eCommerce Market: 


దేశంలో కొనుగోలు శక్తి పెరుగుతోంది. రిటైల్‌ బూమ్‌కు ఊతంగా మారుతోంది. ఏటా రూ.2.5-10 లక్షల ఆదాయం సంపాదిస్తున్న వారే ఇందుకు కారణం! సంపాదన పెరగడం వల్ల 2030 నాటికి 1.3 లక్షల కోట్ల డాలర్ల మేర మార్కెట్లో అవకాశాలు పుంజుకుంటాయని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.


భారత రిటైల్‌ మార్కెట్లో మాస్‌ కన్జూమర్‌ సెగ్మెంట్‌ వల్ల 1.3 లక్షల కోట్ల డాలర్ల వ్యాపారం జరుగుతుందని సమాచారం. ఇందులో 45 శాతం మేర ఈ-కామర్స్‌  రంగం వాటా ఉండనుంది. 2030లో భారత ఈ-కామర్స్‌ వ్యాపారం విలువ 300 బిలియన్‌ డాలర్లకు పెరుగుతుందని అంచన.


భారత ఈ-కామర్స్‌ వ్యాపారంలో 135 బిలియన్ డాలర్ల GMV మాస్‌ కన్జూమర్స్‌ నుంచే రానుంది. డబ్బుకు తగ్గ విలువుండే ఉత్పత్తులకు వీరు ప్రాధాన్యం ఇస్తారిన సర్వేలు తెలిపాయి. కస్టమర్ల కొనుగోలు నిర్ణయంలో ఇంటర్నెట్‌ కీలక పాత్ర పోషించనుంది. అత్యుత్తమ డీల్స్‌, డిస్కౌంట్ల కోసం అందరూ ఇంటర్నెట్లో శోధిస్తున్నారని పేర్కొన్నాయి. మాస్‌ కన్జూమర్స్‌లో 75 శాతం మిలీనియల్స్‌, జెన్‌ జడ్‌ కస్టమర్లే ఉన్నారని రెడ్‌సీర్‌ వెల్లడించింది.


'యువత, స్వతంత్ర్యంగా ఆలోచించే జెన్‌ జెడ్‌ తరం దుస్తులు, అప్పారెల్‌, బ్యూటీ, పర్సనల్‌ కేర్‌, ఎలక్ట్రానిక్స్‌ కొనుగోలు చేసేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. విలువ కోసం తపించే మిలీనియల్స్ బ్యూటీ, పర్సనల్‌ కేర్‌, ఆహారం, కిరాణా, దుస్తులు కొంటున్నారు. 13 శాతం ఉన్న జెన్‌ ఎక్స్‌ ఎక్కువగా ఆహారం, కిరాణా సామగ్రి, హెల్త్‌, వెల్‌నెస్‌ ఉత్పత్తులను కొనుగోలు చేయడం గమనార్హం. పెద్ద వాళ్లతో పోలిస్తే భిన్నమైన వ్యక్తిత్వం కలిగిన జెన్‌ జెడ్‌ యువతా డబ్బుకు తగ్గ విలువ గురించి ఆలోచిస్తున్నారు' అని రెడ్‌సీర్‌ తెలిపింది.


వస్తువులు నాణ్యంగా ఉంటే చాలా మంది బ్రాండ్‌ను పట్టించుకోవడం లేదని రెడ్‌సీర్‌ సర్వే వెల్లడించింది. ఈ-కామర్స్‌ వేదికల్లో లభించే ధరలు, డీల్స్‌, రాయితీలు, ఉత్పత్తుల నాణ్యత, విశ్వాసానికి పెద్దపీట వేస్తున్నారని పేర్కొంది. ప్రస్తుతం భారత్‌లో మధ్య తరగతి వర్గం వేగంగా ఎదుగుతోంది. ఏడాదికి రూ.10 లక్షల వరకు సంపాదించేవారు 1995-2021 మధ్య 6.3 శాతం వరకు పెరగ్గా ఇప్పుడు 31 శాతానికి చేరుకున్నారు. వీరు 2031 కల్లా 38, 2047 కల్లా 60 శాతానికి చేరుకుంటారని అంచనా. స్వత్రంత్య భారత దేశానికి వందేళ్లు నిండేసరికి వంద కోట్లకు పైగా మధ్య తరగతి వాళ్లు ఉంటారని అంచనా. 


మధ్య తరగతిలో రూ.15-30 లక్షలు సంపాదిస్తున్న కుటుంబాలు 2015 నుంచి 2020 మధ్య 6.4 శాతం పెరిగాయి. రూ.5-15 లక్షల ఆర్జించే కుటుంబాలు 4.8 శాతం పెరిగాయి. ఈ దశాబ్దం ముగిసే సరికి కొద్ది మంది సంపన్నులు, ఎక్కువ మంది మధ్య తరగతి, కొద్ది మంది పేదలు ఉంటారు. వీరంతా ఈ-కామర్స్‌ వ్యాపార వృద్ధిలో కీలకం అవుతారు.


మరో ఆసక్తికర కథనం: చంద్రయాన్‌ రాకెట్‌లా దూసుకెళ్లిన టాటా మోటార్స్‌ DVRలు, భలే ఛాన్స్‌ కొట్టేశారు!


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.