ప్రపంచ దిగ్గజ సోషల్ మీడియా(మెటా) అధినేత మార్క్ జుకర్ బర్గ్, భారతీయ దిగ్గజ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ చేతులు కలిపాక.. సరికొత్త సేవలకు పునాదులు వేస్తున్నారు. జియో మార్ట్ తో తన భాగస్వామ్యాన్నిప్రకటించిన జుకర్ బర్గ్.. ఇప్పటికే రిలయన్స్ జియోలో 9.99 శాతం వాటాలను కొనుగోలు చేయడంతో  రెండు సంస్థల మధ్య బంధం ఏర్పడింది.  జియో గ్రూప్‌లో ఒకటిగా ఉన్న ఆన్‌ లైన్ గ్రాసరీస్ డెలివరీ సంస్థ జియో మార్ట్‌ తన వ్యాపారాన్ని మరింత ప్రమోట్ చేసుకోబోతున్నది.

  మెటా సంస్థకు చెందిన వాట్సాప్ ద్వారా జియోమార్ట్ తమ లోకల్ వెండార్స్‌ను ఒక్క తాటి మీదకు తీసుకురాబోతుంది. చిరు వ్యాపారస్తులను, కిరాణా దుకాణాలను ఆన్‌లైన్ వేదికపైకి జియో మార్ట్ తీసుకురాబోతున్నది.     


వాట్సాప్ చాట్ తో సరుకుల కొనుగోలు


భారత్‌లోని ఈ-కామర్స్ రంగంలో జియో మార్ట్ ప్రవేశించి తన ఆన్‌లైన్ బిజినెస్‌ను మరింత విస్తరిస్తున్నట్లు ఇప్పటికే  రిలయన్స్ ప్రకటిచింది. ఇక ఫేస్‌బుక్‌తో డీల్  తర్వాత  జియోమార్ట్‌పై స్థానిక దుకాణాదారులు, చిన్న తరహా కిరాణా స్టోర్‌లు రిజిస్టర్ చేసుకునే వీలు జియో మార్ట్ కల్పిస్తోంది. ఇక ఆర్డర్లను వాట్సాప్ ద్వారా తీసుకోనుంది. ఇక వాట్సాప్‌ గురించి చాలామందికి అవగాహన ఉన్నందున ఈ వేదికను విరివిగా వినియోగించుకోవాలని జియో మార్ట్ భావిస్తోంది. అదే సమయంలో కిరాణా స్టోర్‌లను కూడా ఇందులో చేర్చడం ద్వారా తన వ్యాపారాన్ని మరింత విస్తరించాలని జియో మార్ట్ భావిస్తోంది. ఇప్పటి వరకు కిరాణాస్టోర్లకు కస్టమర్లు వెళ్లి సరుకులను తీసుకునేవారని ఇప్పుడు అదే కిరాణా స్టోర్లు వాట్సాప్ ద్వారా ఆర్డర్లు అందుకుని డెలివరీ చేస్తాయని జియో మార్ట్ చెబుతోంది. వాట్సాప్ చాట్ ద్వారా జియో మార్ట్ నుంచి కిరాణా సరుకులు కొనుగోలు చేసే అవకాశం ఉందని తాజాగా జుకర్ బర్గ్ వెల్లడించారు. కొనుగోలుదారులు వాట్సాప్‌లోని JioMart నంబర్ (+917977079770)కి "హాయ్" పంపడం ద్వారా JioMartలో షాపింగ్ చేయవచ్చని తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా  తెలిపారు. 



 గ్రామాల్లో విరివిగా ఇంటర్నెట్ వినియోగం


వాట్సాప్, జియోమార్ట్‌ ఆన్ లైన్ ఆలోచన ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వినియోగం పెరిగే అవకాశం ఉంది. సాధారణ జనాలు సైతం వాట్సాప్ వినియోగించే అవకాశం ఉంది. దీంతో తన కంపెనీ కూడా గణనీయమైన జనాదరణ పొందే అవకాశం ఉందని వాట్సాప్ భావిస్తున్నది. ఇప్పటికే భారత్ లో వాట్సాప్ మంచి ఆదరణ దక్కించుకుంది.


కీలక మార్పులకు శ్రీకారం


ఫేస్‌బుక్‌- జియో డీల్ పై  గతంలోనే స్పందిచిన రిలయన్స్ ఛైర్మెన్ ముఖేష్ అంబానీ.. భారత్‌లో పెరుగుతున్న డిజిటల్ వినియోగానికి  ఈ భాగస్వామ్యం మరింత మేలు కలిగిస్తుందన్నారు. ఈ భాగస్వామ్యం మూలంగా డిజిటల్ ఇండియాతో పాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.  జియోమార్ట్ ద్వారా దాదాపు 3 కోట్ల చిన్న తరహా కిరాణా స్టోర్లను వాట్సాప్ వేదికపైకి తీసుకొస్తామని ప్రకటించారు. లావాదేవీలన్నీ డిజిటల్ పద్దతిలోనే జరుపుతామన్నారు.  భారత్ తమకు ప్రత్యేకమైన మార్కెట్ అన్నారు మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్. ఫేస్‌బుక్,  వాట్సాప్‌లకు అతిపెద్ద మార్కెట్‌గా భారత్ నిలిచిందని చెప్పారు.  డిజిటల్ ఎకానమీగా రూపాంతరం చెందడంలో భారత్ శరవేగంగా ముందుకు వెళ్తుందని వెల్లడించారు.