Mukesh Ambani is the richest but why Anil went bankrupt :  కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయని మన పెద్దలు చెబూతూంటారు కాస్త తెలివిగా ఉండకపోతే బిలియన్ల సంపద అయినా హారతి కర్పూరం అయిపోతుందని అనిల్ అంబానీ  మన పెద్దల మాటను నిజమేనని నిరూపించారు. ఇది జరగడానికి తరాలు పట్టలేదు. కళ్ల ముందే  జరిగిపోయింది.  తాను దివాలా తీసినట్లుగా అనిల్ అంబానీ స్వయంగా యూకే కోర్టుకు 2020లో తెలిపారు. అదే సమయంలో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ సంస్థ నుంచి పెద్ద ఎత్తున డబ్బులు మళ్లించినట్లుగా తేలడంతో సెబీ రూ. పాతిక కోట్ల రూపాయల ఫైన్  వేసి ఐదేళ్ల పాటు ఏ రూపంలోనూ ఆయన సెక్యూరిటీస్ మార్కెట్‌ కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. 


విడిపోయినప్పుడు ముఖేష్, అనిల్ ఇద్దరిదీ సమాన సంపద


ప్రపంచంలోని అపర కుబేరుల్లో ఒకరు అయిన ముఖేష్ అంబానీ  సోదరుడు అనిల్ అంబాని. ధీరూభాయ్ అంబానీ  చనిపోయిన తర్వాత కూడా ముఖేష్, అనిల్ అంబాని సంయుక్తంగా వ్యాపారాలను నిర్వహించారు. అయితే విడిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత రిలయన్స్ గ్రూపు వ్యాపారాలను పంచుకున్నారు. రిలయన్స్ బ్రాండ్ ముఖేష్ అంబానీకి దక్కగా..  అడాగ్.. అనిల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్ పేరుతో అనిల్ సొంత గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. రిలయన్స్ గ్రూపులో కీలక వ్యాపారాలను ఇరువురు పంచుకున్నారు. ఓ దశలో ఇద్దరి వ్యాపారాల మార్కెట్ వాటా సమానంగా ఉండేది. ఇద్దరు బిలియనీర్లుగా ఎదిగారు.  అయితే కాల క్రమంలో అడాగ్ కంపెనీ వరుసగా వైఫల్యాలు ఎదుర్కొంది. టెలికామ్ మార్కెట్ జోరు మీదున్న సమయంలో రిలయన్స్ ఇన్ఫోకామ్ కూడా ఫెయిలయింది. ఫలితంగా అంబానీ పూర్తిగా నష్టపోయారు. 


తండ్రి ఎదగవచ్చని నిరూపిస్తే.. కుమారుడు పడిపోవచ్చని చూపించారు !     


అంబానీ అంటే  సంపదకు చిహ్నం. కానీ అంబానీల్లోనూ పేదలుంటారని అదే గ్రేట్ ధీరూభాయ్ అంబానీ కుమారుడు నిరూపించేశారు.  సైకిల్ మీద దుస్తులమ్మి పెట్రోల్ బంక్‌లో పని చేసి మహా సామ్రాజ్యాన్ని  నిర్మించారు దీరూబాయ్ అంబానీ.  ఓ సామాన్యుడు ఎంతకైనా ఎదగగలడని  ధీరూబాయ్ అంబానీ నిరూపించారు. కానీ ఆయన కుమారుడు లక్షల కోట్లు ఇచ్చినా సరే రూపాయి లేకుండా పోగొట్టుకోవచ్చని నిరూపించాడు. ఆస్తులే కాదు.. మొత్తం అమ్మేసినా.. అప్పులు తీరక దివాలా పిటిషన్లు వేయాల్సి వచ్చింది. గతంలో చైనా బ్యాంకులు బ్రిటన్ కోర్టులో వేసిన పిటిషన్లకు  తన వద్ద చిల్లిగవ్వ లేదని అఫిడవిట్ వేశారు.  


ప్రపంచ కుబేరుడిగా ఎదిగిన ముఖేష్


అనిల్ అంబానీ ఓ వైపు పూర్తిగా ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుని కుప్పకూలిపోతే ముఖేష్ అంబానీ మాత్రం క్రమంగా ఎదిగారు. టెలికారం రంగంలోనూ జియో పేరుతో అడుగుపెట్టి సంచలనాలు నమోదు చేశారు. అనిల్ అంబానీ దివాలా తీసినట్లుగా ప్రకటిస్తే..అది ముఖేష్ అంబానీకి కూడా ఇబ్బందే. అందుకే పలుమార్లు సోదరుడ్ని ఆదుకున్నారు. ఓ సారి  స్వీడన్‌కు చెందిన  ఎరిక్‌సన్‌కు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించలేక జైలుకెళ్లే పరిస్థితి ఏర్పడటంతో..  ముఖేష్ అంబానీ రూ.462 కోట్ల మొత్తాన్ని చెల్లించి సోదరుడ్ని  బయట పడేశారు.  


పట్టుబట్టి విడిపోయి దివాలా  తీసిన అనిల్ 


తండ్రి ధీరూబాయ్ అంబానీ రిలయన్స్ సామ్రాజ్యం చీలిపోవాలని కోరుకోలేదు.  వారసులు కలిసే వ్యాపారాలు చేయాలని అనుకున్నారు.  కానీ ధీరూభాయ్ చనిపోయిన తర్వాత  సొంతంగా వ్యాపారం చేసుకోవాలని అనిల్ అంబానీ  అనుకున్నారు. ముఖేష్ కలిసే ఉందామని.. వారి తల్లి కూడా విడిపోవద్దని చెప్పినా వినలేదు. చివరికి పెద్ద మనుషుల మధ్య ఆస్తులు పంచుకుని 2005లో విడిపోయారు. అప్పుడు అనామక అంబానీగా మిగిలిపోయారు.