax) కట్టాలి. 


ప్రస్తుతం, మన దేశంలో రెండు రకాల పన్ను విధానాలు అమల్లో ఉన్నాయి. వాటిలో ఒకటి పాత పన్ను విధానం, మరొకటి కొత్త పన్ను విధానం. పాత పన్ను విధానం ప్రకారం రూ. 5 లక్షల ఆదాయం వరకు ఏ వ్యక్తీ ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదు. అదే విధంగా, కొత్త పన్ను విధానం ప్రకారం, రూ. 7 లక్షల ఆదాయం వరకు ప్రతి వ్యక్తికీ పన్ను మినహాయింపు ప్రయోజనం అందుబాటులో ఉంది. వీటన్నింటి మధ్య, ఒక్క రూపాయి కూడా ఆదాయపు పన్ను చెల్లించని రాష్ట్రం దేశంలోనే ఉందని మీకు తెలుసా?, ఆ రాష్ట్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేని రాష్ట్ర ప్రజలు  
ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేని రాష్ట్రం పేరు సిక్కిం (No Income Tax in Sikkim). దేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న సిక్కిం రాష్ట్రం మన దేశంలో, ప్రపంచంలో పకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది. ఈ రాష్ట్రానికి దేశ, విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. పర్యాటక రంగం రూపంలో ఈ రాష్ట్ర ప్రజలు మంచి ఆదాయం ఆర్జిస్తుంటారు. విశేషం ఏంటంటే... తాము సంపాదించే ఆదాయం మీద ఈ రాష్ట్ర ప్రజలకు మినహాయింపు ఉంది. ఈ రాష్ట్రంలోని 95 శాతం మంది ప్రజలు ఒక్క రూపాయి ఆదాయపు పన్ను కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికి ఒక కారణం ఉంది.


ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఎందుకు?
ఆదాయ పన్ను నుంచి మినహాయింపునకు దశాబ్దాల నాటి కారణం ఉంది. ఇండియన్‌ యూనియన్‌లో సిక్కిం రాష్ట్రం విలీనమైన సమయంలో, భారత ప్రభుత్వంతో ఈ రాష్ట్రం ప్రత్యేక ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం సిక్కిం రాష్ట్ర ప్రజలకు పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు సౌకర్యం లభించింది. 


ఆర్టికల్ 371A (Article 371A in The Constitution Of India 1949) ప్రకారం సిక్కిం రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్ర హోదా వచ్చింది. దీంతో ఇతర రాష్ట్రాల ప్రజలు ఈ రాష్ట్రంలో ఆస్తులు కూడా కొనలేని పరిస్థితి నెలకొంది. అదే సమయంలో, ఈ రాష్ట్రంలోని అసలైన నివాసితులు ఆదాయపు పన్ను 1961లోని సెక్షన్ 10 (26AAA) కింద ఆదాయపు పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు ప్రయోజనాన్ని పొందుతున్నారు.


పాన్ కార్డ్ విషయంలో కూడా మినహాయింపు 
ఆదాయపు పన్ను చెల్లింపు మినహాయింపుతో పాటు, మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కూడా సిక్కిం నివాసితులకు పాన్ కార్డు (Pan Card) వినియోగంపై మినహాయింపు ఇచ్చింది. భారతదేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు షేర్ మార్కెట్ (Share Market), మ్యూచువల్ ఫండ్స్‌లో ‍‌(Mutual Fund) పెట్టుబడి పెట్టాలంటే పాన్ కార్డ్ కచ్చితంగా అవసరం. అయితే, ఈ విషయంలో సిక్కిం ప్రజలకు మినహాయింపు ఉంది. వాళ్లు పాన్ కార్డ్ లేకుండా కూడా షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టవచ్చు.