Cyber Attack on Microsoft: ప్రపంచంలోని పెద్ద ఐటీ కంపెనీల్లోని ఒకటైన మైక్రోసాఫ్ట్‌పై భారీ సైబర్ దాడి జరిగింది. సైబర్ నేరగాళ్లు కంపెనీ మేనేజ్‌మెంట్ ఇ-మెయిల్ అకౌంట్‌కు యాక్సెస్ పొందారని ఆ అమెరికన్ టెక్నాలజీ కంపెనీ తెలిపింది. ఇది, రష్యాతో సంబంధం ఉన్న మిడ్‌నైట్ బ్లిజార్డ్ (Midnight Blizzard) గ్రూప్ పనని మైక్రోసాఫ్ట్ చెబుతోంది.
కంపెనీ కార్పొరేట్ ఇ-మెయిల్ వ్యవస్థ లక్ష్యంగా దాడి
కంపెనీ కార్పొరేట్ ఇ-మెయిల్ సిస్టమ్‌ను మిడ్‌నైట్ బ్లిజార్డ్ లక్ష్యంగా చేసుకున్నట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. కంపెనీ మేనేజ్‌మెంట్ అకౌంట్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ దాడి గురించి, తన వెబ్‌సైట్‌లో బ్లాగ్ పోస్ట్‌లో మైక్రోసాఫ్ట్ తెలిపింది. మైక్రోసాఫ్ట్ చెబుతున్న ప్రకారం, ఆ హ్యాకింగ్ గ్రూప్‌ను నోబెలియం, APT29, కోజీ బేర్ అని కూడా పిలుస్తారు. ఆ గ్రూప్ మెంబర్లు కొన్ని కార్పొరేట్ ఈ-మెయిల్ ఖాతాలను హ్యాక్ చేశారు. ఆ ఖాతాలు కంపెనీ సీనియర్ లీడర్‌షిప్ టీమ్, సైబర్ సెక్యూరిటీ టీమ్, లీగల్, ఇతర ఉద్యోగులకు చెందినవి.
నవంబర్‌లో దాడి జరిగితే జనవరిలో గుర్తింపు
మిడ్‌నైట్ బ్లిజార్డ్ గ్రూప్ పనిగా చెబుతున్న ఈ సైబర్ దాడి 2023 నవంబర్ చివరిలో జరిగింది. సైబర్ నేరగాళ్ల ఆధీనంలోకి కీలక ఈ-మెయిల్ ఖాతాలు వెళ్లినా, ఆ విషయాన్ని మైక్రోసాఫ్ట్ వెంటనే గుర్తించలేకపోయింది. కార్పొరేట్ ఈ-మెయిల్ అకౌంట్స్ హ్యాక్ అయ్యాయని అనుమానం వచ్చిన తర్వాత, తన సైబర్ సెక్యూరిటీ టీమ్‌కు జనవరి 12న ఈ విషయం గురించి మైక్రోసాఫ్ట్ తెలిపింది. సైబర్ దాడిని గుర్తించిన వెంటనే భద్రత పరమైన విచారణ ప్రారంభించినట్లు వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ కస్టమర్ల డేటాను హ్యాకర్లు దొంగిలించలేదని, వాళ్లు ఆందోళన చెందొద్దని ప్రకటించింది. సైబర్ నేరగాళ్ల లక్ష్యం కంపెనీ గురించిన సమాచారాన్ని దొంగిలించడమని తెలిపింది. కంపెనీ గురించి వాళ్లు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారని మైక్రోసాఫ్ట్ ప్రశ్నించింది.
మరో ఆసక్తికర కథనం: అలాంటి పనికి ఆధార్ కార్డ్ పనికిరాదు, తెగేసి చెప్పిన EPFO
సైబర్ సెక్యూరిటీలో మార్పులు
ఈ సైబర్ దాడి తర్వాత మైక్రోసాఫ్ట్ మరింత అప్రమత్తమైంది. సైబర్ భద్రతలో మార్పులు చేయడానికి తాము కట్టుబడి ఉన్నట్లు ఆ బ్లాగ్‌లో కంపెనీ రాసింది. ఇందుకోసం వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని తెలిపింది. తమ ప్రస్తుత వ్యాపారంపై ప్రతికూల ప్రభావాన్ని చూపినప్పటికీ సైబర్ సెక్యూరిటీ విషయంలో మార్పులు చేయకతప్పదని వెల్లడించింది. ఈ కొత్త విషయాన్ని స్వీకరించినప్పుడు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని, కానీ, అది అవసరం అని పేర్కొంది.
మిడ్‌నైట్ బ్లిజార్డ్‌ను పాశ్చాత్య దేశాల్లో హ్యాకింగ్ గ్రూప్‌గా పరిగణిస్తారు. ఇది, రష్యా ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్‌కు (SVR) అనుసంధానమై పని చేస్తుంటుంది. ఈ గ్రూప్ గతంలోనూ చాలా హై ప్రొఫైల్ సైబర్ దాడులు చేసింది. వీటిలో, 2019లో సోలార్‌విండ్స్, 2015లో డెమోక్రటిక్ నేషనల్ కమిటీ వంటి సంఘటనలు ఉన్నాయి.
మరో ఆసక్తికర కథనం: రూ.2024తో SIP స్టార్ట్ చేయండి, కోటి రూపాయలు సంపాదించొచ్చు!