L&T Q3 Results Profit jumps 24 percent YoY to Rs 2,553 crore: 


ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో లార్సెన్‌ అండ్‌ టుబ్రో (L&T) మెరుగైన ఫలితాలు విడుదల చేసింది. 2022, డిసెంబర్‌ 31తో ముగిసిన త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన రూ.2553 కోట్ల పన్నేతర ఆదాయం ఆర్జించింది. 24 శాతం వృద్ధి నమోదు చేసింది.


మొత్తంగా కంపెనీ ఏకీకృత ఆదాయం 17 శాతం పెరిగి రూ.46,390 కోట్లుగా ఉంది. మౌలిక ప్రాజెక్టుల్లో మంచి పనితీరు కనబరచడం, ఐటీ&ఐటీఈఎస్‌ పోర్టుఫోలియోలో వృద్ధి జోరు కొనసాగించడమే ఇందుకు కారణాలు.


మూడో త్రైమాసికంలో కంపెనీ అంతర్జాతీయ రాబడి రూ.17,317 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయంలో ఇది 37 శాతం కావడం గమనార్హం. గ్రూపు స్థాయిలో కంపెనీ రూ.60,710 కోట్ల ఆర్డర్లు పొందింది. అంతకు ముందు ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 21 శాతం వృద్ధి నమోదు చేసింది. అంతర్జాతీయ ఆర్డర్లు రూ.15,294 కోట్లుగా ఉన్నాయి. మొత్తం ఆర్డర్లలో వీటి వాటా 25 శాతం.


అంతర్జాతీయ ఆర్డర్ల వాటా 26 శాతం 
ఈ త్రైమాసికంలో ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, పబ్లిక్‌ ప్లేసెస్‌, హైడల్‌, టన్నెళ్లు, ఇరిగేషన్‌ సిస్టమ్స్‌, ఫెర్రస్‌ మెటల్స్‌, పవర్‌ ట్రాన్స్‌మిషన్‌, డిస్ట్రిబ్యూషన్‌ విభాగాల్లో ఎల్‌టీకి ఆర్డర్లు వచ్చాయి. 2022, డిసెంబర్‌ 31కి మొత్తం గ్రూపు ఏకీకృత ఆర్డర్ల విలువ రూ.3,86,588 కోట్లుగా ఉంది. ఇందులో అంతర్జాతీయ ఆర్డర్ల వాటా 26 శాతంగా ఉంది. మూడో త్రైమాసికంలో మౌలిక ప్రాజెక్టుల విభాగంలో కంపెనీ రూ.32,530 కోట్ల ఆర్డర్లు సొంతం చేసుకుంది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 28 శాతం వృద్ధి నమోదు చేసింది. అంతర్జాతీయ ఆర్డర్లు రూ.2,936 కోట్లు కాగా మొత్తం ఆర్డర్లలో వీటి వాటా 9 శాతం.


ముడి వనరుల ధరలు పెరిగినా మార్జిన్‌ నిలకడగా 
మౌలిక ప్రాజెక్టుల విభాగంలో కంపెనీ ఎబిటా మార్జిన్‌ 7 శాతంగా ఉంది. గతేడాది ఇదే సమయంలో ఇది 7.1 శాతం కావడం గమనార్హం. ఖర్చులు, ముడి వనరుల ధరలు పెరిగినా మార్జిన్‌ నిలకడగా ఉండటం ప్రత్యేకం. ఇక విద్యుత్‌ ప్రాజెక్టుల విభాగంలో కంపెనీ రూ.9,051 కోట్ల ఆర్డర్లు సొంతం చేసుకుంది. వార్షిక ప్రాతిపదికన 12 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇదే త్రైమాసికంలో ఎల్‌టీ ఇన్ఫోటెక్‌, మైండ్‌ ట్రీ విలీనం పూర్తైంది. రెండూ కలిసి ఒకే సంస్థగా రూపొందాయి. ఈ విభాగంలో ఆదాయం రూ.10,517 కోట్లుగా ఉంది. వార్షిక ప్రాతిపదికన 25 శాతం వృద్ధి నమోదైంది.


సోమవారం ఎల్‌టీ షేరు ధర రూ. 37.80 తగ్గి రూ.2,122 వద్ద ముగిసింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.