సోమావారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ స్తంభించిపోయాయి. ఆ సమయంలో వినియోగదారులు ఎంత విలవిలలాడిపోయారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ అంతరాయాని చింతిస్తున్నామని ఫేస్‌బుక్ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ కూడా అన్నారు. అయితే ఈ అంతరాయం విలువ ఎంతో తెలుసా దాదాపు రూ.52 వేల కోట్లు.






అవును మార్క్ జుకర్‌బర్గ్ సంపద కొన్ని గంటల వ్యవధిలోనే 7 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.52 వేల కోట్లు) తరిగిపోయింది. అంతేకాదు బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ జాబితాలో ఆయన మూడు నుంచి ఐదో స్థానానికి పడిపోయారు. ప్రస్తుతం ఆయన సంపద 122 బిలియన్‌ డాలర్లుగా ఉంది.


భారీగా పడిపోయిన షేర్లు..


ఫేస్‌బుక్‌లో సమస్యలు తలెత్తాయనే వార్తలు రాగానే సంస్థ షేర్లు 5 శాతం మేర పడిపోయాయి. ఈ కారణంగా గత నెల మధ్య నుంచి ఇప్పటి వరకు కంపెనీ షేర్ల విలువలో 15 శాతం తగ్గుదల నమోదైంది. అలాగే నిన్న అనేక కంపెనీలు ఫేస్‌బుక్‌ నుంచి తమ ప్రకటనలను తొలగించాయి. ఈ నేపథ్యంలోనే జుకర్‌బర్గ్‌ సంపద తగ్గిపోయింది.


ఇలా ఎప్పుడూ లేదు..


ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ మెసేజింగ్ యాప్ సేవలు నిన్న నిలిచిపోయాయి. సామాజిక మాధ్యమాలైన వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్ స్టాగ్రామ్ సేవలు స్తంభించిపోయాయి. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 9 గంటల సమయంలో  సేవలకు అంతరాయం ఏర్పడింది. వాట్సాప్, ఇన్ స్టా, ఫేస్‌బుక్ సర్వర్స్ డౌన్ అవ్వడంతో వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. సాంకేతిక లోపం తలెత్తడం వల్లే సర్వీసులు నిలిచిపోయినట్లు ఫేస్‌బుక్ వెల్లడించింది.


గతంలో కొన్ని పర్యాయాలు వాట్సాప్, ఫేస్‌బుక్ సేవలు నిలిచిపోయాయి. కానీ గతానికి భిన్నంగా ఈసారి వాట్సాప్, ఫేస్‌బుక్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్ సేవలు చాలా సమయం నిలిచిపోవడం చర్చయనీయాంశం అయింది.  ఇది సైబర్ అటాక్ అయి ఉండొచ్చునని అమెరికా ఇంటెలిజెన్స్ అంచనా వేసింది. చైనా హ్యాకర్లు ఈ చర్యలకు పాల్పడ్డారా అనే కోణంలోనూ విచారిస్తున్నారు. 


Also Read:WhatsApp Down: వాట్సాప్, ఫేస్‌బుక్ డౌన్.. ఫన్నీ మీమ్స్‌తో ఆడేసుకుంటున్న నెటిజన్స్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి