Income Tax Return Filing 2024: 2023-24 ఆర్థిక సంవత్సరం లేదా 2024-25 మదింపు సంవత్సరానికి ఆదాయ పన్ను పత్రాలను సమర్పించే సీజన్‌ ప్రారంభమై అప్పుడే నెలన్నర గడిచింది. ఈ నెలన్నరలో దాదాపు 10 లక్షలకు పైగా ఐటీ రిటర్నులు దాఖలైనట్లు ఆదాయ పన్ను విభాగం వెల్లడించింది. ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌ ఫైలింగ్‌ తుది గడువుకు ఇంకా రెండున్నర నెలల సమయం ఉంది. 


ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌ ఫైలింగ్‌ కోసం అన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు ఫామ్‌-16 (Form-16) జారీ చేస్తాయి. జీతం రూపంలో ఆదాయం పొందే పన్ను చెల్లింపుదార్లకు ఇది అత్యంత కీలకమైన డాక్యుమెంట్‌. ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌ ఫైల్‌ (ITR Filing 2024) చేసే సమయంలో ఈ పత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది, టాక్స్‌పేయర్‌ పనిని సులభంగా మారుస్తుంది.


ఫామ్-16 అంటే ఏంటి? (What is Form-16)
ఫారం-16 అనేది ఉద్యోగి పర్సనల్‌ డాక్యుమెంట్‌ లాంటిది. ప్రతి ఉద్యోగికి విడివిడిగా ఫామ్‌-16ను కంపెనీ జారీ చేస్తుంది. ఇందులో, ఆ ఉద్యోగికి ఇచ్చిన జీతభత్యాలు (Salary and Allowances), ఉద్యోగి క్లెయిమ్ చేసిన మినహాయింపులు (Deductions), కంపెనీ యాజమాన్యం కట్‌ చేసిన టీడీఎస్‌ (Tax Deducted At Source) వంటి సమాచారం ఇందులో ఉంటుంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 203 ప్రకారం, కంపెనీలు తమ ఉద్యోగులకు ఫారం-16 ఇవ్వడం తప్పనిసరి. 


ఫామ్‌-16 పొందిన తర్వాత సదరు ఉద్యోగి ఆదాయ పన్ను రిటర్న్‌ ఫైల్‌ చేయాలి. 2023-24 ఆర్థిక సంవత్సరం లేదా 2024-25 మదింపు సంవత్సరానికి ఆదాయ పన్ను పత్రాలను సమర్పించడం ఏప్రిల్‌ 01 నుంచి ప్రారంభమైంది. ITR దాఖలుకు జులై 31 వరకు గడువు (ITR Filing Deadline 2024) ఉంది. ఫామ్‌-16 పొందిన వెంటనే ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేయడం మంచింది. తాత్సారం చేస్తే, చివరి రోజుల్లో పోర్టల్‌లో రద్దీ పెరిగి టాక్స్‌పేయర్లు ఇబ్బందులు పడడం గతంలో చాలాసార్లు కనిపించింది. 2024 జులై 31 తర్వాత కూడా ఐటీఆర్‌ ఫైల్‌ చేయవచ్చు, అయితే ఆలస్య రుసుము (Late fee) చెల్లించాలి.


జీతభత్యాల వివరాలు చెక్‌ చేసుకోండి
ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేసే ముందు, మీ దగ్గర ఉన్న ఫామ్‌-16ని క్షుణ్ణంగా చెక్‌ చేయండి. మీరు అందుకున్న జీతభత్యాలు ఫామ్-16లో సరిగ్గా నమోదయ్యాయో, లేదో చూసుకోండి. ఆ వివరాల్లో... హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), లీవ్ ట్రావెల్ అలవెన్స్ ‍‌(LTA) వంటివన్నీ ఉంటాయి. ITR ఫైల్‌ చేసే ముందు ఈ 5 విషయాలను కూడా చెక్‌ చేయడం మంచింది.


- మీ పాన్ నంబర్ సరిగ్గా ఉందో, లేదో చూసుకోండి. ఒక్క డిజిట్‌ తప్పుగా ఉన్నా TDS క్లెయిమ్ చేయలేరు.
- ఫారం-16లో మీ పేరు, చిరునామా, కంపెనీ TAN నంబర్‌ను తనిఖీ చేయండి.
- ఫామ్-16లో కనిపించే పన్ను మినహాయింపు వివరాలన్నీ ఫామ్-26AS & AISతో (Annual Information Statement) సరిపోలాలి.
- మీరు పాత పన్ను విధానాన్ని (Old Tax Regime) ఎంచుకుంటే, పన్ను ఆదా చేసే డిడక్షన్స్‌ వివరాలను తనిఖీ చేయండి.
- 2023-24 ఆర్థిక సంవత్సరంలో మీరు ఉద్యోగం/ ఉద్యోగాలు మారితే, పాత కంపెనీ/ కంపెనీల నుంచి కూడా ఫామ్-16 ఖచ్చితంగా తీసుకోవాలి.


మరో ఆసక్తికర కథనం: షేర్‌ మార్కెట్‌ పన్నులపై ఓ ఇన్వెస్టర్‌ ప్రశ్న - నవ్వు ఆపుకోలేకపోయిన ఆర్థిక మంత్రి