Diabetes: ప్రపంచంలో ఎక్కువమందిని ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం అనేవి అధికంగా ఉన్నాయి. ఇప్పుడు మధుమేహం చాప కింద నీరులా పాకి పోతోంది. 2050 నాటికి 100 కోట్లు దాటుతుందని అంచనా. దాదాపు 130 కోట్ల మంది 2050 కల్లా మధుమేహంతో ఇబ్బంది పడే అవకాశం ఉన్నట్టు సర్వేలు చెబుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని ఇప్పటినుంచే అలవర్చుకోవాలి. లేకుంటే భవిష్యత్తులో మధుమేహం బారిన పడే వారి సంఖ్య పెరిగిపోయే అవకాశం ఉంది.


మధుమేహం ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుంది. టైప్1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్. టైప్ 1 అనేది శరీరం ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయకపోవడం వల్ల వస్తుంది. ఎక్కువగా ఇది పిల్లల్లోనే కనిపిస్తుంది. ఇక టైపు2 డయాబెటిస్ అనేది ఇన్సులిన్ నిరోధకతను కలిగి ఉంటుంది. అంటే శరీరంలో ఉత్పత్తి అయిన ఇన్సులిన్ ను సమర్ధంగా ఉపయోగించుకోలేదు. ఇది పెద్దలలోనే వస్తుంది. జెస్టేషనల్ డయాబెటిస్ గర్భిణీలలో కనిపిస్తుంది. ప్రసవం అయ్యాక ఇది దాదాపు తగ్గిపోతుంది. అలాగే టైప్ 1.5 డయాబెటిస్ కూడా ఉంది. ఇది ఎవరిలోనైనా రావచ్చు. దీని లక్షణాలు టైప్2 డయాబెటిస్ తో పోలి ఉంటాయి.


డయాబెటిస్‌తో అనుబంధం కలిగిన అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. మధుమేహం ఉన్న వ్యక్తులు ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్, బ్రెయిన్ స్ట్రోక్, కంటి చూపు కోల్పోవడం, పాదాలకు పుండ్లు పడడం వంటి ప్రమాదాలతో ఎక్కువగా ముడిపడి ఉంటారు. అయితే మధుమేహంపై అవగాహన లేకపోవడం వల్ల, సరైన చికిత్స తీసుకోవడం వల్ల అలాంటి వ్యాధుల బారిన పడుతున్న మధుమేహ రోగులు ఎక్కువైపోతున్నారు. కాబట్టి వారు మధుమేహాన్ని ఎలా అదుపులో ఉంచాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.


డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని పెరుగుతున్న వయసు, ఊబకాయం, అనారోగ్యకరమైన జీవనశైలి పెంచుతాయి. డయాబెటిస్‌కు ముందు దశ ప్రీ డయాబెటిస్. ఈ ప్రీ డయాబెటిస్ అనేది ఒక వ్యక్తికి మధుమేహం లేనప్పటికీ అది త్వరలో వచ్చే అవకాశం ఉందని చెప్పే దశ. కొన్ని జన్యుపరమైన కారకాలు, జీవనశైలి కూడా  ప్రీ డయాబెటిస్ లేదా డయాబెటిస్ పరిస్థితికి దారితీస్తుంది. వారు తినే ఆహారం, వ్యాయామం, నిద్ర, ఒత్తిడి వంటివన్నీ కూడా మధుమేహం వచ్చే అవకాశాన్ని పెంచడం లేదా తగ్గించడం వంటివి చేస్తాయి. ముఖ్యంగా బరువు పెరగడం అనేది కచ్చితంగా మధుమేహాన్ని వచ్చేలా చేస్తుంది. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం, చక్కెర, అల్ట్రా ప్రాసెసిడ్ ఫుడ్స్ ఉన్న ఆహారాలను, పానీయాలను అధికంగా తినడం వల్ల కూడా డయాబెటిస్ వచ్చే అవకాశం పెరుగుతుంది.


డయాబెటిస్ బారిన పడకుండా ఉండాలంటే ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. తృణధాన్యాల లో ఫైబర్ అధికంగా ఉండే అవకాశం ఉంది. ఓట్స్, క్వినోవా, బ్రౌన్ రైస్ వంటివి తినడం అలవాటు చేసుకోవాలి. రాగులు, సజ్జలు, కొర్రలు వంటివి తినడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. తెల్ల అన్నం తగ్గించాలి. ప్రతిరోజు 30 నిమిషాల పాటు కచ్చితంగా వ్యాయామాన్ని చేయాలి. తాజా పండ్లు, కూరగాయలతో వండిన ఆహారాలను అధికంగా తింటూ ఉండాలి.


Also read: పెరిగిపోతున్న కండ్లకలక ఇన్ఫెక్షన్ - ఈ జాగ్రత్తలు తీసుకోండి









































































































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.