Paytm Shares: పేటీఎంను మరిన్ని కష్టాలు చుట్టుముట్టే సూచనలు కనిపిస్తున్నాయి. తీవ్రమైన నష్టాల నుంచి ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటోంది అనుకుంటున్న తరుణంలో, ఈ స్టాక్‌ మీద మరో దెబ్బ పడబోతోంది.


చైనాకు చెందిన యాంట్ గ్రూప్‌నకు పేటీఎంలో వాటా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆ వాటాను రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగా మార్చడానికి, కొన్ని షేర్లను విక్రయించాలని యాంట్ గ్రూప్‌ చూస్తోందని సమాచారం. 


పేటీఎంలో యాంట్‌ గ్రూప్‌నకు 24.86% వాటా
షేర్ బైబ్యాక్‌ల కారణంగా వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్‌లో (One 97 Communications Ltd లేదా Paytm) చైనీస్ ఫిన్‌టెక్ దిగ్గజం వాటా పెరిగింది. ఇలా పెరిగిన వాటాను తిరిగి తగ్గించుకునే ఆప్షన్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.


డిసెంబర్‌ నాటికి పేటీఎంలో యాంట్‌ గ్రూప్‌నకు 24.86% వాటా ఉంది. అయితే, బై బ్యాక్‌ల కారణంగా దాని హోల్డింగ్‌ 25% పైన పెరిగింది. ఫిబ్రవరి 13న బైబ్యాక్ పూర్తయింది. ఇప్పుడు, తన వాటాను తగ్గించుకోవడానికి యాంట్‌కి 90 రోజుల సమయం ఉంది. రెగ్యులేటరీ నిబంధనలు పాటించాలి కాబట్టి, పేటీఎం షేర్ల విక్రయం అనివార్యంగా కనిపిస్తోంది.


ఆసియా వ్యాప్తంగా చెల్లింపు సేవల నెట్‌వర్క్‌ను విస్తరించాలన్న లక్ష్యంతో, చైనా భూభాగం బయట పని చేస్తున్న 10 ఫిన్‌టెక్ వాలెట్లలో యాంట్‌ పెట్టుబడులు పెట్టింది.


పడిపోతున్న షేర్‌ ధరను నిలబెట్టుకోవడానికి, 2022 డిసెంబర్‌లో, 8.5 బిలియన్ రూపాయల (100 మిలియన్‌ డాలర్లు) విలువైన బైబ్యాక్‌ను One97 కమ్యూనికేషన్స్‌ ప్రకటించింది.


పేటీఎంలో వాటా కోసం సునీల్ మిత్తల్ తహతహ
పేటీఎం నుంచి తన వాటాను వెనక్కు తీసుకోవాలని ఓవైపు యాంట్‌ గ్రూప్‌ చూస్తుంటే... భారత టెలికాం దిగ్గజం సునీల్ మిత్తల్ పేటీఎంలో వాటా కొనుగోలు చేయాలని తహతహలాడుతున్నట్లు తెలుస్తోంది. తన ఆర్థిక సేవల విభాగమైన ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ను (Airtel Payments Bank‌) పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌లో ‍‌(Paytm Payments Bank) విలీనం చేయడం ద్వారా Paytmలో వాటాను కోరుతున్నట్లు సమాచారం.


ఇతర పేటీఎం వాటాదార్ల నుంచి కూడా Paytm షేర్లను కొనుగోలు చేయాలని మిత్తల్‌ భావిస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు చెప్పుకుంటున్నాయి. చర్చలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. కాబ్టటి, రెండు వర్గాల మధ్య ఒప్పందం కుదురుతుందా, లేదా అన్న అంశంపై ప్రస్తుతం స్పష్టత లేదు.


క్రమంగా పుంజుకుంటున్న పేటీఎం
పేటీఎం బ్రాండ్‌ను నడిపిస్తున్న  వన్‌97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్‌ (One 97 Communications Ltd), లాభదాయకత సంకేతాలు ఇచ్చింది. 2022 నవంబర్‌లోని, దాని రికార్డు కనిష్ట స్థాయి నుంచి ఇప్పుడు దాదాపు 40 శాతం పుంజుకుంది. కస్టమర్లను భారీగా చేర్చుకోవడంపై దృష్టి సారించిన తర్వాత ఈ కంపెనీ, తన Q3 (డిసెంబర్‌ త్రైమాసికం) నష్టాన్ని కూడా తగ్గించుకుంది. కస్టమర్ల సముపార్జన వల్ల ఆదాయం పెరిగిందని ఈ నెల ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేటీఎం తెలిపింది.


పేటీఎం షేర్‌ ధర, శుక్రవారం (25 ఫిబ్రవరి 2023) ట్రేడ్‌లో 2.55% లాభంతో రూ. 622 వద్ద ముగిసింది. ఈ స్టాక్‌ గత 6 నెలల కాలంలో 19% క్షీణించింది, గత ఏడాది కాలంలో 21% పైగా పతనమైంది. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.