Multibagger Shares: భారత స్టాక్‌ మార్కెట్లు నెమ్మదిగా కుదుట పడుతున్నాయి. వరుస నష్టాల నుంచి తేరుకుంటున్నాయి. ముడి చమురు ధరల తగ్గుదల, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల అమ్మకాలు తగ్గిపోవడంతో ఈక్విటీ మార్కెట్లు రాణిస్తున్నాయి.


అమెరికా ద్రవ్యోల్బణం భయపెడుతున్నా ఫెడ్‌ విధాన సమీక్ష ఉన్నా ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపడుతున్నారు. ఈ వారం బీఎస్‌ఈ 500 మార్కెట్‌ బ్రెడ్త్‌ బాగుంది. 265 స్టాక్స్‌ సానుకూల రిటర్నులు ఇచ్చాయి. దాదాపుగా 15 షేర్లు 10 శాతానికి పైగా లాభపడ్డాయి. కొన్ని 20 శాతానికి పైగా ఎగియడం ప్రత్యేకం.


ఈ వారం ఐటీఐ కంపెనీ షేరు ధర ఏకంగా 23 శాతం పెరిగింది. రూ.98 నుంచి రూ.120 వరకు లాభపడింది. కొత్త ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ను నియమించడమే ఈ ర్యాలీకి కారణం. అనుపమ్‌ రసాయన్‌ షేరు 18 శాతం వరకు ఎగిసింది. సాంకేతికంగా బాగుండటం, రుణాల పరంగా క్రిసిల్‌ మెరుగైన రేటింగ్‌ ఇవ్వడంతో రూ.735కు చేరుకుంది. టెలికాం గేర్ల తయారీ కంపెనీ హెచ్‌ఎఫ్‌సీఎల్‌ 16 శాతం పెరిగి రూ.67 వరకు ఎగిసింది. ఈ మధ్యే కంపెనీకి రూ.60 కోట్ల విలువైన ఆర్డర్‌ వచ్చింది.


స్టార్‌ హెల్త్‌, ఏస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌ షేర్లు 16 శాతం వరకు రాణించాయి. కేఈసీ ఇంటర్నేషనల్‌, వక్రంగీ, అదానీ ట్రాన్స్‌మిషన్‌ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. ఈ వారం 14-15 శాతం వరకు పెరిగాయి. బ్లూ స్టార్‌, ఐడీబీఐ బ్యాంక్‌, కేఆర్‌బీఎల్‌, ఈపీఎల్‌, అదానీ టోటల్‌ గ్యాస్, సియట్‌, ఎడిల్‌వీస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, మిండా కార్పొరేషన్‌ షేర్లు 10-12 శాతం వరకు లాభపడ్డాయి.


కొన్ని కంపెనీల షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఐటీ రంగ షేర్లు ఇంకా దిద్దుబాటుకు గురవుతున్నాయి. తన్లా ప్లాట్‌ఫామ్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లు 10-11 శాతం వరకు నష్టపోయాయి. బిర్లా సాఫ్ట్‌ సరికొత్త 52 వారాల కనిష్ఠాన్ని తాకింది. 10 శాతం నస్టపోయింది. టీసీఎస్‌, డాక్టర్‌ లాల్‌పత్‌ ల్యాబ్స్‌, బీఎన్‌పీ పారిబస్‌ షేర్లు నష్టపోయాయి.


Also Read: బీ కేర్‌ఫుల్ ! ఈ చిన్న తప్పుతో సిబిల్‌ స్కోరు 100 పాయింట్లు ఢమాల్‌!


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌లో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.