New Driving License: ఒక బండి రోడ్డు మీదకు రావాలంటే RC, ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లతోపాటు నడిపే వ్యక్తికి డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి. మన దేశంలో కొంతమంది ఇవేమీ లేకుండానే రోడ్ల మీద రయ్యిన దూసుకుపోతుంటారు, ఇది వేరే విషయం. 


ఇండియాలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం అంత ఈజీ కాదన్నది జనం నమ్మకం. ఒక వ్యక్తి డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకోవాలంటే స్లాట్‌ బుక్‌ చేసుకుని, రాత పరీక్ష రాసి, అందులో పాసై LLR అందుకోవాలి. అక్కడి నుంచి 3 నెలల తర్వాత బండితో సహా RTO ఆఫీసుకు వెళ్లి డ్రైవింగ్‌ చేసి చూపించి, అక్కడి అధికారిని మెప్పించాలి. ఆ తర్వాతే డ్రైవింగ్‌ లైసెన్స్‌ మీ ఇంటికి వస్తుంది. ఇదో పెద్ద ప్రహసనం.


RTO ఆఫీసులో డ్రైవింగ్ టెస్ట్‌ అవసరం లేదు
డ్రైవింగ్‌ లైసెన్స్‌ విషయంలో ఇప్పుడు కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ నయా రూల్ తీసుకు వచ్చిది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకునేందుకు మీరు ప్రాంతీయ రవాణా కార్యాలయానికి (RTO) పదేపదే వెళ్లాల్సిన అవసరం లేదు. RTO ఆఫీసులోని చాంతాడంత క్యూలో పడిగాపులు పడాల్సిన పని లేదు. డ్రైవింగ్ టెస్ట్‌లో మిమ్మల్ని మీరు నిరూపించకోవాల్సిన అవసరమూ లేదు. నమ్మలేకపోతున్నారా?, ఇదంతా నిజమే. సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఇలాంటి మార్పులు చేసింది. 


డ్రైవింగ్ స్కూల్‌కి వెళ్లాలి
డ్రైవింగ్ పర్మిట్ పొందడానికి RTO ఆఫీస్‌కు బదులుగా ఇప్పుడు మీరు డ్రైవింగ్ స్కూల్‌కు వెళ్లాలి. మీరు నమ్మలేకపోయినా ఇదే నిజం. మీకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ కావాలంటే, మొదట, డ్రైవింగ్ స్కూల్‌కు వెళ్లి మీ పేరు నమోదు చేసుకోవాలి. వాహనం నడపడంలో అక్కడ శిక్షణ తీసుకోవాలి. అంటే, RTO ఆఫీసులో పూర్తి చేయాల్సిన డ్రైవింగ్‌ టెస్ట్‌ను డ్రైవింగ్‌ స్కూల్లోనే మీరు ఫినిష్‌ చేస్తారన్న మాట. 


శిక్షణ కార్యక్రమం పూర్తి కాగానే, డ్రైవింగ్‌ స్కూల్‌ నుంచి ప్రిపరేషన్‌ సర్టిఫికేట్‌ తీసుకోవాలి. ఇదే కీలకం. డ్రైవింగ్‌ పర్మిట్‌ కోసం దరఖాస్తు చేసే సమయంలో, మిగిలిన పత్రాలతో పాటు దీనిని కూడా కలిపి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల, RTO ఆఫీస్‌లో డ్రైవింగ్ టెస్ట్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. మీ దరఖాస్తుతో పాటు ప్రిపరేషన్‌ సర్టిఫికేట్‌ను RTO అధికారులు వెరిఫై చేసుకుంటారు. ఆ తర్వాత మీకు డ్రైవింగ్ అనుమతి వస్తుంది.


ఈ కొత్త రూల్ ప్రకారం, టెస్ట్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి, కేవలం గుర్తింపు ఉన్న డ్రైవింగ్ టెస్ట్ సెంటర్‌లో మాత్రమే శిక్షణ పొందవలసి ఉంటుంది. ఏదోక డ్రైవింగ్‌ స్కూల్‌కు వెళితే ప్రయోజనం ఉండదు. ఆ సెంటర్‌కు 5 సంవత్సరాల చెల్లుబాటు సర్టిఫికెట్‌ తప్పనిసరిగా ఉండాలి. ఐదేళ్ల తర్వాత మీరు అక్కడికే వెళ్లి డ్రైవింగ్‌ లైసెన్స్‌ పునరుద్ధరించుకోవచ్చు. డ్రైవింగ్‌ స్కూల్‌లో శిక్షణ పూర్తయిన తర్వాత, వాళ్లు నిర్వహించే పరీక్షలో మీరు పాస్‌ అవ్వాలి. ఉత్తీర్ణత సాధించిన తర్వాత సదరు డ్రైవింగ్‌ స్కూల్‌ మీకు సర్టిఫికేట్ ఇస్తుంది. ఈ సర్టిఫికేట్ ఆధారంగా RTO నుంచి మీకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ అవుతుంది.