Patanjali Mega Food  Hearbal Park: నాగ్‌పూర్‌లోని    MIHAN (మల్టీ-మోడల్ ఇంటర్నేషనల్ కార్గో హబ్ అండ్ ఎయిర్‌పోర్ట్) వద్ద పతంజలి ఫుడ్ అండ్ హర్బల్ పార్క్‌ను కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. కరవుతో అల్లాడే  విదర్భ ప్రాంత రైతుల దుస్థితిని ఈ ప్లాంట్ పొగొడుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.  కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పతంజలి సహ వ్యవస్థాపకుడు బాబా రాందేవ్, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ హాజరయ్యారు. 


విదర్భ రైతులకు ఊరట


గడ్కరీ మాట్లాడుతూ, ఈ కొత్త ఫుడ్ పార్క్ విదర్భ రైతులకు ఎంతో అవసరమైన ఉపశమనం కలిగిస్తుందని, ముఖ్యంగా  తీవ్ర వ్యవసాయ సంక్షోభంతో ఆత్మహత్యలు జరిగే ఈ ప్రాంతంలో  ప్లాంట్ ఏర్పాటు రైతుల వెతలను తీరుస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.


నారింజ రైతులకు మద్దతు & ఎగుమతుల సవాళ్లు


విదర్భ నారింజల నాణ్యతను మెరుగుపర్చడానికి, ఉత్పత్తిని పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని గడ్కరీ తెలిపారు. విదర్భ నారింజలు బంగ్లాదేశ్‌కు ఎగుమతవుతున్నప్పటికీ, బంగ్లాదేశ్ ప్రభుత్వం విధించిన 85% దిగుమతి సుంకం వల్ల లాజిస్టిక్ ఖర్చులు పెరుగుతున్నాయని చెప్పారు.  "బంగ్లాదేశ్ మాజీ ప్రధాని గారితో నేను మాట్లాడినప్పుడు, మనం వడ్డీ రేటును తగ్గిస్తే, వారు ఈ సుంకాన్ని తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు" అని గడ్కరీ తెలిపారు. 


లాజిస్టిక్ ఖర్చులను తగ్గించేందుకు, వార్ధా (Wardha) లో డ్రై పోర్ట్  నిర్మించనున్నట్లు గడ్కరీ ప్రకటించారు. ఇక్కడ నుంచి నేరుగా పశ్చిమ బెంగాల్‌లోని హాల్దియాకు సరుకులను రవాణా చేయడం ద్వారా, అక్కడి నుంచి బంగ్లాదేశ్‌కు తక్కువ ఖర్చుతో పంపే అవకాశం ఉందని తెలిపారు. 


"విదర్భ రైతులు చాలా కాలం నిర్లక్ష్యానికి గురయ్యారు. ఈ ఫుడ్ పార్క్ ,ఇతర కార్యక్రమాల ద్వారా రైతులు ఆత్మహత్యలు చేసుకునే దైన్య స్థితి మారుతుందని ఆశిద్దాం" అని గడ్కరీ స్పష్టం చేశారు. 


రైతులకు వరం- మహరాష్ట్ర సీఎం ఫడ్నవీస్


మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ   కొత్త ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఈ  ప్రాంత బతుకుచిత్రాన్ని మార్చి రైతులకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. 


"ఈ ఫుడ్ పార్క్ నారింజ రైతులకు వరంగా మారుతుంది" అని ఫడ్నవీస్ అన్నారు. ఇక్కడ నారింజలను గ్రేడింగ్ చేసి, తొక్క,  గింజలతో సహా అన్ని భాగాలను ఉపయోగించే విధంగా ప్రాసెస్ చేయబడతాయి దీని వల్ల రైతులకు మెరుగైన ఆదాయం అందుతుంది”  అన్నారు. కేవలం నారింజలు మాత్రమే కాకుండా ఇతర పండ్లను కూడా ప్రాసెస్ చేసే సౌకర్యాలు ఉన్నందున రైతులకు మరింత ప్రయోజనకారిగా ఉంటుందన్నారు.


కేంద్ర మంత్రి గడ్కరీ మాట్లాడుతూ, తన సొంత నారింజ తోటల్లోనూ డ్రోన్లు, ఎలక్ట్రానిక్ ట్రాక్టర్లను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. పతంజలి ఫుడ్ అండ్ హర్బల్ పార్క్‌కు పూర్తి మద్దతు అందించనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. 


"బాబా రాందేవ్ ఆశీర్వాదంతో నాకు 11 గౌరవ డాక్టరేట్ డిగ్రీలు లభించాయి, అందులో 6 వ్యవసాయ రంగానికి సంబంధించినవే. రైతుల కోసం అన్ని విధాలుగా మద్దతు అందిస్తాను" అని గడ్కరీ అన్నారు. 


ఇదే సందర్భంలో, ఆధునిక వ్యవసాయ విధానాలపై రైతులను శిక్షణ ఇవ్వడానికి "అగ్రో విజన్" (Agro Vision) ప్రాజెక్ట్ కింద ఓ కొత్త ప్రయోగశాల (laboratory) ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. 


(PTI సౌజన్యంతో)