Tata Motors DVRs: ఆరు నెలల క్రితం అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్స్‌ డీలిస్ట్‌ చేసిన టాటా మోటార్స్, క్యాపిటల్‌ స్ట్రక్చర్‌ని మరింత ఈజీగా మార్చేందుకు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తన DVRలను (differential voting rights) క్యాన్సిల్‌ చేస్తోంది. వీటిని 15 ఏళ్ల క్రితం (2008లో) ఈ ఆటోమేకర్ ఇష్యూ చేసింది. ఆ తర్వాత 2010లో QIP ద్వారా, 2015లో రైట్స్‌ ఇష్యూలోనూ వీటిని జారీ చేసింది. ఆ తర్వాత, మరే ఇతర కంపెనీ స్పెషల్‌ రైట్స్‌ ఇష్యూలో ఇలాంటి షేర్లను జారీ చేయకుండా రెగ్యులేటరీలు కట్టడి చేశాయి. దీంతో, ఇలాంటి ఇన్‌స్ట్రుమెంట్‌ ఉన్న ఏకైక లిస్టెడ్ కార్పొరేషన్‌గా టాటా మోటార్స్‌ నిలిచింది. 


సాధారణ షేర్లకు, డీవీఆర్‌లకు తేడా
సాధారణ షేర్‌హోల్డర్లతో పోలిస్తే, DVR హోల్డర్లకు ఓటింగ్, డివిడెండ్ రైట్స్‌లో తేడా ఉంటుంది. సాధారణ షేర్‌హోల్డర్లతో పోలిస్తే DVRలకు 10% మాత్రమే ఓటింగ్‌ రైట్‌ ఉంటుంది. అదే సమయంలో, ఐదు శాతం ఎక్కువ డివిడెండ్ తీసుకుంటారు. 


టాటా మోటార్స్ DVR, సాధారణ షేర్‌ ప్రైస్‌లో దాదాపు సగం ధరకే ట్రేడ్‌ అవుతుంది. దీనివల్ల పెట్టుబడిదార్లకు ఆర్బిట్రేజ్‌ అపర్చునిటీ ఉంటుంది. మంగళవారం (25 జులై 2023), టాటా మోటార్స్ DVRలు దాదాపు 5% లాభంతో రూ. 374.40 వద్ద క్లోజ్‌ అయింది. కంపెనీ సాధారణ షేర్లు 1.6% లాభంతో రూ. 639.45 వద్ద ముగిశాయి.


DVR హోల్డర్లకు ఏంటి లాభం?
టాటా మోటార్స్‌ DVRలో 92% పైగా పబ్లిక్‌ చేతుల్లో ఉన్నాయి. ఈ లిస్ట్‌లో కొందరు ప్రముఖ ఇన్వెస్టర్లు కూడా ఉన్నారు. DVRలను రద్దు చేస్తే DVR హోల్డర్లకు అన్యాయం జరక్కుండా, సాధారణ షేర్లను కేటాయిస్తుంది టాటా మోటార్స్‌. ప్రతి 10 DVRలకుబదులు ఏడు ఈక్విటీ షేర్లను DVR హోల్డర్లకు మంజూరు చేస్తుంది.


DVRల క్యాన్సిలేషన్‌ వల్ల టాటా మోటార్స్‌ మొత్తం ఈక్విటీ షేర్ల సంఖ్య 4.2% తగ్గుతుంది. ఈ తగ్గింపు వల్ల, DVRల గత రోజు ముగింపు ధరతో పోలిస్తే 23% ప్రీమియం లభిస్తుంది. ఇదే లెక్క ప్రకారం, టాటా మోటార్స్‌ షేర్లు DVR హోల్డర్లకు 30% డిస్కౌంట్‌లో లభిస్తాయి.


దీన్ని ఇంకా సింపుల్‌గా చెప్పుకుందాం. ఒక వ్యక్తి దగ్గర 10 DVRలు ఉంటే, అతని 7 సాధారణ షేర్లు వస్తాయి. మంగళవారం నాటి ముగింపు ధర ప్రకారం, 10 DVRల ధర (374.40 x 10) రూ. 3,744 అవుతుంది. 7 సాధారణ షేర్ల రేటు (639.45 x 7) రూ. 4,476 అవుతుంది. అంటే, ఈ ఏడు షేర్లు రూ. 732 (4,476 - 3,744) డిస్కౌంట్‌లో వస్తున్నట్లు లెక్క. 


ఈ వ్యవహారం మొత్తం ఒక కొలిక్కి రావడానికి దాదాపు 12-14 నెలల సమయం పడుతుందని అంచనా. 


ప్రస్తుతం, సాధారణ షేర్ల కంటే దాదాపు 43% డిస్కౌంట్‌లో DVRలు ట్రేడ్‌ అవుతున్నాయి. ట్రేడర్లు ఆర్బిట్రేజ్‌ బెనిఫిట్స్‌ చూసుకోవడంతో, టాటా మోటార్స్ DVR షేర్లు ఈ రోజు (బుధవారం, 26 జులై 2023) 18% పెరిగి రూ. 440 వద్ద 52-వీక్స్‌ హైని చేరాయి. టాటా మోటార్స్ షేర్లు కూడా రూ. 665.40 వద్ద 52-వారాల కొత్త గరిష్టాన్ని సృష్టించాయి.


మరో ఆసక్తికర కథనం: పసిడికి ఫెడ్‌ వెలుగు - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial