National Stock Exchange: స్టాక్ మార్కెట్‌లో ఇంట్రెస్ట్‌ రేట్‌ డెరివేటివ్స్‌ (interest rate derivatives) ట్రేడింగ్ సమయాన్ని సాయంత్రం 5 గంటల వరకు NSE పొడిగించింది. అంతర్జాతీయంగా వస్తున్న వార్తలు, పరిణామాల వల్ల దేశీయ ట్రేడర్లు నష్టపోకుండా, డైలీ ట్రేడింగ్‌లో తలెత్తే రిస్క్‌లను తగ్గించడానికి దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ గంటలను పెంచుతూ స్టాక్‌ ఎక్సేంజ్‌ నిర్ణయం తీసుకుంది. స్టాక్ మార్కెట్ పార్టిసిపెంట్స్‌, ఆర్థిక నిపుణులు కూడా ఈ నిర్ణయానికి ఓకే చెప్పారు.


ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లో ఉదయం 9.15 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ట్రేడింగ్ జరుగుతోంది.


వడ్డీ రేట్ల డెరివేటివ్స్‌ విభాగంలో ట్రేడింగ్ సమయాన్ని సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తూ NSE తీసుకున్న నిర్ణయం రేపటి నుంచి అమలులోకి వస్తుంది. అంటే, అంటే ఫిబ్రవరి 23, 2023 నుంచి ఈ విభాగంలోని 'ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌'లో (F&O) సాయంత్రం 5 గంటల వరకు ట్రేడ్‌ చేయవచ్చు. దీని ప్రకారం, ఫిబ్రవరి నెలతో ముగిసే డెరివేటివ్‌ కాంట్రాక్టులు కూడా ఫిబ్రవరి 23 సాయంత్రం 5 గంటల వరకు ట్రేడింగ్‌కు అందుబాటులో ఉంటాయి.


ఫిబ్రవరి 23, 2023 తర్వాత గడువు ముగియనున్న ప్రస్తుత అన్ని ఎక్స్‌పైరీ కాంట్రాక్ట్‌లు, ఇకపై వచ్చే కొత్త ఎక్స్‌పైరీ కాంట్రాక్ట్‌ల్లో సాయంత్రం 5 గంటల వరకు ట్రేడింగ్‌ చేయవచ్చు. ఇతర డెరివేటివ్ కాంట్రాక్టుల ట్రేడింగ్ వేళల్లో ఎలాంటి మార్పు ఉండదని నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ పేర్కొంది.


మార్కెట్‌ నిపుణుల అభిప్రాయం ఏంటి?
జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలకృష్ణన్ మాట్లాడుతూ... "ప్రస్తుత కాలంలో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు అత్యంత సమగ్రంగా ఉన్నాయి, ప్రపంచ మార్కెట్ల ఏకీకరణ క్రమంగా పెరుగుతోందని అన్నారు. అమెరికా, యూరప్‌లోని ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలు, మార్కెట్‌లలో జరిగే కార్యకలాపాలు భారతీయ స్టాక్ మార్కెట్ ట్రెండ్‌ను ప్రభావితం చేస్తాయి. అందువల్ల, ఎక్కువ ట్రేడింగ్‌ గంటలు కలిగి ఉన్న మార్కెట్లు ప్రపంచ వార్తా ప్రవాహాల నుంచి ఉత్పన్నమయ్యే నష్టాలను మరింత సమర్థవంతంగా ఎదుర్కోగలవు. అందువల్ల, NSEలో ట్రేడింగ్ గంటలను పొడిగించడం మార్కెట్ వర్గాలకు, రిటైల్ పెట్టుబడిదారులకు సహాయపడుతుంది" అని చెప్పారు.


జీరోధా సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ కూడా ఒక ట్వీట్‌ చేశారు. వడ్డీ రేట్ల ఫ్యూచర్స్ & ఆప్షన్స్ విభాగంలో పొడిగించిన ట్రేడింగ్ గంటలు మన మార్కెట్ల పరిపక్వతను సూచిస్తాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ ట్రేడర్లను ఎదుర్కొనేందుకు దేశీయ ట్రేడర్లకు మంచి అవకాశాన్ని అందిస్తుందని, రాబడి పరంగా క్యాపిటల్ మార్కెట్ బిజినెస్‌కు కూడా మంచిదని వెల్లడించారు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.