Bapatla Road Accident: బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు అయ్యప్ప మాల వేసుకున్న దీక్షపరులు దుర్మరణం చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. కృష్ణా జిల్లాకు చెందిన స్వాములు ఆటోలో వెళ్తున్నారు. ఈ క్రమంలోనే బాపట్ల జిల్లాలోని వేమూరు మండలం జంపని వద్దకు రాగానే ఆదుపు తప్పి ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు స్వాములు అక్కడికక్కడే చనిపోయారు. మరో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే విషయం గుర్తించిన స్థానిక ప్రజలు.. స్వాములను బయటకు తీశారు. పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు క్షతగాత్రులను బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకునే పనిలో పడ్డారు. 




మూడ్రోజుల క్రితం కాకినాడలో - ముగ్గురు సజీవ దహనం


కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవదహనం అయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అతడ్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. ధర్మవరం జాతీయ రహదారిపై ఉన్న హెచ్.పి పెట్రోల్ బంక్ వద్ద ఈ ఘటన జరిగింది. ఎర్రవరం నుంచి విశాఖపట్నం వైపుగా వెళ్తోన్న ఇసుక లారీ అదుపుతప్పి డివైడర్ దాటి ఎదురుగా వస్తోన్న మరొక లారీని ఢీకొట్టింది. ప్రమాద ఘటనలో లారీ క్యాబిన్ నుంచి మంటలు చెలరేగాయి. రెండు లారీలలో ఉన్న ఇద్దరు డ్రైవర్లు ఒక క్లీనర్ సజీవ దహనం అయ్యారు. రెండు లారీలు ఢీకొనడంతో క్యాబిన్ లోంచి చెలరేగిన మంటలు చెలరేగి ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. 


అసలేం జరిగింది? 


కాకినాడ జిల్లాలో ప్రత్తిపాడు మండలం ధర్మవరం సమీపంలో జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా లారీల క్యాబిన్‌లో మంటలు వ్యాపించాయి. దీంతో క్యాబిన్‌లో చిక్కుకున్న ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ ఘటనాస్థలిలో సజీవ దహనం అయ్యారు. మరొకరిని ఆసుప్రతికి తరలిస్తుండగా మార్గ మధ్యలో ప్రాణాలు కోల్పోయారు. మొత్తం నలుగురు మరణించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. రాజమండ్రి నుంచి విశాఖపట్నం వైపుగా వెళ్తోన్న ఇసుక లారీ అదుపుతప్పి డివైడర్ దాటి మరొక లారీని ఢీ కొట్టింది. రెండు లారీలు వేగంగా ఒకదానిని మరొకటి ఢీకొట్టడంతో ఒకదానికొకటి ఇరుక్కుపోయాయి. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంతో కొద్దిసేపు జాతీయరహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.  


పలమనేరులో బస్సు ప్రమాదం 


 చిత్తూరు జిల్లాలో బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తోన్న బస్సు ప్రమాదానికి గురైంది. హెచ్‌బీ ట్రావెల్స్‌ బస్సు  పలమనేరు సమీపంలోని కెట్లపాలెం వద్ద జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత బోల్తా పడింది.  బస్సు ప్రమాదానికి డ్రైవర్‌ నిద్రమత్తే కారణమని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 20 మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. బస్సు ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై విచారణ చేసి మిగతా వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.