Credit Crads: మనలో చాలా మంది ప్రస్తుతం ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. అయితే చాలా మందికి పన్ను మెుత్తాన్ని చెల్లించటం భారంగా ఉంటుంది. కొన్ని సార్లు టాక్స్ చెల్లింపుల సమయంలో అవసరమైన నగదు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు.


ఇలాంటి పరిస్థఇతుల్లో చాలా మంది తమ క్రెడిట్ కార్డులను ఇన్కమ్ టాక్స్ చెల్లింపులు చేసేందుకు వినియోగిస్తుంటారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. కొన్ని ప్రత్యేక కార్డులను పన్ను చెల్లింపులకు వినియోగించటం ద్వారా వినియోగదారులు ఆకర్షణీయమైన రివార్డ్ పాయింట్‌లను అందుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఏ క్రెడిట్ కార్డ్‌లు ఆదాయపు పన్ను చెల్లింపుపై రివార్డ్ పాయింట్‌లను అందిస్తాయో తెలుసుకుందాం..


దేశంలో కొన్ని క్రెడిట్ కార్డ్‌లు మాత్రమే దేశంలో ఆదాయపు పన్ను చెల్లింపులపై రివార్డ్ పాయింట్లను అందిస్తున్నాయి. ప్రస్తుతం హెచ్‌డిఎఫ్‌సి బిజ్‌బ్లాక్, హెచ్‌డిఎఫ్‌సి బిజ్‌పవర్ క్రెడిట్ కార్డ్‌లు వంటి కొన్ని సెలక్టెడ్ కార్డులు మాత్రమే పన్ను చెల్లింపులకు రివార్డ్‌లను అందిస్తున్నాయి. ఈ కార్డ్‌లు పన్ను చెల్లింపుదారులకు గరిష్టంగా 16% పొదుపును  అందిస్తున్నాయి. అలాగే జీఎస్టీ చెల్లింపులపై ఏకంగా 8 శాతం వరకు టాక్స్ పేయర్స్ ఆదాచేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ కార్డులకు తోడు ఎస్‌బీఐ విస్తారా కార్డ్, ఐడిఎఫ్‌సి విస్తారా కార్డ్ వంటివి సైతం ఆదాయపు పన్ను చెల్లింపుపై మైలురాయి ప్రయోజనాలను అందిస్తున్నాయి. మీరు భాగస్వామ్య ఆఫర్‌లను స్వీకరించినప్పుడు మాత్రమే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ బిజ్‌బ్లాక్ క్రెడిట్ కార్డ్‌లోని సేవింగ్స్ ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుంది.


రివార్డ్ రేటు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ ఈ పొదుపులు రివార్డ్ పాయింట్ల రూపంలో మాత్రమే కార్డుదారులకు ఇవ్వబడతాయని గుర్తుంచుకోవాలి. నేరుగా క్యాష్ తగ్గింపు రూపంలో రావు. సదరు రివార్డ్ పాయింట్లను కార్డు హోల్డర్లు తర్వాత రిడీమ్ చేసుకోవచ్చు. తాజ్ హోటల్, లాంజ్ యాక్సెస్, మారియట్ హోటల్‌ వంటి బ్రాండ్ భాగస్వాముల వద్ద తమ రివార్డ్ పాయింట్లను రిడీమ్ చేసుకోవచ్చు. వాస్తవానికి అధిక ఆదాయ వర్గాలకు చెందిన వ్యక్తులు మాత్రమే ఇలాంటి కార్డులను తీసుకుంటుంటారు. అయితే వీటిపై వార్షిక ప్రయోజనాలు లక్షల వరకు ఉంటాయి. అయితే కార్డులను కలిగిన వ్యక్తులు తమ పన్ను చెల్లింపులను చేసేందుకు ఐటీఆర్ పోర్టల్‌లో క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఆప్షన్ ద్వారా తమ పన్ను బాధ్యతను పూర్తి చేయాల్సి ఉంటుంది.