Aadhaar Card- EPFO News: భారతీయ పౌరుల వ్యక్తిగత గుర్తింపు పత్రాల్లో ఆధార్‌ కార్డ్‌ చాలా కీలకమైన డాక్యుమెంట్‌. ఆధార్‌ కార్డ్‌ ఉంటేనే చాలా పనులు పూర్తవుతాయి. అయితే... ఆధార్ కార్డు విషయంలో ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (EPFO) కీలక నిర్ణయం తీసుకుంది. ఒక సర్క్యులర్ కూడా జారీ చేసింది.


EPFO సర్క్యులర్
కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ పరిధిలో పని చేసే EPFO, పుట్టిన తేదీ రుజువు (Proof of Date of Birth) కోసం ఆధార్‌ కార్డ్‌ పనికిరాదని స్పష్టం చేసింది. ఆధార్‌ కార్డ్‌ను ఉపయోగించి పుట్టిన తేదీని మార్చలేమని తేల్చి చెప్పింది. ఈ నెల 16న ‍‌(గురువారం) EPFO ఈ సర్క్యులర్‌ను జారీ చేసింది. 


ఆధార్‌ వివరాల్లో, పుట్టిన తేదీని మార్చుకునే వెసులుబాటు ఉంది. నకిలీ పత్రాల సాయంతో ఇష్టం వచ్చిన తేదీని వేసుకుని, ప్రభుత్వ ప్రయోజనాలను దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది. కాబట్టి.. ఆధార్‌ కార్డ్‌ను పుట్టిన తేదీకి రుజువు పత్రంగా తీసుకోవద్దని ఇటీవల ఉడాయ్‌ (UIDAI) నుంచి EPFOకు లేఖ కూడా అందింది. దీంతో, డేట్‌ ఆఫ్‌ బర్త్‌ ప్రూఫ్‌గా చెల్లుబాటు అయ్యే పత్రాల జాబితా నుంచి ఆధార్‌ను తొలగిస్తూ EPFO నిర్ణయం తీసుకుంది.


జనన ధృవీకరణ కోసం అవసరమైన పత్రాలు
జనన ధృవీకరణ పత్రం కోసం ఆమోదించే పత్రాల లిస్ట్‌ను కూడా EPFO సర్క్యులర్‌లో వెల్లడించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ బోర్డు లేదా విశ్వవిద్యాలయం జారీ చేసిన మార్క్‌ షీట్, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ లేదా స్కూల్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (TC)ను డే ఆఫ్‌ బర్త్‌ ప్రూఫ్‌గా ఉపయోగించవచ్చు, వీటిపై సంబంధిత వ్యక్తి పేరు, పుట్టిన తేదీ ఉండాలి. సివిల్ సర్జన్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్‌, కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పెన్షన్ సర్టిఫికేట్, మెడిక్లెయిమ్ సర్టిఫికేట్, ప్రభుత్వం జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రాన్ని కూడా పుట్టిన తేదీ రుజువు పత్రంగా చూపించొచ్చు. జనన, మరణాల డిపార్ట్‌మెంట్‌ రిజిస్ట్రార్‌ జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రాన్ని; పేరు, పుట్టిన తేదీ వివరాలు ఉన్న SSC సర్టిఫికెట్‌ను, సర్వీస్‌ రికార్డ్‌ ఆధారంగా జారీ చేసిన ధృవపత్రాన్ని జనన ధృవీకరణ కోసం ఉపయోగించవచ్చు.


ఆధార్ కార్డును వ్యక్తిగత గుర్తింపు కార్డుగా, నివాస ధృవీకరణ పత్రంగా మాత్రమే ఉపయోగించాలని ఉడాయ్‌ తెలిపింది. దానిని జనన ధృవీకరణ పత్రంగా ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. ఆధార్‌ జారీ సమయంలో, చాలా మంది పుట్టిన తేదీలు తెలీక ఇష్టం వచ్చిన తేదీలను నమోదు చేశారు. లేదా, ఏవేవో పత్రాలను బట్టి పుట్టిన తేదీని నమోదు చేశారు. కాబట్టి, దానిని జనన ధృవీకరణ పత్రానికి ప్రత్యామ్నాయంగా పరిగణించకూడదు.


కోర్టు తీర్పులు
పుట్టిన రోజు ధృవీకరణ పత్రంగా ఆధార్‌ను గుర్తించలేమని వివిధ కేసుల్లో న్యాయస్థానాలు కూడా తీర్పునిచ్చాయి. ఆధార్ చట్టం 2016కు సంబంధించి నమోదైన కేసుల్లో దీని గురించి న్యాయస్థానాలు స్పష్టంగా చెప్పాయి. ఇటీవల, మహారాష్ట్ర Vs UIDAI కేసులో, ఆధార్ నంబర్‌ను గుర్తింపు కార్డుగా ఉపయోగించాలని, జనన ధృవీకరణ పత్రంగా ఉపయోగించకూడదని బాంబే హైకోర్టు కూడా చెప్పింది. ఆ తర్వాత, డిసెంబర్ 22, 2023న UIDAI ఒక సర్క్యులర్ జారీ చేసింది.


మరో ఆసక్తికర కథనం: NPS అకౌంట్‌ నుంచి డబ్బు తీసుకోవాలా?, ఫిబ్రవరి నుంచి కొత్త రూల్స్‌