JC Flowers ARC Loan: ప్రైవేట్ లెండర్ యెస్ బ్యాంక్ (Yes Bank) గుండెల మీద కుంపటి దిగింది. 48,000 కోట్ల రూపాయల మొండి బాకీల భారాన్ని వదిలించుకుని చేతులు దులుపుకుంది. బ్యాంక్ బుక్స్‌లో పోగుబడ్డ చెత్తంతా పోవడంతో, ఆర్థిక లెక్కలన్నీ (ఫైనాన్షియల్ మెట్రిక్స్) ఇకపై శుభ్రంగా కనిపిస్తాయి.
అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ జేసీ ఫ్లవర్స్ ARCకి (అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ) రూ.48,000 కోట్ల 'ఒత్తిడిలో ఉన్న ఆస్తులను' (స్ట్రెస్డ్ అసెట్స్) అమ్మేందుకు బోర్డ్ డైరెక్టర్ల నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకుంది. యెస్ బ్యాంక్ నుంచి స్ట్రెస్డ్ అసెట్స్ కొనడానికి వచ్చిన ఒకే ఒక్క బిడ్ జేసీ ఫ్లవర్స్‌దే. దీనిని ఛాలెంజ్ చేస్తూ (స్విస్ ఛాలెంజ్) ఇతర ఏ కంపెనీ నుంచి కూడా బిడ్‌లు రాలేదు.
దీంతో, 'స్విస్ ఛాలెంజ్ పద్ధతి'లో JC ఫ్లవర్స్‌ను విన్నర్‌గా యెస్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు ప్రకటించింది. ఇదే విషయాన్ని రెండు స్టాక్ ఎక్సేంజీలకు (NSE, BSE) కూడా కంపెనీ తెలిపింది.
స్విస్ ఛాలెంజ్ పద్ధతి
స్విస్ ఛాలెంజ్ పద్ధతి అంటే, వేలం మొదటి రౌండ్‌లో గెలిచిన బిడ్డర్ కోట్ చేసిన ధరను బేస్ ప్రైస్‌గా మార్చి, మళ్లీ వేలానికి పిలుస్తారు. దాని కంటే ఎక్కువ ధరను మరొకరు కోట్ (ఛాలెంజ్) చేయవచ్చు. దీనివల్ల సదరు సంస్థకు బెస్ట్ ప్రైస్ లభిస్తుంది.
జేసీ ఫ్లవర్స్ ARCలో 19.99 శాతం వరకు కొనుగోలు చేయడానికి కూడా యెస్ బ్యాంక్ బోర్డ్ ఆమోదం తెలిపింది. దీనికి సెబీ నుంచి అనుమతి రావల్సివుంది. ఒకేసారి లేదా దఫదఫాలుగా ఈ వాటాను కొనుగోలు చేయవచ్చు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్), తన ఆస్తుల నాణ్యతలో మెరుగుదలని యెస్ బ్యాంక్ నివేదించింది. స్థూల నిరర్థక ఆస్తులు (NPAలు) గత ఏడాది జూన్ 30 నాటికి ఉన్న 15.60 శాతం నుంచి ఈ ఏడాది జూన్ ముగింపు నాటికి 13.45 శాతానికి పడిపోయాయి. నికర NPAలు లేదా బ్యాడ్ లోన్స్ కూడా 5.78 శాతం నుంచి 4.17 శాతానికి తగ్గాయి.
తగ్గనున్న గ్రాస్ NPAలు
స్థూల నిరర్థక ఆస్తుల్లో (గ్రాస్ NPAs) ఎక్కువ భాగం కార్పొరేట్ రుణాలవే. అంటే, ఈ బ్యాంక్ నుంచి అప్పులు తీసుకుని, తీర్చకుండా ఎగ్గొట్టినవాళ్లలో బడా బాబులదే పెద్ద చేయి. ఇప్పుడు, ఆస్తుల బదిలీ తర్వాత స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 2 శాతం కంటే దిగువకు పడిపోతుందని యెస్ బ్యాంక్ వెల్లడించింది.
మొండి బకాయిల భారం తగ్గిన నేపథ్యంలో, ఇవాళ్టి వీక్ మార్కెట్‌లోనూ యెస్ బ్యాంక్ షేర్ పచ్చగా కళకళలాడుతోంది. ఉదయం 10.30 గంటల సమయానికి 3.35% లాభంతో రూ.16.95 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.