Hyderabad Latest News: హైదరాబాద్ లో ఓ హైకోర్టు రిటైర్డ్ జడ్జి మోసపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి విరాళాల పేరుతో మోసం జరిగినట్లు తెలుస్తోంది. రాజకీయ పార్టీకి బాండ్ల ద్వారా విరాళం ఇవ్వడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు అని కేటుగాళ్లు సదరు జడ్జికి మాయమాటలు చెప్పి మోసం చేసినట్లు సమాచారం. ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ డీ.ఎస్.ఆర్ వర్మ కుటుంబం వద్ద నుంచి నరేంద్ర, కసిరెడ్డి శరత్ రెడ్డి అనే వ్యక్తులు రెండున్నర కోట్లు వసూలు చేశారు. రెండేళ్లు గడిచినా బాండ్లకు సంబంధించిన రశీదులను కేటుగాళ్ళు ఇవ్వలేదు.


బాండ్ల పేరుతో విరాళాలు చట్ట విరుద్దం అంటూ ఇటీవల సుప్రీం కోర్టులో తీర్పు వచ్చిన సంగతి తెలిసిందే. అప్రమత్తం అయి రెండున్నర కోట్ల గురించి విశ్రాంత న్యాయ మూర్తి జస్టిస్ వర్మ వాకబు చేశారు. దీంతో వారు సదరు పార్టీకి డబ్బులు చెల్లించకుండా సొంతానికి వాడుకున్నారని ఆయనకు తెలిసింది. వెంటనే తాను మోసపోయానని తెలుసుకొని ఆయన ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ 406, 420 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద ఫిలిం నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.