New Rules Effected From March 1st: మరో 2 రోజుల్లో కొత్త నెలలోకి ప్రవేశిస్తున్నాం.సాధారణంగా కొత్త నెల ప్రారంభంలో నిబంధనల్లో కొన్ని మార్పులు సహజం. అలాగే, మార్చి 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. మార్చితో ఆర్థిక ఏడాది ముగుస్తోన్న నేపథ్యంలో చాలా ముఖ్యమైనదిగా ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలో నిబంధనలపై సామాన్యులు అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు. మార్చిలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు, క్రెడిట్ కార్డ్స్, జీఎస్టీ వంటి వాటికి సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. మరి ఆ రూల్స్ ఏంటో ఇక్కడ తెలుసుకోండి.


ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు ప్రతి నెలా 1వ తేదీన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు సమీక్షిస్తాయి. కొన్నిసార్లు నెల రెండో అర్ధ భాగంలోనూ మారుస్తారు. అయితే, ఫిబ్రవరి 1న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు పెంచగా.. గృహ వినియోగానికి సంబంధించి సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఈ క్రమంలో ఈసారి డొమెస్టిక్ సిలిండర్ ధరలు పెంచే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అలా చేస్తే సామాన్యులపై భారమనే చెప్పాలి.


దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్రెడిట్ కార్డులకు సంబంధించి కొత్త నిబంధనలను మార్చి నుంచి తీసుకొస్తోంది. క్రెడిట్ కార్డుల మినిమమ్ డే బిల్ కాలిక్యులేషన్ ప్రక్రియలో పలు మార్పులు చేసినట్లు తెలిపింది. న్యూ రూల్స్ మార్చి 15 నుంచి అమల్లోకి వస్తాయని ఎస్బీఐ స్ఫష్టం చేసింది. ఈ మేరకు తమ క్రెడిట్ కార్డు కస్టమర్లకు ఈ - మెయిల్స్ ద్వారా సమాచారం అందిస్తోంది.


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇవి మార్చి 15వ తేదీ తర్వాతే అమల్లోకి వస్తాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఇక బ్యాంకింగ్ సేవలు నిర్వహించకూడదని.. కొత్త కస్టమర్లను చేర్చుకోవడం, డిపాజిట్ల సేకరణ, వాలెట్ లోడింగ్ వంటి కార్యకలాపాలను నిర్వహించొద్దని ఆర్బీఐ జనవరి 31న ఆదేశించింది. తొలుత ఫిబ్రవరి 29 వరకు గడువు విధించగా.. పేటీఎం కస్టమర్ల సౌలభ్యం దృష్ట్యా మార్చి 15 వరకూ ఆంక్షలను వాయిదా వేసింది.


మార్చి 1 నుంచి వస్తు సేవల పన్ను GSTకి సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. మార్చి నుంచి వ్యాపారులు కచ్చితంగా ఈ - ఇన్ వాయిస్ ఇవ్వాల్సి ఉంటుంది. రూ.5 కోట్లు ఆ పైన టర్నోవర్ ఉండి, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఎగుమతి, దిగుమతులు చేసే వారు కచ్చితంగా ఇ - వే బిల్లులు ఇవ్వాలి. కొందరు ఇ - ఇన్ వాయిస్ లేకుండానే ఇ - వే బిల్లులు జారీ చేస్తున్నట్లు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొస్తోంది. ఇ - ఇన్ వాయిస్ ఇస్తేనే ఇ - వే బిల్లు జారీ అయ్యేలా మార్పులు చేసింది. జీఎస్టీ రూల్స్ ప్రకారం రూ.50 వేల పైన విక్రయాలు జరిపితే కచ్చితంగా ఇ - బిల్స్ ఇవ్వాలి. అయితే, మార్చి 1 నుంచి ఇ - ఇన్ వాయిస్ లేకుండా ఇ - బిల్ ఇవ్వడం కుదరదు.


చాలా మంది వ్యాపారులు బీ2బీ, బీ2ఈ పన్ను చెల్లింపుదారులతో ఇ - ఇన్ వాయిస్ లతో లింక్ చేయకుండానే ఇ - వే బిల్లులు జారీ చేస్తూ ట్రాన్సాక్షన్స్ జరుపుతున్నారని కేంద్ర జాతీయ సమాచార కేంద్రం (ఎన్ఐసీ) గుర్తించింది. ఈ క్రమంలో ఇ - వే బిల్లులు, ఇ - చలాన్ల నమోదు సరిపోలడం లేదు. దీంతో నిబంధనలు కఠినతరం చేసింది. 


Also Read: Reliance Capital: హిందూజా గ్రూప్‌ చేతికి రిలయన్స్ క్యాపిటల్‌ - ఎన్‌సీఎల్‌టీ నుంచి ఆమోదం