Share Market Today:


భారత ఈక్విటీ మార్కెట్లు గురువారమూ భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు రావడంతో సూచీల పతనం కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు లార్జ్‌ క్యాప్‌ షేర్లను అమ్మేస్తున్నారు. విదేశీ సంస్థాగత మదుపర్లూ ఇదే బాటలో నడవడం, అమెరికా బాండ్‌ యీల్డులు పెరగడం మరో కారణం. ఇవన్నీ కలిసి స్థానిక మార్కెట్లో నెగెటివ్‌ సెంటిమెంటుకు దారితీశాయి.


బ్యాంకు, ఐటీ, ఫైనాన్స్‌ కంపెనీల షేర్లు ఎక్కువ క్రాష్‌ అవుతున్నాయి. ఆదాయం తగ్గడంతో రియాల్టీ కంపెనీల షేర్లూ విలవిల్లాడుతున్నాయి. అయితే మీడియా, హెల్త్‌కేర్‌ స్టాక్స్‌కు డిమాండ్‌ కనిపిస్తోంది. మధ్యాహ్నం 12:30 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 555 పాయింట్లు తగ్గి 65,227 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 151 పాయింట్లు కుంగి 19,374 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ బ్యాంకు 464 పాయింట్లు పతనమైన 44,532 వద్ద కొనసాగుతోంది.


నిఫ్టీ 50లో సన్ ఫార్మా, ఐచర్‌ మోటార్స్‌, దివిస్‌ ల్యాబ్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ఎన్టీపీసీ షేర్లు లాభపడ్డాయి. టైటాన్‌, టీసీఎస్‌, అల్ట్రాటెక్ సెమ్‌, టెక్‌ మహీందరా, ఐసీఐసీఐ బ్యాంకు ఎక్కువ నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఫార్మా 1.57 శాతం మేర ఎగిసింది. నిఫ్టీ మీడియా, హెల్త్‌కేర్‌, ఆటో రంగాలకు డిమాండ్‌ కనిపిస్తోంది. ఐటీ, బ్యాంకు తర్వాత మెటల్‌ సూచీ ఎక్కువ ఎరుపెక్కింది.


'కంపెనీల ఆదాయాలు తగ్గాయి. ఐటీ కంపెనీలు విలవిల్లాడుతుండటం మార్కెట్‌ సెంటిమెంటును దెబ్బతీస్తోంది. అమెరికా పదేళ్ల బాండ్‌ యీల్డులు మళ్లీ అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. నవంబర్‌ నాటి 4.1 శాతాన్ని మించే ట్రేడవుతున్నాయి' అని మెహతా ఈక్విటీస్‌ సీనియర్‌ వైస్ ప్రెసిడెంట్‌ ప్రశాంత్‌ తాప్సే అన్నారు.


అమెరికా బాండ్‌ యీల్డులు పెరగడం ఆసియా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. డాలర్‌ పెరుగుదల ఇందుకు దోహదం చేస్తోంది. అయితే ఇన్వెస్టర్లు ఆపిల్‌, అమెజాన్‌ వంటి టెక్‌ కంపెనీల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఆసియాలో అతిపెద్ద ఇండెక్స్‌ అయినా ఎంఎస్‌సీఐ తగ్గింది. ఐరోపా మార్కెట్లూ నష్టాల్లోనే మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆగస్టు 2న ఎఫ్ఐఐలు రూ.1877 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. ప్రస్తుతానికి అమ్మకాలు కొనసాగుతున్నా మార్కెట్‌ మూమెంటమ్‌ మాత్రం బుల్లిష్‌గానే ఉంది. టెక్నికల్‌గా చూస్తే నిఫ్టీకి 19500, 19400, 19300 వద్ద సపోర్ట్స్‌ ఉన్నాయి.


Also Read: మరో మెగా డీల్‌ కుదుర్చుకున్న అదానీ, అంబుజా సిమెంట్స్‌ చేతికి సంఘి సిమెంట్‌


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.