అనర్హత వేటుకు గురైన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని చూస్తున్నారు. ఆయన ఎన్నిక చెల్లదని పేర్కొంటూ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసి రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది. దీంతో వెంకట్రావు అనుచరులు సంబరాలు చేసుకున్నారు. తమ పోరాటానికి న్యాయం దక్కిందని హర్షం వ్యక్తం చేశారు.
అసలేం జరిగిందంటే..
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ తరఫున వనమా వెంకటేశ్వరరావు పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావుపై 4,139 ఓట్లతో గెలిచారు. వనమాకు 81,118 ఓట్లు రాగా జలగం వెంకట్రావుకు 76,979 ఓట్లు వచ్చాయి. తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో వనమా కాంగ్రెస్‌ను వదిలి బీఆర్‌ఎస్ గూటికి చేరారు. అయితే ఎన్నికల అఫిడవిట్‌లో వనమా తప్పుడు వివరాలు సమర్పించారని ఆయన ఎన్నికల చెల్లదని జలగం వెంకట్రావు 2019 జనవరి 25న హైకోర్టును ఆశ్రయించారు. వనమా భార్య ఆస్తుల వివరాలు, ఆయన మీద ఉన్న క్రిమినల్ కేసుల వివరాలు ఇవ్వలేదని, ఆయన ఎన్నిక రద్దు చేసి, తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని పిటిషన్ వేశారు. జలగం పిటిషన్ రద్దు చేయాలని వనమా వెంకటేశ్వరరావు హైకోర్టును అభ్యర్థించారు. ఇందుకు హైకోర్టు నిరాకరించటంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ 2021 నవంబరు 8న విచారించి ఈ కేసు విషయంలో తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని ఆదేశించారు. దీంతో గత ఏడాది మార్చి రెండో వారం తర్వాత ఈ కేసుపై హైకోర్టు జస్టిస్ జీ రాధారాణి ధర్మాసనం పలు దఫాలుగా విచారణ జరిపింది.
‘వివరాలు దాచిపెట్టారు’
జలగం తరఫు న్యాయవాది కే రమేశ్ వాదనలు వినిపించారు. వనమా తన ఎన్నికల అఫిడవిట్‌లో 2014 నాటి క్రిమినల్ కేసు ఎఫ్‌ఐఆర్ నెంబర్ 127కు సంబంధించిన కేసు వివరాలు, ఆయన భార్య పేరిట న్యూపాల్వంచ ఇందిరానగర్‌లోని 300 చదరపు గజాల ఆస్తి గురించి తెలుపలేదన్నారు. హిందూ అవిభాజ్య కుటుంబం నుంచి ఆదాయం ఉందని తెలిపిన వనమా ఆయన రెండో పాన్ కార్డు వివరాలు పొందు పరచలేదన్నారు. వనమా కుమారులకు చీరాల, ఏలూరుల్లో రెండు ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయని.. చీరాల సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కాలేజీ క్రిస్టియన్ మైనార్టీ సొసైటీ కింద మంజూరైందని.. అలాంటప్పుడు హిందూ అవిభాజ్య కుటుంబం ఉండదని వాదించారు. ఉద్దేశపూర్వకంగా వివరాలు దాచిపెట్టడం.. కేసుల వివరాలు వెల్లడించకపోవడం ఓటర్లను మోసం చేయడమే కాకుండా అవినీతికి పాల్పడడమేనని.. ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించడం కిందికు వస్తుందని వాదనలు వినిపించారు.
పట్టించిన రైతు బంధు
పాల్వంచ మండల వ్యవసాయ అధికారి ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం పాల్వంచలోని సర్వే నంబర్ 122/2/సంస్తాన్ 1 ఎకరం 33 గుంటలకు వనమా రైతుబంధు నిధులు తీసుకున్నట్లు వెల్లడించారు. సదరు భూమికి 2018 నుంచి 2021 వరకు దాదాపు ఎనిమిదిసార్లు మొత్తం రూ.69,350 తీసుకున్నట్లు ఆధారాలతో నిరూపితమైంది. ఆయన భార్య పేరు మీద పాల్వంచలో సర్వే నంబర్ 992లో 8.37 ఎకరాల విషయంలో సైతం ఆధారాలు స్పష్టంగా ఉన్నట్లు హైకోర్టు పేర్కొంది. తప్పుడు వివరాలు వెల్లడించడంతోపాటు ఆస్తుల వివరాలు దాచిపెట్టినట్లు ఆధారాలతో సహా వెల్లడి కావడంతో వనమా ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పింది. ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన బీఆర్‌ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ తుది తీర్పు ఇచ్చింది. 2018 డిసెంబర్ 12 నుంచి జలగం వెంకట్రావునే ఎమ్మెల్యేగా పరిగణించాలని స్పష్టం చేసింది. తప్పుడు వివరాలతో ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేసినందుకు వనమాకు రూ.5 లక్షల జరిమానా సైతం విధించింది. ఇప్పటివరకు ఈ కేసు కోసం జలగం వెంకట్రావుకు అయిన మొత్తం ఖర్చును సైతం చెల్లించాలని వనమాకు ఆదేశాలు జారీచేసింది.