Tata Elxsi shares: టాటా గ్రూప్‌నకు చెందిన టాటా ఎల్‌క్సీ (Tata Elxsi) మీద బ్రోకరేజ్ సంస్థ షేర్‌ఖాన్ (Sharekhan) నమ్మకం తగ్గింది. స్టాక్‌ రేటింగ్‌ను "బయ్‌" నుంచి "రెడ్యూస్‌"కు తగ్గించింది. స్టాక్‌ ప్రస్తుత మార్కెట్‌ ధర రూ.7,778 గా ఉంటే, ఈ బ్రోకరేజ్‌ తాజాగా ఇచ్చిన ప్రైస్‌ టార్గెట్‌ రూ.7,500. అంటే, స్టాక్‌ వాల్యూని 3.6 శాతం తక్కువగా చూస్తోంది. స్థూల అనిశ్చితులు, ఆదాయ వృద్ధిలో వేగం తగ్గడాన్ని తన నిర్ణయానికి కారణంగా ఈ బ్రోకరేజ్‌ వెల్లడించింది.


భారీ ప్రీమియం
ప్రస్తుతం ఈ స్టాక్ దాని FY23/ FY24/ FY25 అంచనా ఆదాయాలకు వరుసగా 72.2 రెట్లు/ 71.2 రెట్లు/ 58.9 రెట్ల వద్ద ట్రేడవుతోంది. వృద్ధి అంచనాను తగ్గించడం, సానుకూల ట్రిగ్గర్లు ఇప్పట్లో లేకపోవడం వల్ల స్టాక్‌ ప్రీమియం వాల్యుయేషన్‌ మీద భారం పడుతుందని బ్రోకరేజ్‌ నమ్ముతోంది. 


ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (Q2FY23) Tata Elxsi పన్నుకు ముందు లాభం (PBT) రూ. 219.17 కోట్లుగా ఉంది. ఇది, 'క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌' (QoQ) ప్రాతిపదికన 4 శాతం పతనం. అయితే 'ఇయర్‌ ఆన్‌ ఇయర్‌' (YoY) లెక్కన 28 శాతం పెరిగింది.


లాభం భేష్‌
సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో, ఈ కంపెనీకి కార్యకలాపాల ద్వారా రూ.763 కోట్ల ఆదాయం (ఆపరేటింగ్‌ రెవెన్యూ) వచ్చింది. ఇది 5 శాతం QoQ - 28 శాతం YoY వృద్ధి. పన్ను తర్వాత లాభం YoY లెక్కన 39 శాతం వృద్ధి చెందింది. 
వాల్యూమ్స్‌ పెరగడం వల్ల ఆదాయ వృద్ధి సాధ్యమైంది. కంపెనీలోని అన్ని సెగ్మెంట్లు EPD, IDV, SISలో వరుసగా 4, 14, 26 శాతం QoQ వృద్ధిని సాధించాయి.


రైల్‌, ఆఫ్‌రోడ్‌ వెహికల్స్‌ స్పేస్‌లో లార్జ్‌ డీల్స్‌ వల్ల Tata Elxsi ట్రాన్స్‌పోర్టేషన్‌ 4 శాతం QoQ, 30 శాతం YoY పెరిగింది. కొత్త ఉత్పత్తుల, నియంత్రణ సేవల్లో మెరుగుదల వల్ల హెల్త్‌కేర్ విభాగం 8 శాతం QoQ, 56 శాతం YoY తో బలమైన వృద్ధిని సాధించింది.


ప్రైస్‌ ట్రెండ్స్‌
Elxsi shares షేరు ధర గత నెల రోజుల్లో దాదాపు 11 శాతం పడిపోయింది. గత ఆరు నెలల కాలంలో ఫ్లాట్‌గా ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు (YTD) చూస్తే, ఒక్కో షేరు 1,866 రూపాయల చొప్పున లేదా 32 శాతం వరకు లాభపడింది. 


మల్టీబ్యాగర్‌
స్వల్ప కాల లెక్కల్లో ఈ స్టాక్‌ వృద్ధి సాదాసీదాగా కనిపించినా, వాస్తవానికి ఇదొక మల్టీబ్యాగర్‌. గత ఐదేళ్ల కాలంలో ఒక్కో షేరు ధర రూ.6,918 చొప్పున లేదా 822% పెరిగింది. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.