Drug Case: హైదరాబాద్(HYD) డ్రగ్స్ కేసులకు టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు, ప్రముఖులకు విడదీయరాని బంధం కనిపిస్తోంది. డ్రగ్స్ కేసు బయటపడిన ప్రతిసారీ అందరి చూపు చిత్రపరిశ్రమ వైపే మళ్లుతుంది. ఎందుకంటే గతంలో ఈ లింకులతో పెద్దపెద్ద దర్శకులు, నిర్మాతలు, హీరోలకు సంబంధం ఉండటమే.. తాజాగా హైదరాబాద్ లోని రాడిసన్ బ్లూ హోటల్ లో డ్రగ్స్ కేసులోనూ  చిత్రపరిశ్రమతో ఉన్న లింకులు బయటపడుతున్నాయి..


హైదరాబాద్ డ్రగ్స్ కేసు
హైదరాబాద్ రాడిసన్ బ్లూ(Raddison Blue) హోటల్ లో జరిగిన పార్టీలో డ్రగ్స్ సేవించారని పోలీసులు నిర్థరించడంతో మరోసారి తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. పైగా ఈ కేసులో సినీ పరిశ్రమకు చెందిన కొందరి వ్యక్తుల పేర్లు చేర్చడంతో మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ కేసులో కీలక నిందితుడు మంజీరా గ్రూప్ డైరెక్టర్, రాడిసన్ బ్లూ హోటల్స్ అధినేత కుమారుడైన వివేకానంద(Vivekanandha)తోపాటు అతని స్నేహితులు పాల్గొన్నారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని మాదాపూరు డీసీపీ వినిత్ తెలిపారు.  ఆ హోటల్‌లో చాలాసార్లు పార్టీలు జరిగాయని వివేకానందతోపాు , కేదార్‌, నిర్భయ్‌ కొకైన్‌ సేవించినట్లు పరీక్షల్లో తేలిందన్నారు. మిగిలిన వారికి సైతం పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. వివేకానందకు అబ్బాస్‌ 10 సార్లు కొకైన్‌ను డెలివరీ చేశాడని డీసీపీ(DCP) వివరించారు. ఈ కేసులో నిందితులైన లిషి, శ్వేత, సందీప్‌ ఇంకా పరారీలోనే ఉన్నారని.. త్వరలోనే వారిని పట్టుకుంటామన్నారు. చరణ్‌ బెంగళూరు(Bangalore)లో ఉన్నట్లు తెలిసిందని డీసీపీ వినిత్ వివరించారు. సినీ దర్శకుడు క్రిష్(Director Krish) ఆరోజు ఆ హోటల్ కు వెళ్లినా... ఆయన ఆ పార్టీలో పాల్గొన్నట్లు నిర్థరణ కాలేదని తెలిపారు. ఆయన విచారణకు సహకరిస్తానని హామీ ఇచ్చారని...త్వరలోనే ఆయన్ను విచారిస్తామని వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ కేసులో  ఇద్దరు యువతులు సహా 9 మందిని అరెస్ట్‌ చేశారు. 
ఎఫ్ఐఆర్ లో క్రిష్ పేరు
రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారబోతోంది. ఇప్పటికే ఈ కేసులో ఓ జాతీయపార్టీ నేత కుమారుడు ఆయన సొంత హోటల్ లోనే డ్రగ్స్ సేవిస్తూ దొరికిపోగా... ఇప్పుడు ఈ కేసులో టాలీవుడ్(Talloywood) చిత్రపరిశ్రమకు చెందిన వ్యక్తుల పేర్లు ఎఫ్ఐఆర్(FIR) లో నమోదుకావడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎఫ్ఐఆర్ కాపీలో టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్  క్రిష్ పేరును 8వ వ్యక్తిగా చేర్చారు. అయితే తాను హోటల్‌కు వెళ్లిన విషయం నిజమేనని.... వెంటనే అక్కడి నుంచి వచ్చేశానని క్రిష్ తెలిపారు. మరోనటి కుషితా కళ్లపు(Kushitha) చెల్లెలు లిషి గణేశ్ పేరు ఉండటం కలకలం రేపుతోంది.


గతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసులోనూ ఈ అక్కాచెల్లెల్లిద్దరి పేర్లు వినిపించాయి. గతంలో టాలీవుడు డ్రగ్స్ కేసు ఎంతో సంచలనం సృష్టించగా పెద్దపెద్ద డైరెక్టర్లు, నటీనటులు పేర్లు బయటకు వచ్చాయి. చాలారోజుల పాటు అందిరినీ విచారించినా ఆ తర్వాత ఆ కేసు మరుగునపడిపోయింది. అయితే డ్రగ్స్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా ఉండటంతో ఈ కేసు అయినా పోలీసులు కొలిక్కి తెస్తారా లేక... టాలీవుడ్ పెద్ద తలకాయల పేర్లు వినిపిస్తుండటంతో మరుగునపడేస్తారోనని చర్చించుకుంటున్నారు. ఈ కేసుకు సంబంధించి రోజుకొక పేరు బయటకు వస్తుండంటం విశేషం