Ramoji Rao Memorial : ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ మాదిరిగా అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. అమరావతిలో ఒక రోడ్కు రామోజీరావు మార్గ్ పేరు పెడతాం. విశాఖపట్నంలో చిత్రనగరి ఏర్పాటు చేస్తాం. తెలుగుజాతికి ఆయన చేసిన సేవలకు గానూ తగిన గుర్తింపు రావాలన్నారు. ఎన్టీఆర్, రామోజీరావులకు భారతరత్న సాధించడం మన బాధ్యత. రామోజీరావు ప్రజల ఆస్తి. ఆయన స్థాపించిన వ్యవస్థలను భావితరాలకు అందించాలని సూచించారు. విజయవాడలో జరిగిన రామోజీ సంస్మరణ కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు.
విలువల కోసం బతికిన రామోజీరావు : చంద్రబాబు
రామోజీరావు నిరంతరం విలువ కోసం బ్రతికారు.. ప్రజల కోసం పోరాటం చేశారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. నవ్యాంధ్రకు రాజధానికి ఏ పేరు పెట్టాలా? అని ఆలోచిస్తున్న సమయంలో రీసెర్చ్ చేసి 'అమరావతి' పేరును సూచించారు. ఐదేళ్ల పాటు ఇబ్బందులు ఎదుర్కొన్నా.. ఇక నుంచి అమరావతి దశ, దిశ మారుతుందన్నారు. తెలుగుజాతి ఉజ్వల భవిష్యత్తుకు అమరావతి నాంది పలుకుతుంది. తెలుగు భాష, తెలుగు జాతి అంటే ఆయనకు ఎనలేని ఆప్యాయత. పనిచేస్తూ చనిపోవాలని ఆయన కోరుకున్నారు. చివరి రోజుల్లో అదే జరిగింది. దిల్లీలో విజ్ఞాన్ భవన్ మాదిరిగా.. అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. రామోజీరావును దెబ్బతీయడానికి మార్గదర్శిపైనా దాడులు చేశారని అయినా ఆయన ఎక్కడా చెక్కు చెదరలేదన్నారు.
అమరావతిలో రామోజీ విగ్రహం ఏర్పాటు చేయాలి : పవన్ కల్యాణ్
సినిమాలు చేసే సమయంలో రామోజీరావుతో ప్రత్యక్ష అనుబంధం లేదని.. 2008లో నేరుగా ఒకసారి రామోజీరావును కలిసి మాట్లాడానని పవన్ కల్యాణ్ తెలిపారు. రామోజీరావు ప్రజల పక్షపాతి... జర్నలిస్టు విలువను కాపాడటంలో ముందున్నారని తెలిపారు. ప్రజల కోసం ఏం చేయాలనే అంశాలపైనే ఆలోచించారనియయ 2019లో నన్ను లంచ్ మీటింగ్ కు రామోజీరావు ఆహ్వానించారని పవన్ గుర్తు చేసుకున్నారు.
దేశంలో, రాష్ట్రంలో పరిస్థితులు, పత్రికా రంగం గురించి మా మధ్య చర్చ సాగిందన్నారు. జనం తాలూకా అభిప్రాయాలే ఈనాడు పేపర్లో ప్రతిబింబిస్తాయని.. లంచ్ మీటింగ్ సమయంలో రామోజీరావు వేదనను నేను నేరుగా చూశానన్నారు. ప్రజాస్వామ్యానికి పత్రిక స్వేచ్చ ఎంతో అవసరమో ఈ దేశానికి చాటి చెప్పారన్నారు. అటువంటి వ్యక్తి పై ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనందరికీ తెలుసని.. పేపర్ ఒక్కటే నడపటం చాలా కష్ట సాధ్యం.. కానీ విలువలతో ముందుకు సాగారన్నారు. ఇతర వ్యాపారాలపై దాడులు చేసినా.. తట్టుకుని.. జర్నలిస్టుగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ముందుకు సాగారని గుర్తు చేుకున్నారు. నువ్వు ఏం చేస్తావో.. ఏం నమ్ముతావో త్రికరణ శుద్దిగా చేయి అని నాకు రామోజీరావు సూచించారని పవన్ తెలిపారు. రైట్ టూ ఇన్ ఫర్మేషన్ యాక్టు గురించి ఉద్యమ కర్తగా వ్యవహరించారు.. ఆర్.టి.ఐ ద్వారా ప్రభుత్వం ఏమి చేసినా ప్రజలు తెలుసుకోవచ్చని చాటి చెప్పారన్నారు. స్టూడియోలు కట్టినా, సినిమాలు చేసినా.. ఆదర్శ జర్నలిస్టు భావాలు చాలా ఉన్నాయని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులను బెదిరించినా.. ఎక్కడా వెనక్కి తగ్గలేదు ..ఇలా దైర్యంగా నిలబడటానికి చాలా దైర్యం కావాలన్నారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న సమయంలో కూటమి విజయ వార్త విన్నారా లేదా అని నేను కూడా అడిగి తెలుసుకున్నా ..విజయ వార్త విన్న తర్వాతే ఆయన తన ప్రాణాలు విడిచారన్నారు. అటువంటి మహోన్నత వ్యక్తి విగ్రహం అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయాలని సూచించారు. రామోజీ జీవితం నిరంతర ప్రవాహం.. అందరూ తెలుసుకోవాలన్నారు.
అమరావతికి రూ.10 కోట్లు విరాళమిచ్చిన రామోజీ కుటుంబం
రామోజీరావు ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఎప్పుడూ పరితపించేవారని రామోజీరావు తనయుడు కిరణ్ తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా అండగా నిలబడేవారని, ఎక్కడ విపత్తులు వచ్చినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉండేవారని పేర్కొన్నారు. నాన్న గారి స్ఫూర్తితో ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉంటానని మాటిస్తున్నాం అని కిరణ్ తెలిపారు. నాడు ఆయన నవ్యాంధ్ర రాజధానికి అమరావతి పేరు సూచించారని, తాజాగా, అమరావతి నిర్మాణం కోసం తాము రూ.10 కోట్లు విరాళం అందిస్తున్నామని సభా ముఖంగా ప్రకటించారు. అమరావతి... దేశంలోనే గొప్ప నగరంగా వర్ధిల్లాలి అని కిరణ్ ఆకాంక్షించారు.
హాజరైన సినీ రాజకీయ ప్రముఖులు
సంస్మరణ సభకు రామోజీరావు కుటుంబసభ్యులతో పాటు పలువురు మీడియా దిగ్గజాలు,సినీ,రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. రామోజీ సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వం రామోజీ సంస్మరణను అధికారికంగా నిర్వహించింది.