Jio Tariffs: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో.. (Reliance Jio).. కస్టమర్లకు షాక్ ఇచ్చింది. తమ మొబైల్ రీఛార్జ్ టారిఫ్ ప్లాన్లను (Jio Tarif Plans) భారీగా పెంచేసింది. తక్కువలో తక్కువంగా 12.5 శాతం నుంచి.. మ్యాగ్జిమమ్ 25 శాతానికి రేట్లు పెంచేస్తూ.. కీలక ప్రకటన జారీ చేసింది. మిగిలిన ప్లాన్లపైనా కొత్త ఆంక్షలు తీసుకొచ్చింది. ఈ ఆంక్షల కారణంగా.. 5జీ అన్ లిమిటెడ్ సర్వీసెస్ (Jio 5g services) కూడా ప్రభావితం కానున్నాయి. కొత్త టారిఫ్ లు అమల్లోకి వచ్చిన నాటి నుంచి.. రోజుకు 2 జీబీ డేటా ప్లాన్ తీసుకున్న వారికి మాత్రమే అన్ లిమిటెడ్ 5జీ డేటా సదుపాయం ఉంటుందంటూ.. రిలయన్స్ జియో తమ ప్రకటనలో స్పష్టం చేసింది. అయితే.. రేట్లు పెంచేసిన అసంతృప్తి నుంచి.. కొన్ని కొత్త ప్లాన్లను ప్రకటించిన జియో.. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించింది.


రిలయన్స్ జియో (Reliance Jio) చేసిన తాజా ప్రకటనలోని కీలకమైన విషయం.. పెరిగిన టారిఫ్ రేట్లు ఉన్నట్టుండి కాకుండా.. జూలై 3 నుంచి అమల్లోకి రావడం. అప్పటి వరకూ ఇప్పుడు అమల్లో ఉన్న ప్లాన్ల ధరలనే జియో వసూలు చేస్తుంది. జూలై 3 నుంచి మాత్రం.. 155 రూపాయల ప్లాన్.. 189 రూపాయలు అవుతుంది. అలాగే.. 209 రూపాయల ప్లాన్ 249 రూపాయలుగా.. 239 రూపాయల ప్లాన్ కు 299 రూపాయలు.. 299 రూపాయల ప్లాన్ కు 349 రూపాయలు.. 349 ప్లాన్ కు 399.. 399 ప్లాన్ కు 449 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇలా.. ప్రతీ ప్లాన్ టారిఫ్ ధరను భారీగా పెంచేస్తూ.. రిలయన్స్ జియో ప్రకటన విడుదల చేసింది. నెల వారీ ప్లాన్లు మాత్రమే కాకుండా.. 2 నెలలు, 3 నెలలు, వార్షిక ప్లాన్ల మొత్తాన్ని కూడా జియో పెంచేసింది. అక్కడితో ఆగకుండా.. డేటా యాడ్ ఆన్ ప్యాక్ లు, పోస్ట్ పెయిడ్ ప్లాన్ల ధరలను సైతం పెంచేస్తూ.. కస్టమర్లను ఆలోచనలో పడేసింది.


టారిఫ్ రేట్లు పెంచిన జియో.. 2 కొత్త సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. వీటిని ఏడాది పాటు ఫ్రీగా జియో కస్టమర్లకు అందిస్తామని ప్రకటించింది. నెలకు 199 రూపాయల ప్లాన్ తో.. జియో సేఫ్ - క్వాంటం సెక్యూర్ ప్లాన్ ను (Jio Safe Quantum Secure Plan) అనౌన్స్ చేసింది. ఇందులో కాలింగ్, మెసేజింగ్, ఫైల్స్ ట్రాన్స్ ఫర్ వంటి సదుపాయాలు ఉంటాయి. నెలకు 99 రూపాయల ప్లాన్ తో.. జియో ట్రాన్స్ లేట్ ఏఐ (Jio Translate AI) ఫెసిలిటీని సంస్థ ప్రకటించింది. వాయిస్ కాల్స్, వాయిస్ మెసేజ్ టెక్స్ట్, ఇమేజ్ లలో ఉండే ఇన్ఫోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Jio Artificial Intelligence) తో ఇంటర్ లింక్ చేయడమే.. ఈ ప్లాన్ స్పెషాలిటీ. జియో ప్రకటించినట్టుగా.. కస్టమర్లు ఈ ప్లాన్లను ఏడాది పాటు ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు. పెరిగిన టారిఫ్ ప్లాన్లకు బదులుగా ఈ సర్వీసులను అందుకున్న సంతృప్తిని.. కస్టమర్లకు అందజేసే దిశగా జియో వీటిని ప్రకటించినట్టు స్పష్టమవుతోంది.


ఓవరాల్ గా చూస్తే.. 17 ప్రీపెయిడ్ టారిఫ్ లతో పాటు.. 2 పోస్ట్ పెయిడ్ ప్లాన్ల ధరలను కూడా రిలయన్స్ జియో పెంచేసింది. ఈ ప్రభావంతో.. పోటీ సంస్థలైన ఎయిర్ టెల్ (Airtel), వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) కూడా ధరలు పెంచే అవకాశం ఉందని టెలికాం ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.