Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వాళ్లకు శుభవార్త. పెట్టుబడిదారులు లావాదేవీ జరిపిన తర్వాత, గతంలో కంటే ఒకరోజు ముందే డబ్బు వాళ్ల ఖాతాలోకి చేరుతుంది. యాంఫీ తీసుకొస్తున్న కొత్త సంస్కరణ ఇది.
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదార్లకు భారీ ఉపశమనం
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ త్వరలోనే T+2 సెటిల్‌మెంట్ సైకిల్‌కు మారనున్నాయి. ఫిబ్రవరి 1, 2023 నుంచి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఫథకాలకు T+2 సెటిల్‌మెంట్ సైకిల్ వర్తింపజేస్తామని మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ ఇన్ ఇండియా (Association of Mutual Funds in India- యాంఫీ) ప్రకటించింది. ప్రస్తుతం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో T+3 సెటిల్‌మెంట్ విధానం కొనసాగుతోంది.
T+2 సెటిల్‌మెంట్ సైకిల్ అంటే?
T+2 అంటే ట్రేడింగ్ డే + 2 డేస్ అని అర్ధం. ఇంకా వివరంగా చెప్పాలంటే.. ఒక పెట్టబడిదారు ఒక ట్రేడింగ్ జరిపితే, ట్రేడింగ్ డే నుంచి రెండు రోజుల్లో సంబంధిత లావాదేవీ పూర్తి అవుతుంది.
ఉదాహరణకు.. ఒక పెట్టుబడిదారు, మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ స్కీమ్‌లోని తన పెట్టుబడిని సోమవారం విక్రయిస్తే, T+2 సెటిల్‌మెంట్ సైకిల్ సైకిల్ ప్రకారం డబ్బు బుధవారం అతని బ్యాంక్ ఖాతాకు జమ అవుతుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న T+3 సెటిల్‌మెంట్ సైకిల్ ప్రకారం గురువారం డబ్బు జమ అవుతుంది. అంటే, 2023 ఏప్రిల్ 1 నుంచి ఒక రోజు ముందే సెటిల్‌మెంట్ పూర్తవుతుంది. ఫలితంగా, పెట్టుబడిదార్ల డబ్బు ఒక రోజు ముందే అందుతుంది, లిక్విడిటీ పెరుగుతుంది. మ్యూచువల్ ఫండ్ యూనిట్లు కొన్నా ఇదే విధానం వర్తిస్తుంది. ఫలితంగా, మార్కెట్‌లో మరో ట్రేడ్ తీసుకోవడానికి అతనికి ఒక రోజు కలిసి వస్తుంది.
T+1 సెటిల్‌మెంట్ సైకిల్‌లో ఈక్విటీ మార్కెట్లు
భారతీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం (జనవరి 27, 2023) నుంచి షార్టర్ సెటిల్‌మెంట్ సైకిల్ లేదా T+1 సెటిల్‌మెంట్ విధానంలోకి మారాయి. అంటే, ఒక పెట్టుబడిదారు కొనుగోలు చేసిన లేదా విక్రయించిన స్టాక్స్ ఒక్క రోజు వ్యవధిలోనే అతని/ఆమె డీమ్యాట్ ఖాతాలో ప్రతిబింబిస్తాయి. శుక్రవారానికి ముందు వరకు 'T+2' (ట్రేడింగ్ + 2 డేస్) ప్రాతిపదికన సెటిల్‌మెంట్ జరిగేది. సెటిల్‌మెంట్ రోజుల సంఖ్యను తగ్గించడం వల్ల ఒక్క రోజులోనే డీమ్యాట్ ఖాతాల్లో షేర్లు, బ్యాంక్ ఖాతాలో డబ్బు ప్రతిబింబిస్తాయి. తద్వారా, మరో ట్రేడ్ తీసుకోవడానికి, మార్కెట్‌లో భాగస్వామ్యాన్ని పెంచుకోవడానికి పెట్టుబడిదార్లకు వీలవుతుంది. ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్లకు దీని వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
స్టాక్ ఎక్స్ఛేంజీలు NSE & BSE కలిసి.. T+1 సెటిల్‌మెంట్ సైకిల్‌ను ఫిబ్రవరి 25, 2022 నుంచి దశలవారీగా అమలు చేస్తూ వచ్చాయి. మార్కెట్ విలువ పరంగా చివరన ఉన్న 100 స్టాక్స్‌తో ఈ పనిని మొదలు పెట్టాయి. అక్కడి నుంచి దశల వారీగా T+1 సెటిల్‌మెంట్ సైకిల్‌కు మార్పు మొదలైంది. తదుపరి ప్రతి నెల చివరి శుక్రవారం నాడు, దిగువన ఉన్న మరో 500 స్టాక్స్‌ను స్టాక్ ఎక్సేంజీలు T+1 సైకిల్‌లోకి తీసుకొచ్చాయి. ఇలా, ప్రతి నెలా చివరి శుక్రవారం నాడు ఇదే తంతు నడిచింది. సెక్యూరిటీల చివరి బ్యాచ్ -- స్టాక్స్, ETFs, డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లు (REITs), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లు (InvITs) శుక్రవారం నుంచి T+1 సెటిల్‌మెంట్ సైకిల్‌కి మారాయి. దీంతో, ఈక్విటీ క్యాష్ సెగ్మెంట్‌లో (ఫ్యూచర్స్ & ఆప్షన్స్ సహా) అన్ని ట్రేడ్స్ T+1 ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు.
మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, సెటిల్‌మెంట్ సైకిల్‌ను తగ్గించడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు 2002లో, సెటిల్‌మెంట్ సైకిల్‌లోని రోజుల సంఖ్యను T+5 డేస్ నుంచి T+3 డేస్‌కు తగ్గించింది, ఆపై 2003లో T+2 డేస్‌కు తగ్గించింది.
స్టాక్స్‌లో ‘T+1’ సెటిల్‌మెంట్ సైకిల్‌ను అమలు చేసిన మొదటి అతి పెద్ద మార్కెట్ చైనా. అభివృద్ధి చెందిన మార్కెట్లయిన అమెరికా, యూరోప్ దేశాలు ఇప్పటికీ ‘T+2’ సెటిల్‌మెంట్ సైకిల్‌లోనే ఉన్నాయి.