ITR Filing: ఐటీఆర్ ఫైలింగ్ తుది గడువు ముగిసింది. చివరి రోజైన జులై 31న ఏకంగా 72.42 లక్షల మంది ఐటీఆర్ ఫైల్ చేశారు. మొత్తం 5.83 కోట్ల మంది రిటర్నులు దాఖలు చేశారని ఆదాయపన్ను శాఖ తెలిపింది. దాదాపుగా గతేడాది స్థాయికి సమానంగా ఐటీఆర్‌లు వచ్చాయని వెల్లడించింది. ఆరంభంలో నెమ్మదిగా ఫైల్ చేసినా గడువు సమీపించే కొద్దీ వేగం పెరిగింది.
'2022, జులై 31న ఐటీఆర్ ఫైలింగ్ శిఖర స్థాయికి చేరుకుంది. ఒక్క రోజే 72.42 లక్షల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి' అని అధికారులు ప్రకటించారు. 2022-23 అసెస్‌మెంట్ ఏడాదికి గాను 2022, జులై 31 నాటికి 5.83 కోట్ల ఐటీఆర్‌లు ఫైల్ చేశారని వెల్లడించింది. గతేడాది 2021, డిసెంబర్ 31 వరకు గడువు పొడగించగా 5.89 కోట్ల మంది రిటర్నులు సమర్పించడం గమనార్హం.
కరోనా మహమ్మారి రావడంతో గత రెండేళ్లు ఐటీఆర్ ఫైలింగ్ తుది గడువును చాలాసార్లు పొడగించారు. ఈ ఏడాదీ అలాగే చేయాలని చాలా మంది విజ్ఞప్తి చేయగా ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయలేదు. ఐటీ పోర్టల్‌పై కొన్ని ఫిర్యాదులు వచ్చినా లోడ్‌ను సైట్ తట్టుకోవడం గమనార్హం.
'ఈ-ఫైలింగ్ పోర్టల్ కొన్ని రికార్డులు సృష్టించింది. ఆఖరి రోజు 4:29:30 గంటలకు సెకనుకు అత్యధికంగా 570 ఐటీఆర్‌లు ఫైల్ చేశారు. 7:44 గంటలకు నిమిషానికి 9573 మంది, 5-6 గంటల మధ్య 5,17,030 మంది ఐటీఆర్ దాఖలు చేశారు' అని ఐటీ శాఖ తెలిపింది. మొదట్లో జులై 7 నాటికి కోటి మంది మాత్రమే ఐటీఆర్ దాఖలు చేయగా 22 నాటికి 2.48 కోట్ల మంది సమర్పించారు.
తుది గడువు పొడగించబోమని కేంద్రం స్పష్టం చేయడంతో ఐటీఆర్ల దాఖలు వేగం పెరిగింది. 2022, జులై 25 నాటికి 3 కోట్ల మంది రిటర్నులు సమర్పించారు. ఆఖరి రోజు 72.42 లక్షల మంది ఫైల్ చేయడంతో 2019లోని 49 లక్షల రికార్డు బద్దలైంది. ప్రస్తుత అసెస్‌మెంట్ ఏడాదిలో 5.83 కోట్ల రిటర్నులు దాఖలవ్వగా 2.93 కోట్ల మంది ఐటీఆర్-1, 67 లక్షల మంది ఐటీఆర్-2, 63.35 లక్షల మంది ఐటీఆర్-3, 1.54 కోట్ల మంది ఐటీఆర్-4ను సమర్పించారు. 47 శాతం మంది ఆన్‌లైన్‌లో ఐటీఆర్ సమర్పించగా మిగిలిన వారు ఆఫ్‌లైన్ సాఫ్ట్‌వేర్లు ఉపయోగించి చేశారు.