LIC Dhan Varsha: ఒక్క ప్రీమియం కట్టండి - దానికి 10 రెట్ల మొత్తం వెనక్కు తీసుకోండంటూ కొత్త పాలసీతో వచ్చింది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (Life Insurance Corporation - LIC). సమాజంలోని ప్రతి వర్గాన్ని టార్గెట్ చేస్తూ, ఎప్పుడూ ఏదోక కొత్త పాలసీని ప్రకటించే ఈ జీవిత బీమా కంపెనీ... తాజాగా కొత్త బీమా ప్లాన్‌తో వచ్చింది. ఆ పాలసీ పేరు LIC ధన్ వర్ష. ఈ పాలసీలో, పెట్టుబడిదారుడు ఒక్కసారి మాత్రమే ప్రీమియం డిపాజిట్ చేయాలి. ప్రీమియం తేదీలు గుర్తుంచుకుని, ఆ సమయానికి డబ్బులు వెతుక్కునే ఇబ్బంది ఈ ప్లాన్‌లో ఉండదు.
ధన్ వర్ష ప్లాన్ అంటే ఏమిటి?
LIC యొక్క ధన్ వర్ష ప్లాన్ ఒక నాన్ పార్టిసిపేటింగ్, పర్సనల్, సింగిల్ ప్రీమియం, సేవింగ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఈ పాలసీని ఆఫ్‌లైన్‌లో మాత్రమే కొనుగోలు చేయవచ్చు. అన్ని బీమా పాలసీల్లాగే, పాలసీ మెచ్యూరిటీ తేదీ కంటే ముందే పాలసీదారు మరణిస్తే, అతని కుటుంబానికి బీమా మొత్తం అందుతుంది.
ధన్ వర్ష ప్లాన్‌లో రెండు ఆప్షన్లు
ధన్ వర్ష ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడానికి రెండు రకాల ఆప్షన్లు ఉన్నాయి.
మొదటి ఆప్షన్ - ధన్ వర్ష ప్లాన్ మొదటి ఆప్షన్‌లో, డిపాజిట్ చేసిన ప్రీమియం కంటే 1.25 రెట్ల వరకు రిటర్న్ పొందుతారు. ఒక వ్యక్తి ఈ ఆప్షన్ ప్రకారం రూ. 10 లక్షల ప్రీమియం (వన్ టైమ్ ప్రీమియం లేదా ఏకకాల ప్రీమియం) చెల్లించాక మెచ్యూరిటీ తేదీకి ముందే మరణిస్తే, అతని కుటుంబానికి రూ. 12.5 లక్షల హామీతో కూడిన బోనస్ (అజ్యూర్డ్ అమౌంట్) అందుతుంది.
రెండో ఆప్షన్ - ధన్ వర్ష ప్లాన్ రెండో ఆప్షన్‌లో, పెట్టుబడిదారు 10 రెట్ల వరకు రిస్క్ కవర్ పొందుతారు. ఈ ఆప్షన్ ప్రకారం ఒక వ్యక్తి పాలసీని కొనుగోలు చేసిన తర్వాత అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే, అటువంటి పరిస్థితిలో అతని కుటుంబానికి 10 రెట్లు వరకు తిరిగి పొందుతుంది. రెండో ఆప్షన్ కింద రూ. 10 లక్షల పాలసీ తీసుకుంటే, రూ. 1 కోటి గ్యారెంటీ బోనస్ పొందుతారు.
మీ అవసరం, చేసే పని, రిస్క్ వంటివి దృష్టిలో పెట్టుకుని ఈ రెండు ఆప్షన్లలో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు.
ధన్ వర్ష పాలసీ గురించి మరికొన్ని వివరాలు:
ఈ పాలసీని ఆఫ్‌లైన్‌లో మాత్రమే కొనుగోలు చేయగలరు, ఆన్‌లైన్‌లో అందుబాటులో లేదు.
దీన్ని 2 కాలావధులకు, అంటే 10 సంవత్సరాలు & 15 సంవత్సరాలకు కొనుగోలు చేయవచ్చు.
మీరు 15 సంవత్సరాల పాలసీ తీసుకోవాలని అనుకుంటే, దానిని కొనుగోలు చేయడానికి కనీస వయస్సు 3 సంవత్సరాలు.
10 సంవత్సరాల పాలసీ తీసుకోవాలని అనుకుంటే, దానిని కొనుగోలు చేయడానికి కనీస వయస్సు 8 సంవత్సరాలు.
మొదటి ఆప్షన్‌లో, పాలసీ తీసుకోవడానికి గరిష్ట వయస్సు 60 సంవత్సరాలు. రిస్క్ కంటే 10 రెట్లు ఎక్కువ మొత్తం ఉండాలనుకుంటే, గరిష్ట వయస్సు పరిమితి 40 సంవత్సరాలు.
10 రెట్లు రిటర్న్‌తో 15 ఏళ్ల పాలసీని తీసుకోవడానికి గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు.
ఈ పాలసీని హామీగా పెట్టి మీరు LIC నుంచి రుణం కూడా తీసుకోవచ్చు.
అవసరం లేదు అనుకున్నప్పుడు ఈ పాలసీని సరెండర్ చేసే సౌలభ్యం కూడా ఉంది.
ఒకవేళ పాలసీదారు మరణిస్తే, నామినీకి రావల్సిన డబ్బును నెలనెలా అందేలా కూడా ఏర్పాటు చేయవచ్చు.