Share Market Rally: దేశీయ స్టాక్ మార్కెట్, ఈ రోజు (గురువారం, 20 జూన్‌ 2024) ఉదయం ట్రేడింగ్‌లో స్వల్ప నష్టాల నడుమ కదులుతోంది. అయిన్నప్పటికీ, ఆ సమయానికి, తన జీవితకాల గరిష్ట స్థాయికి (77,851.63) సమీపంలోనే సెన్సెక్స్ ఉంది. గత కొన్ని రోజులుగా, దేశీయ మార్కెట్లో ఆరోగ్యకరమైన ర్యాలీ కనిపిస్తోంది, బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు దాదాపు ప్రతి రోజు మార్కెట్ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. నిన్న కూడా, మన మార్కెట్ సరికొత్త ఆల్ టైమ్ హై లెవెల్ సాధించింది. అంతేకాదు, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అంచనా కూడా నిజమైంది.


ప్రధాని మోదీ ఏం చెప్పారు?
లోక్‌సభ ఎన్నికల (Loksabha Elections 2024) ఫలితాలు వచ్చాక స్టాక్‌ మార్కెట్‌లో చారిత్రాత్మక ర్యాలీని చూస్తామని, ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త రికార్డులు సృష్టిస్తాయని, కొత్త శిఖరాలను అధిరోహిస్తాయని అన్నారు. ఫలితాలు వచ్చిన రెండు వారాల్లోనే ప్రధాని మోదీ మాటలు నిజమయ్యాయి.


కౌంటింగ్ రోజున అతి భారీ నష్టం
ఈ నెల మొదటి వారంలో, జూన్ 04న లోక్‌సభ ఓట్ల లెక్కింపు జరిగింది. ఆ రోజు మార్కెట్‌ అత్యంత భారీ నష్టాలను చవిచూసింది. కౌంటింగ్ రోజున, ఇంట్రాడేలో, BSE సెన్సెక్స్ 6,200 పాయింట్లకు పైగా పడిపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 4,390 పాయింట్ల (5.74 శాతం) నష్టంతో 72,079 పాయింట్ల వద్ద ముగిసింది. NSE నిఫ్టీ 1,379 పాయింట్లు (5.93 శాతం) పడిపోయి 21,885 పాయింట్ల వద్ద ఆగింది.


ఈ రోజు మార్నింగ్‌ సెషన్‌లో, ఉదయం 11.10 గంటల సమయానికి, సెన్సెక్స్ 77,400 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. దీనికిముందు, బుధవారం నాడు, ఈ ఇండెక్స్‌ 77,851.63 పాయింట్ల కొత్త ఆల్ టైమ్ హై లెవెల్‌ను నమోదు చేసింది. ఈ రోజు నిఫ్టీ కూడా 23,550 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. బుధవారం నాడు, నిఫ్టీ 23,664 పాయింట్ల జీవిత కాల గరిష్ట స్థాయిని నమోదు చేసింది.


రెండు వారాల్లో 10 శాతం పైగా ర్యాలీ 
ఎన్నికల ఫలితాల రోజు నుంచి ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్‌ 10 శాతానికి పైగా ర్యాలీ చేసింది. ఆ రోజు ముగింపుతో (72,079 పాయింట్లు) పోల్చుకుంటే, ప్రస్తుతం BSE సెన్సెక్స్ దాదాపు 5,300 పాయింట్లకు పైగా లాభంలో ట్రేడవుతోంది. నిన్న నమోదైన ఆల్‌ టైమ్‌ హై లెవెల్‌తో పోలిస్తే దాదాపు 6.000 పాయింట్లు పెరిగింది. ఇంకా సరిగ్గా చెప్పాలంటే 5,772 పాయింట్లు లాభపడింది. NSE నిఫ్టీ కూడా, అప్పటికి ఇప్పటికి దాదాపు 1,700 పాయింట్లు పెరిగింది. నిన్నటి జీవితకాల గరిష్టంతో పోలిస్తే దాదాపు 1.800 పాయింట్లు ర్యాలీ చేసింది.


మోదీ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం స్టాక్‌ మార్కెట్‌ ఇటీవలి ర్యాలీకి కారణమైంది. భారతీయ జనతా పార్టీ (BJP) సొంతంగా మెజారిటీ సాధించలేకపోవడంతో, ఎన్నికల ఫలితాల రోజున మార్కెట్ కుప్పకూలింది. ప్రధాని మోదీ నేతృత్వంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా NDA ప్రభుత్వం ఏర్పాటయ్యాక మార్కెట్ మళ్లీ ర్యాలీ బాట పట్టింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: భయపెడుతున్న వెండి రేటు, పసిడే కాస్త బెటర్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి