Granules India share buyback: ఔషధాల తయారీ కంపెనీలు గ్రాన్యూల్స్ ఇండియా ‍‌(Granules India) షేర్ల బైబ్యాక్‌కు (buyback) మూహూర్తం ఖరారైంది. ఈ నెల 27 బైబ్యాక్‌ ప్రారంభమవుతుంది.


₹250 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్‌ ద్వారా గ్రాన్యూల్స్ ఇండియా తిరిగి కొనబోతోంది.


మొత్తం 62.50 లక్షల షేర్లను (ఒక్కొక్కటి ₹1 ముఖ విలువ), ఒక్కో షేరును ₹400 చొప్పున బైబ్యాక్ చేయాలని ఈ కంపెనీ ఆగస్టులోనే ప్రకటించింది. తాజాగా, బైబ్యాక్‌ తేదీని ఖరారు చేసింది.


27 శాతం ప్రీమియం
BSEలో, గ్రాన్యూల్స్ ఇండియా షేరు శుక్రవారం ముగింపు ధర ₹315.85తో పోలిస్తే, కంపెనీ ఇస్తున్న ఆఫర్ ధర దాదాపు 27 శాతం ఎక్కువ.


ఈ ఏడాది జులై 29కి ముందు మూడు నెలల కాలంలో ఉన్న సగటు షేర్‌ ధర ప్రకారం చూస్తే... ప్రస్తుత బైబ్యాక్ ధర NSEలో 45.02 శాతం ప్రీమియంతో, BSEలో 46.61 శాతం ప్రీమియంతో, అంటే ఎక్కువ ధరకు కొంటున్నట్లు లెక్క. బైబ్యాక్‌ ప్రతిపాదనను కంపెనీ పరిగణనలోకి తీసుకున్న తేదీ జులై 29.


రికార్డ్‌ డేట్‌ ఆగస్టు 23
ప్రతిపాదిత బైబ్యాక్ సైజ్‌, మొత్తం ఈక్విటీ షేర్లలో 2.52 శాతానికి సమానం. బైబ్యాక్‌ కోసం ఆగస్టు 23ని రికార్డు తేదీగా కంపెనీ నిర్ణయించింది. అంటే, ఆగస్టు 23 నాటికి ఎవరి డీమ్యాట్‌ అకౌంట్లలో గ్రాన్యూల్‌ ఇండియా షేర్లు ఉంటాయో, వాళ్లు మాత్రమే బైబ్యాక్‌లో పాల్గొనడానికి అర్హులు. బైబ్యాక్‌లో షేర్లను కంపెనీకి అప్పగించాలా, వద్దా అన్నది కూడా ఈ అర్హత ఉన్నవాళ్ల ఇష్టమే, నిర్బంధం ఏమీ లేదు. బైబ్యాక్ ఆఫర్ అక్టోబర్ 11తో ముగుస్తుంది.


సెబీ నిబంధనల ప్రకారం, బైబ్యాక్‌ ఈక్విటీ షేర్లు రెండు మార్గాలుగా కంపెనీ విభజించింది. చిన్న వాటాదారుల కోసం (రిటైల్‌ ఇన్వెస్టర్లు) రిజర్వేషన్‌ లేదా కోటా ఉంటుంది. రెండోది జనరల్‌ కేటగిరీ - అర్హత గల ఇతర షేర్‌హోల్డర్లందరూ ఈ కేటగిరీ కింద పార్టిసిపేట్‌ చేయాలి.


టెండర్ రూట్‌
టెండర్‌ ఆఫర్ మార్గంలో షేర్లను బైబ్యాక్‌ చేస్తారు. అంటే, ఆగస్టు 23 నాటికి మీ దగ్గర గ్రాన్యూల్స్‌ ఇండియా షేర్లు ఉండి, బైబ్యాక్‌లో పాల్గొనాలని మీరు అనుకుంటే, ఆ షేర్లను అమ్ముతామని కంపెనీకి మీరే ప్రతిపాదించాలి. దీనినే టెండర్‌ రూట్‌ అంటారు.


బైబ్యాక్‌ ఆఫర్‌కు షేర్‌హోల్డర్ల వచ్చిన స్పందనను బట్టి, ఒక్కో షేర్‌హోల్డర్‌ నుంచి ఎన్ని షేర్లు కొనాలన్న (బైబ్యాక్‌ రేషియో) అంశాన్ని బైబ్యాక్‌ ముగింపు తేదీ తర్వాత కంపెనీ నిర్ణయిస్తుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.