LIC Policy: దేశంలోనే అతి పెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Life Insurance Corporation of India- LIC), ప్రజల కోసం ఎప్పటికప్పుడు వివిధ రకాల కొత్త బీమా పాలసీలను తీసుకొస్తూనే ఉంటుంది, పాత పాలసీలకు సైతం మెరుగు అద్ది ఆకర్షణీయమైన పథకాలు మారుస్తుంది. ఈ కోవలో, ఆడపిల్లల తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు ఆర్థిక సాయంగా ఉండే ఒక పథకాన్ని ప్రకటించింది. 


మీ కుమార్తె వివాహం ఏ లోటు లేకుండా, ఘనంగా చేయాలని మీరు భావిస్తే... అందుకు అవసరమైన డబ్బును మీకు అందించే ఎల్‌ఐసీ పథకం ఇది. ఎల్‌ఐసీ అమలు చేస్తున్న ఈ పథకం పేరు LIC కన్యాదాన్ పాలసీ. 


LIC కన్యాదాన్ పాలసీని తీసుకోవాలంటే, తండ్రి వయస్సు కనీసం 30 సంవత్సరాలు & కుమార్తె కనీస వయస్సు 1 సంవత్సరం ఉండాలి. ఈ ప్లాన్ 25 ఏళ్ల పాటు అందుబాటులో ఉంటుంది. మీ కుమార్తె వయస్సు ప్రకారం పాలసీ కాల పరిమితి తగ్గుతుంది. 


పాలసీ కనిష్ట మెచ్యూరిటీ వ్యవధి 13 సంవత్సరాలు, గరిష్ట సమయం 30 సంవత్సరాలు. ఆధార్ కార్డ్, ఆదాయ ధృవీకరణ పత్రం, గుర్తింపు కార్డు, జనన ధృవీకరణ పత్రాలు చేతిలో ఉంటే చాలు, LIC కన్యాదాన్ పాలసీని పొందవచ్చు.


దరఖాస్తుదారు రోజుకు ₹121 చొప్పున, నెలకు ₹3,600 డిపాజిట్ చేయవచ్చు. 25 సంవత్సరాల తర్వాత, మెచ్యూరిటీ సమయంలో రూ. 26.75 లక్షలు మీరు పొందుతారు. రోజుకు ₹121 చొప్పునే కట్టాల్సిన అవసరం లేదు. మీకు కావాలంటే, దీని కంటే తక్కువ మొత్తం లేదా ఎక్కువ మొత్తం ప్రీమియంలు కూడా చెల్లించవచ్చు. మీ సౌలభ్యం ప్రకారం... ప్రీమియంను ప్రతిరోజూ లేదా 6 నెలలకు ఒకసారి లేదా 4 నెలలకు ఒకసారి లేదా ప్రతి నెలా చెల్లించవచ్చు. 


ఎల్‌ఐసీ కన్యాదాన్‌ పాలసీ మరికొన్ని వివరాలు: 


ఈ పాలసీ మెచ్యూరిటీ తేదీకి ముందు 3 సంవత్సరాల వరకు లైఫ్ రిస్క్ కవర్‌ని అందిస్తుంది. మెచ్యూరిటీ సమయంలో, పాలసీదారుకు ఒకేసారి మొత్తం డబ్బు ఇస్తారు.


LIC కన్యాదాన్ పాలసీ ప్రకారం, పాలసీదారు చనిపోతే ఇక ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రమాదంలో పాలసీదారు మరణిస్తే అతని కుటుంబానికి రూ. 10 లక్షలు అందజేస్తారు. పాలసీదారుది సహజ మరణం అయితే, ఆ సందర్భంలో రూ. 5 లక్షలు LIC అందిస్తారు. 


భారతదేశం వెలుపల నివసిస్తున్న భారతీయ పౌరులు కూడా LIC కన్యాదాన్ పాలసీ ప్రయోజనాలను పొందవచ్చు.


పాలసీని కొన్న తేదీ నుంచి పాలసీ హోల్డర్‌కు 15 రోజుల ఫ్రీ లుక్ పిరియడ్‌ అందుబాటులో ఉంటుంది. పాలసీలోని ఏవైనా నిబంధనలు, షరతులతో పాలసీదారు సంతృప్తి చెందకపోతే, అతను/ఆమె పాలసీ నుంచి నిష్క్రమించవచ్చు. మీరు కట్టిన డబ్బు తిరిగి వస్తుంది.


వార్షిక, త్రైమాసిక చెల్లింపుల్లో 30 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. నెలవారీ చెల్లింపులకు 15 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఈ గ్రేస్ పిరియడ్‌లో పాలసీదారు నుంచి ఎలాంటి ఆలస్య రుసుము వసూలు చేయరు.  గ్రేస్ పీరియడ్ గడువు ముగిసే తేదీకి కూడా ప్రీమియం చెల్లించకపోతే, ఆ పాలసీ రద్దవుతుంది.


పాలసీదారు 3 సంవత్సరాల పాటు ప్రీమియంలు చెల్లించిన తర్వాత ఈ ప్లాన్ కింద పాలసీని సరెండర్ చేయడానికి అనుమత ఉంటుంది.


ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 80C కింద LIC కన్యాదాన్ ప్రీమియం మీద మీకు మినహాయింపు లభిస్తుంది. ఈ మినహాయింపు ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పొందవచ్చు. దీంతోపాటు, సెక్షన్ 10(10D) కింద మెచ్యూరిటీ లేదా డెత్ క్లెయిమ్ మొత్తం మీద కూడా మినహాయింపు ఉంటుంది.